ఇక మిగిలేది వారిద్దరేనా?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్పలేని ప‌రిస్థితి నేటి రాజ‌కీయాల్లో చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే కీల‌క‌మైన విశాఖ‌ప‌ట్నం జిల్లాలోనూ ఇలాంటి ప‌రిస్థితి [more]

Update: 2020-09-26 15:30 GMT

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్పలేని ప‌రిస్థితి నేటి రాజ‌కీయాల్లో చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే కీల‌క‌మైన విశాఖ‌ప‌ట్నం జిల్లాలోనూ ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, ప‌నికిరారు.. పూర్తిగా ఔట్‌డేటెడ్ అనుకున్న నాయ‌కులు ఇప్పుడు టీడీపీ అందివ‌చ్చిన అవ‌కాశంగా మారుతున్నారు. అదే స‌మ‌యంలో పార్టీని ముందుకు న‌డిపిస్తారు.. వీరిలో స‌త్తా ఉంది.. అనుకున్న నాయ‌కులు మౌనం పాటిస్తున్నారు. దీంతో ఇప్పుడు కీల‌క‌మైన ప్రాధాన్యాల‌ను మార్చుకునే దిశ‌గా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని అంటున్నారు ప‌రిశీల‌కులు. విశాఖ‌లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది.

గంటా గ్రూపులోనే…..

ఈ క్రమంలోనే మాజీ మంత్రిగంటా శ్రీనివాస‌రావు.. విజృంభిస్తార‌ని, ఆయ‌న దూకుడు పెంచుతార‌ని, పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని చంద్రబాబు భావించారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న సైలెంట్ అయ్యారు. పోనీ..మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలైనా ఉన్నారు.. వారైనా పార్టీకి అండ‌గా ఉంటారు అనుకుంటారు.. వారిలో ఒక్క వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు మిన‌హా మిగిలిన ఇద్దరూ కూడా గంటా గ్రూపులో యాక్టివ్‌గా ఉన్నార‌నే ప్రచారం ఊపందుకుంది. పైగా వారు సైలెంట్ అయిపోయి.. వైసీపీకి లోపాయికారీగా స‌హ‌క‌రిస్తున్నార‌ని చంద్రబాబుకునివేదిక‌లు అందాయి. తాజాగా ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ సైకిల్ దిగేశారు. రేపోమాపో మ‌రో ఎమ్మెల్యే గ‌ణ‌బాబుది అదే దారి అంటున్నారు.

కీలకమైన జిల్లాలో…..

ఈ క్రమంలో కీల‌క‌మైన జిల్లాలో పార్టీని బ‌తికించుకునేది ఎలా? అని ఆయ‌న త‌ల‌ప‌ట్టుకున్నారు.ఈ క్రమంలోనే అందివ‌చ్చిన అవ‌కాశంగా అటు న‌గ‌రంలో వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు విజృంభిస్తున్నారు. అదే స‌మ‌యంలో జిల్లాలో మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు దూకుడుగా ఉన్నారు. నిజానికి అయ్యన్న ప‌ని అయిపోయింద‌ని పార్టీలో ఓ నిర్ణయానికి వ‌చ్చారు., గ‌త ఏడాది ఆయ‌న ఓడిపోవ‌డం, పార్టీలోనే అసంతృప్త నేత‌గా ఆయ‌న మారిపోవ‌డం వంటివి చంద్రబాబుకు ఆయ‌న‌పై న‌మ్మకం స‌న్నగిల్లేలా చేశాయి. అయితే, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న దూకుడు పెంచారు. డాక్టర్ సుధాక‌ర్ విష‌యం నుంచి తాజాగా మంత్రి గుమ్మనూరు జ‌య‌రాం వ్యవ‌హారం వ‌ర‌కు ఆయ‌న వ్యవ‌హ‌రించిన శైలితోపాటు రాజ‌ధాని విష‌యంలో అమ‌రావ‌తికి జై కొట్టడం వ‌ర‌కు కూడా బాబుకు ఆయ‌న‌పై న‌మ్మకం పెరిగింది.

యాక్టివ్ గా ఉండటంతో….

ఇక‌, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు కూడా పార్టీకి అండ‌గా ఉంటున్నారు. వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా ఆయ‌న దూకుడు చూపుతున్నారు. పార్టీ కార్యక్రమాల‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. పైగా చంద్రబాబు ఎలాంటి పిలుపు ఇచ్చినా ఆయ‌న నిర్వహిస్తున్నారు. ఇక‌, పార్టీలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో మున్ముందు వారికి ప్రాదాన్యం ఇవ్వడం మంచిద‌నే నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు టీడీపీలో ప్రచారం జ‌రుగుతోంది. మంచిదే క‌దా.. అంటున్నారు సీనియ‌ర్లు. పోయే వారిని ఎవ‌రూ ఆప‌లేరు. ఉన్నవారితో అయినా పార్టీ బాగుప‌డాలి క‌దా.. అంటున్నారు.

Tags:    

Similar News