బాబుకు ఎక్కడా చోటు లేకుండా చేస్తున్నారే….?

చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న రోజుల్లో నాయుడుజీ అంటూ జాతీయ మీడియాలో కధనాలు వచ్చేవి. దేశ రాజకీయాల్లో చీమ చిటుక్కుమన్నా కూడా ఆనాటి యువ ముఖ్యమంత్రి [more]

Update: 2020-09-25 06:30 GMT

చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న రోజుల్లో నాయుడుజీ అంటూ జాతీయ మీడియాలో కధనాలు వచ్చేవి. దేశ రాజకీయాల్లో చీమ చిటుక్కుమన్నా కూడా ఆనాటి యువ ముఖ్యమంత్రి బాబు వైపు అంతా చూసే వారు. చంద్రబాబు కూడా పదే పదే ఢిల్లీకు వచ్చి చక్రం తిప్పేవారు ఇదంతా దాదాపు పాతికేళ్ల క్రితం నాటి కధ. 2004 తరువాత చంద్రబాబు ఉమ్మడి ఏపీలో అధికారం కోల్పోయారు. దానికి నిలబెట్టుకుని ప్రయత్నంలో ఆయన పోరాటం పదేళ్ళపాటు ఏపీలోనే సాగింది. చివరికి 23 జిల్లాల ఏపీకి సీఎంగా తొమ్మిదేళ్ళు పనిచేసిన చంద్రబాబు కేవలం 13 జిల్లాల ఏపీకి సీఎంగా సర్దుకోవాల్సివచ్చింది. పోనీ ఉన్నదాంట్లోనే రాజకీయ కధ నడిపిద్దామని బాబు ముచ్చటపడినా ఆయనకు బలమైన ప్రత్యర్ధిగా ఉన్న జగన్ గట్టి దెబ్బ తీసి 2019 ఎన్నికల తరువాత ఏపీకి సీఎం అయిపోయారు. ఇపుడు చంద్రబాబు ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి ప్రతిపక్ష నేత మాత్రమే.

ఇల్లు చక్కదిద్దుకుని….

ఇక చంద్రబాబుకు అర్జంటుగా ఏపీలో అధికారం కావాలి. 2024 నాటికి మళ్లీ సైకిల్ అసెంబ్లీ గేటులోపలికి వెళ్ళకపోతే బాబు టీడీపీ రాజకీయ కధలు పరిసమాప్తం అవుతాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందే. దానికోసం చంద్రబాబు జాతీయ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. చంద్రబాబుకు మొదటి శత్రువు జగన్. అందువల్ల ఆయన మోడీని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. తాను ఒంటరిగా పోటీ చేసిన తరువాత 2019 ఎన్నికల్లో వచ్చిన చేదు ఫలితాలు చూసుకున్న బాబు బెంబేలెత్తుతున్నారు. మోడీ కరుణిస్తేనే తనకు మళ్లీ ఏపీ పీఠం దక్కుతుందని ఆశపడుతున్నారు. అందుకే మోడీని పల్లెత్తు మాట అనడంలేదు.

ఇంకా దగ్గరగా…..

చంద్రబాబు వ్యూహం గమనించిన జగన్ మోడీని అసలు వదలడంలేదు. మోడీకి ఓ వైపు ఎన్డీయే మిత్రులు హ్యాండ్ ఇస్తున్నా కూడా జగన్ మాత్రం వారిని మించిన వీర భక్తిని ప్రదర్శిస్తూ మోడీకి చేరువ అయిపోయారు. వివాదాస్పద వ్యవసాయ బిల్లుకు శిరోమణీ అకాలీదళ్ కూడా నో చెప్పి కేంద్ర మంత్రి పదవినే వదులుకుంది. కానీ జగన్ మాత్రం జై మోడీ అంటున్నారు. ఈ పరిణామాలు చూసిన వారు మోడీకి జగన్ కన్నా పెద్ద మిత్రుడు వేరే లేరని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో చేతిలో ఎంపీలు, అధికారం ఏమీ లేని చంద్రబాబు ఉత్త చేతులతో ఎంత ప్రేమ చూపించినా మోడీకి దగ్గర కాలేకపోతున్నారు.

అటు ఆయనలా….

ఇక మరో వైపు చూసుకుంటే దేశంలో మోడీ పొలిటికల్ గ్రాఫ్ తగ్గుతోందని గ్రహించిన కేసీయార్ యాంటీ మోడీ స్టాండ్ తీసుకున్నారు. ఆయన విద్యుతు సంస్కరణల బిల్లుని తప్పుపడుతున్నారు. వ్యవసాయ బిల్లును కాదంటున్నారు. రాష్ట్రాలకు దక్కాల్సిన జీఎస్టీ వాటా విషయంలో ఏకంగా పార్లమెంట్ లోనే తన ఎంపీల చేత మోడీని గట్టిగా నిలదీస్తున్నారు. దేశంలో పది పార్టీలు ఇపుడు మోడీని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ కూటమిలో కేసీయార్ చేరారు. రానున్న రోజుల్లో మోడీ గ్రాఫ్ మరింతగా తగ్గితే ఈ పార్టీల సంఖ్య పెరుగుతుంది కూడా. అంటే మరో మూడున్నరేళ్ళ వ్యవధి సార్వత్రిక ఎన్నికలకు ఉండగా యాంటీ మోడీ ఫ్లాట్ ఫారం మీద కేసీయర్ ముందే కర్చీఫ్ వేశారు. దాంతో చంద్రబాబు అటు వైపు ఎపుడైనా వెళ్ళి చక్రం తిప్పవచ్చు అనుకుంటే మాత్రం కేసీయారే పెద్ద అడ్డు చక్రం వేస్తారు. మొత్తం మీద అటు యూపీయే కూటమికి, ఇటు ఎన్డీయే కూటమికి కూడా చంద్రబాబు అనివార్యంగానే దూరమైపోతున్నారు. జగన్ ,కేసీయార్ ల రాజకీయం ముందు చంద్రబాబువెలవెలపోతున్నారు.

Tags:    

Similar News