బాబు సీబీఐ మోజు తీర్చేస్తారా ?

చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. ఆయన అధికారంలో ఉంటే సీబీఐని ఆమడ దూరం పెడతారు. ఎందుకంటే అది కేంద్ర దర్యాప్తు అని, తనకు కూడా ఏసీబీ ఉందని [more]

Update: 2020-09-22 06:30 GMT

చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. ఆయన అధికారంలో ఉంటే సీబీఐని ఆమడ దూరం పెడతారు. ఎందుకంటే అది కేంద్ర దర్యాప్తు అని, తనకు కూడా ఏసీబీ ఉందని అంటారు. అంతేనా చంద్రబాబు సీబీఐ కి కూడా ఏపీలో ప్రవేశం లేదు అనేస్తారు. జీవో రాత్రికి రాత్రి తెచ్చేస్తారు. ఇక సీబీఐ అన్న మాట తనకు వినబడకూడదు అని చండశాసనం చేస్తారు. సీన్ కట్ చేస్తే బాబు విపక్షంలోకి రాగానే సీబీఐ మళ్ళీ రావాలి అంటారు. ఏపీలో ప్రతీ దాని మీద సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తారు. ఒక విధంగా చంద్రబాబు చెప్పిందే జరిగితే సీబీఐ కి దేశవ్యాప్తంగా కేసులు అక్కరలేరు. ఒక్క ఏపీతోనే సరిపోతుంది.

రెడీ అంటున్నారుగా …?

రాజకీయాల్లో సీనియర్, పెద్దాయన చంద్రబాబు చెప్పారు కదా అన్న దాంతో చేస్తున్నారా లేక విపక్షం నోళ్ళు మూయించాలని చేస్తున్నారా అన్నది పక్కన పెడితే జగన్ మాత్రం తాను సీఎం అయ్యాక చాలా కేసులు సీబీఐ కి అప్పగిస్తున్నారు. అసలు జగన్ వస్తూనే సీబీఐ కి ఏపీలో ఎంట్రీ ఇచ్చేశారు. అంటే జగన్ కి సీబీఐ అధికారంలో ఉన్నా కూడా కావాలి. చంద్రబాబు లాంటి వారు పదే పదే అడుగుతారు అని తెలిసినా జగన్ సీబీఐని ఏపీలో ఎందుకు రప్పించారు అంటే అక్కడే ఉంది అసలు కధ. అదే జగన్ మాస్టర్ ప్లాన్ కూడా.

కిక్కురుమ‌నకుండా….

ఇపుడు ఏపీలో అందరికీ ఒక విషయం మీద అవగాహన‌ ఉంది. అదేంటి అంటే చంద్రబాబుకు సీబీఐ మీద మా చెడ్డ నమ్మకం ఉందని. అందుకే ఆయన ప్రతీ కేసుని సీబీఐకి అప్పగించమంటున్నారని. దాంతో ఇపుడు చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి మీద కానీ, అమరావతి మీద కానీ సీబీఐ విచారణ జరిపిస్తే ఆయన కిక్కురుమనగలరా. సీబీఐ విచారణ మామీద వేస్తారా అంటూ కళ్ళు పెద్దవి చేసి గద్దించినా దానికి విలువ ఉంటుందా. ఆయన నానాయాగీ చేసినా కూడా జనం స్పందిస్తారా. మీరే కదా బాబూ సీబీఐ భేష్ అంటూ ఒకటికి పదిసార్లు పొగిడి మరీ ప్రతీ దానికీ విచారణను కోరుకున్నది అని అంటారు కదా.

కలల రాజధాని మీదనే…..

సీబీఐ విచారణ కోసం జగన్ అంతా సిధ్ధం చేస్తున్నారు. అదీ చంద్రబాబు కలల రాజధాని అమరావతి భూముల మీద. అక్కడ 2014 నుంచి డిసెంబర్ మధ్య కాలంలో అంటే రాజధాని ప్రకటన వచ్చేలోపున విషయం తెలుసుకుని అంతా ఒక్క పెట్టున వెళ్ళి మరీ మూకుమ్మడిగా అమరావతి భూములను ఎలా కొన్నది అన్న దాని మీద కూడా సీబీఐ విచారణకు జగన్ అప్పగించబోతున్నారు ఏకంగా 4,075 వేల ఎకరాల భూములు టీడీపీకి చెందిన వారు, సానుభూతిపరులూ అంతా ఒక్కసారే కల కన్నట్లుగా అప్పటికి ఏమీ కానీ భూములను వేలం వెర్రిగా ఎలా కొన్నారో కూడా సీబీఐ విచారిస్తుందట. ఇక అంతేగా అసైన్డ్ భూములు, దళితుల నుంచి లాక్కున్న భూముల కధ కూడా బయటకు వస్తుందిట.

చినబాబుకు కూడా…..

వీటితో పాటే ఫైబర్ గ్రిడ్ పేరిట నాటి ఐటీ మంత్రి లోకేష్ ఆద్వర్యంలో జరిగిన హడావుడి మీద సీబీఐ కన్ను పెడుతుందిట. దాదాపు రెండువేల కోట్ల రూపాయల అవినీతి ఫైబర్ గ్రిడ్ లో జరిగింది అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంటున్నారు. అంటే మొత్తానికి ఈ రెండు కేసులు చాలు పెదబాబు, చినబాబు కూసాలు కదలడానికి అంటున్నారు వైసీపీ నేతలు. సీబీఐ నీవు ఎపుడూ కోరిందే కదా బాబూ, ఇపుడు అందుకే సీబీఐ విచారణ జరిపిస్తాం, నిప్పు నిజాయతీ అని అనుకుంటే హ్యాపీగా బయటపడతారు కదా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి వారి మీద వీరి మీద సీబీఐ ఎందుకు మీ మెడలోనే ఆ వరమాల వేస్తామని జగన్ అంటున్నారు. చంద్రబాబు గారు తట్టుకుంటారా..

Tags:    

Similar News