బాబు కంటూ ఒక బ్రాండ్ లేదా ?

చంద్రబాబు తాను రాజకీయంగా సీనియర్ అని చెప్పుకుంటారు. దేశ రాజకీయాలను ఎన్నో సార్లు మలుపు తిప్పానని, చక్రం తిప్పానని కూడా చెప్పుకుంటారు. అటువంటి చంద్రబాబు పాలన గురించి [more]

Update: 2020-09-13 15:30 GMT

చంద్రబాబు తాను రాజకీయంగా సీనియర్ అని చెప్పుకుంటారు. దేశ రాజకీయాలను ఎన్నో సార్లు మలుపు తిప్పానని, చక్రం తిప్పానని కూడా చెప్పుకుంటారు. అటువంటి చంద్రబాబు పాలన గురించి సగటు జనాన్ని అడిగితే ఠక్కున గుర్తుకు వచ్చే పధకం ఏమైనా ఉందా అంటే బుర్ర గోక్కోవాలా. చంద్రబాబు తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో తనదైన ముద్ర బలంగా వేసుకోలేదా. పాలనలో ఆయన దూకుడు చూపించలేదా. అంటే సమాధానాలు అంత తొందరగా రావు కదా. అదే వైఎస్సార్ గురించి చెప్పమంటే ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్. ఉచిత విద్యుత్ ఇలా కళ్ల ముందు ఎన్నో కార్యక్రమాలు కదలాడుతాయి. ఇక ఆయన తనయుడు జగన్ గత ఏడాదిన్నరగా సీఎంగా ఉన్నారు.

ఆనవాళ్ళు బలంగా…..

జగన్ తన పాలనలో చెప్పుకోదగినవి ఫలానా ఉండాలని తపన పడుతున్నట్లుగా తొలి నుంచి తెలుస్తోంది. జగన్ అనగానే ఇపుడు వెంటనే గుర్తుకువచ్చేది వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, రైతులకు భరోసా పధకాలు, ఇక అనేక కులాలను కలుపుకుంటూ ఇచ్చే సంక్షేమ పధకాలు, ఇక కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అది కూడా రేపటి చరిత్ర చెబుతుంది, అంతే కాదు, దిశ చట్టం వంటి సంస్కరణలు కూడా గుర్తుకు వస్తారు. ఇంకో వైపు రెవిన్యూ చట్టాల్లో మార్పులు చేస్తూ కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారట. అదే జరిగితే జగన్ ఇంకా బాగా గుర్తుంటారు.

బాబుకు దక్కని ఖ్యాతి…..

బాబు అంటే హైటెక్ సీఎం అని ముద్ర ఆయన సీఎం అయిన కొత్తల్లో ఉండేది. దానికి సాక్షిగా హైటెక్ సిటీని బాబు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీగా రాష్ట్రం కొనసాగి ఉంటే చంద్రబాబుకు ఆ కీర్తి స్థిరంగా ఉండేది, విభజన జరిగాక అది మసకబారింది.ఇక విభజన ఏపీలో చంద్రబాబు అన్నింటికంటే మిన్నగా అమరావతి రాజధాని చూపించి శాశ్వతం కావాలనుకున్నారు. కానీ జగన్ వచ్చి దాన్ని చెరిపేస్తున్నారు. మూడు రాజధానులు కనుక అయితే కచ్చితంగా జగనే అందరికీ గుర్తుంటారు తప్ప చంద్రబాబు ఊసే తలవరేమో.

రిస్క్ తీసుకుంటేనే …?

ఇక ఎన్టీయార్ అంటే కిలో రెండు రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు గుర్తుకువస్తాయి. వైఎస్సార్, జగనే కాదు, కేసీయార్ కూడా తనదైన ముద్ర వేసే పాలనలో కీలక నిర్ణయాలు అనేకమైనవి తీసుకున్నారు. దానికి కారణం రాజకీయంగా దూకుడుతనం వారందరిలో ఉంది. అందుకే పాతకు భిన్నంగా నవ్యత్వం వైపుగా సాగారు. అయితే చంద్రబాబు మాత్రం ఎందుకో దూకుడుకి భిన్నం, ప్రతీ దానికీ ఒకటికి పదిమార్లు ఆలోచిస్తారు. ఇలా చేస్తే ఏమవుతుందోనని ఆయనే మొదట‌ బెంగటిల్లుతారు. అందువల్లనే ఆయన బలమైన ముద్ర పాలనాపరంగా వేసుకోలేకపోయారు అన్న విశ్లేషణ ఉంది. చంద్రబాబుకు చెప్పుకునేందుకు చరిత్రలో ఏమీ లేదని అందుకే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు అంటున్నారు. మొత్తానికి రాజకీయ వ్యూహాల్లోనూ, పదవుల విషయంలోనూ దూకుడు చూపించే చంద్రబాబు పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో బాగా వెనకబడిపోవడం వల్లనే రేపటి చరిత్రలో ఆయన తనదైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకోలేకపోయారేమోనని చెప్పాలి.

Tags:    

Similar News