ఎన్నికలు ఎపుడొచ్చినా ఆయనే సీఎం ?

అదేంటో అత్యాశకు కూడా హద్దు ఉండాలి. ఏపీలో జగన్ కుర్చీ మీద కూర్చున్నారో లేదో కానీ దిగిపో అంటూ లంకించుకున్న చంద్రబాబుకు, తమ్ముళ్ళకు ఈ పదిహేను నెలల [more]

Update: 2020-09-12 15:30 GMT

అదేంటో అత్యాశకు కూడా హద్దు ఉండాలి. ఏపీలో జగన్ కుర్చీ మీద కూర్చున్నారో లేదో కానీ దిగిపో అంటూ లంకించుకున్న చంద్రబాబుకు, తమ్ముళ్ళకు ఈ పదిహేను నెలల వైసీపీ పాలన చాలా భారంగా ఉండవచ్చు. చెప్పాలంటే యుగాలు, జగాలు అయిపోయినట్లుగా కూడా ఉండవచ్చు. కానీ వయసు, అనుభవం, సీనియారిటీ ఇవన్నీ చూసుకున్నా కూడా చంద్రబాబు నోటి వెంట రాని మాటలు ఇపుడు వస్తున్నాయి. ఇంకా మూడు వంతుల అధికారం జగన్ చేతిలో ఉంది, కానీ జగన్ పని అయిపోయిందని, రేపో మాపో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, వైసీపీని జనం ఇంటికి పంపిస్తారని జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టేశారు.

అమితానందమేనా..?

ఈ మధ్య ఒక కీలక పరిణామం జరిగిందని చంద్రబాబు అనుకుంటున్నారు. మామూలుగా అయితే అది అత్యంత సాధారణ పరిణామంగా జనం చూస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్న వేళ చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారుట. . ఇది పక్కా కర్టెసీ కాలు. కానీ దీంతోనే టీడీపీకి, తమ్ముళ్లకూ పూనకాలు వచ్చేస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియా అయితే ఏపీ రాజకీయమే మారిపోయినట్లుగా బిల్డప్ ఇస్తోంది. ఈ ఉత్సాహంతో చంద్రబాబు ఎపుడు ఎన్నికలు జరిగినా మాదే విజయం అనేస్తున్నారు. అంటే బీజేపీతో పొత్తు ఇక ఖాయమని ఆయన అతి అంచనాగా ఉంది కాబోలు.

ఎందుకు ఓటేస్తారో…?

చంద్రబాబు ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ని తిట్టడం తప్ప జనాలకు చేరువ అయ్యే ప్రయత్నం ఏదైనా చేశారా అన్న విశ్లేషణ ఒకటి ఉండనే ఉంది. ఇక జగన్ తప్పులు చేస్తే ఆ వ్యతిరేక ఓటు తనకు అనుకూలంగా మారి గెలిచేస్తానని, ఏపీ జనాలకు తన కంటే మంచి పాలకుడు లేడని చంద్రబాబు మొండి నమ్మకం. కానీ జగన్ విపక్షంలో ఉన్నపుడే చుక్కలు చూపించారు. ఇపుడు అధికారంలో ఉన్నారు. ఆయన సులువుగా ఓడిపోతారా. పైగా బాబే అనుకుంటున్నట్లుగా జనసేన, బీజేపీ టీడీపీ కలసి కూటమి కట్టినా అది పాత చింతకాయ పచ్చడి లాంటిదే కదా. దాని వైపు గుడ్డిగా మొగ్గు చూపుతారా. మరి ఆ మాత్రం ఆలోచన లేకుండా చంద్రబాబు ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే జగన్ ఇంటికి వెళ్ళిపోతాడూ పీఠం తనదేనని ధీమాగా ఎందుకు చెబుతున్నారో.

నమ్మకమే లేదా…?

చంద్రబాబు ఒక విషయం తెలుసుకోలేకపోతున్నారు. తాను బలంగా ఉన్నానని, మరో అయిదారేళ్ళు రాజకీయం చేస్తానని అంటున్నారు. కానీ తమ్ముళ్లకు అక్కడే గురి కుదరడం లేదు. ఇక చంద్రబాబు తన తరువాత లోకేష్ బాబుని పెడుతున్నారు. దాంతో సీనియర్ నేతలకు మండుకొస్తోందిట. ఇవన్నీ పక్కన పెట్టినా బాబుది చూసేసిన సినిమా అని జనాలకు రోతగానే ఉందని నివేదికలు అందుతున్నాయి. జగన్ ఇంకా యువకుడు, చెప్పిన మాటను నిలబెట్టుకుని వెళ్తున్నాడు. పొరపాట్లు జరిగినా సీట్లు తగ్గుతాయేమో కానీ ఓడిపోయేటంత సీన్ ఉండదని అంటున్నారు. చంద్రబాబు అన్ని రకాలుగా తన పార్టీకు కుదేల్ చేసుకుని ఎన్నికలు పెడితే నేనే వస్తాను అని వట్టి ప్రచారం చేసుకోవడం వల్ల తమ్ముళ్ళకే కామెడీ పీస్ అవుతున్నారని వైసీపీ వేస్తున్న సెటైర్లు కూడా ఆలోచించాల్సినవే.

Similar News