వన్ వీక్ మాత్రమేనా? ఆ తర్వాత వదిలేయడమేనా?

పాత సామెత అయినా ఇప్పుడు అది వర్తించకపోయినా దానిని గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆంధ్రులు ఆరంభ శూరులు అనేది సామెత. ఈ సామెత ప్రజల కన్నా [more]

Update: 2020-09-18 09:30 GMT

పాత సామెత అయినా ఇప్పుడు అది వర్తించకపోయినా దానిని గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆంధ్రులు ఆరంభ శూరులు అనేది సామెత. ఈ సామెత ప్రజల కన్నా నేతలకే ఎక్కువ వర్తిస్తుంది. ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే సాగుతాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునుంచే వేడెక్కాయి. ఏ అంశమూ పట్టుమని వారం రోజులకు మించి ఉండదు. నేతలు కూడా దానిని తర్వాత మరిచిపోతుంటారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు టీడీపీ చేసింది.

ఏ ఒక్క దానిపైనా…?

అయితే వాటిలో ఏ ఒక్కంటి మీద పూర్తి స్థాయిలో పోరాటం చేయలేకపోయింది. ఇసుక అక్రమ తవ్వకాలు, కొరత తీసుకుంటే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఇసుక మీద పోరాటం చేశారు. ఒక రోజు చంద్రబాబు దీక్ష కూడా చేశారు. అయితే ఇప్పుడు ఇసుక కొరత అలాగే ఉంది. ఇసుక ఊసు ఇప్పుడు లేనేలేదు. అమరావతిపై నాడు జోలెపట్టుకుని మరీ చంద్రబాబు తిరిగారు. ఇప్పుడు కరోనా కారణంగా ఆందోళన చేయకపోలేకపోతున్నప్పటికీ రైతుల ఊసు పట్టించుకుంటున్నట్లు కన్పించడం లేదు.

అక్రమ కేసులంటూ……

ఇక తొలినాళ్లలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ, ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలను గ్రామ బహిష్కరణ చేశారంటూ చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆత్మకూరుకు చంద్రబాబు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మకూరు టీడీపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. దానికి వైసీపీ బాధితుల శిబిరం అని కూడా పేరు పెట్టారు. ఇప్పుడు దాని ఊసు కూడా లేదు. అంటే ఆత్మకూరు మిగిలిన ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తల పరిస్థిితి బాగానే ఉందనుకోవాలా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కూడా….

కొద్దిరోజల కిందట ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చంద్రబాబు భుజానికెత్తుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ పై స్వతంత్ర సంస్థతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేపట్టారు. ఇప్పుడు దాని ఊసు కూడా చంద్రబాబు ఎత్తడం లేదు. కొత్త ఉచిత విద్యుత్తు, పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు అంశంపైనే చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇలా ప్రతి అంశాన్ని కొద్దిరోజుల పాటు హడావిడి చేయడం ఆ తర్వాత దాని ఊసు మర్చిపోవడం ఏపీలో అలవాటుగా మారిందంటున్నారు. పోనీ గతంలో చంద్రబాబు లేవనెత్తిన సమస్యలు పరిష్కారమయ్యాయా? అంటే అదీ లేదు. కానీ కేవలం వారం రోజుల పాటే హడావడి. ఆ తర్వాత మామూలే.

Tags:    

Similar News