లీకువీరులెవ్వరు? కోవర్టులు బాబును దెబ్బేస్తున్నారా?

తెలుగుదేశం పార్టీలో ఇంటిదొంగలు ఎక్కువయ్యారు. అంతర్గత సమావేశాల వివరాలు బయటకు పొక్కుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు కూడా ప్రత్యర్థి పార్టీకి సులువుగా చేరిపోతున్నాయి. సమాచారాన్ని కావాలనే [more]

Update: 2020-03-04 06:30 GMT

తెలుగుదేశం పార్టీలో ఇంటిదొంగలు ఎక్కువయ్యారు. అంతర్గత సమావేశాల వివరాలు బయటకు పొక్కుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు కూడా ప్రత్యర్థి పార్టీకి సులువుగా చేరిపోతున్నాయి. సమాచారాన్ని కావాలనే బయటకు ఎవరో చేరవేస్తున్నారన్న అనుమానం అధినేత చంద్రబాబులోనూ లేకపోలేదు. అయితే ఎవరనేది తేలకపోయినా సమాచారం మాత్రం పక్కాగా బయటకు చేరవేస్తున్నారన్నది ఇటీవల పార్టీ బ్యాక్ ఆఫీస్ తేల్చింది. దీంతో టీడీపీలో కోవర్టులో ఎవరో తెలియక అధినేత చంద్రబాబు తల పట్టుకుంటున్నారు.

క్రమశిక్షణతో కూడుకున్న ……

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడుకున్నది. పార్టీ అధినేత చంద్రబాబు ఏ సమస్య విషయంలోనైనా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీనియర్ నేతలతోనూ, ముఖ్య కార్యకర్తలతోనో చర్చించే అలవాటు ఉంది. టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన కార్యకర్తల ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. ఫీడ్ బ్యాక్ ను అనుసరించే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వారికి దిశానిర్దేశం కూడా చేస్తారు. అయితే టెలికాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయాలు ప్రత్యర్థులకు వెంటనే చేరిపోతుండటం పార్టీలో ఆందోళన కల్గిస్తుంది.

అంతర్గత వ్యవహారాలను….

పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటకు పొక్కకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సీనియర్ నేతలతో సమావేశమయినా, టెలికాన్ఫరెన్స్ అయినా సరే ఫోన్లు సెక్యూరిటీలో డిపాజిట్ చేసి రావాల్సిందే. ఫోన్ల ద్వారా సమాచారం బయటకు వెళ్లకుండా చంద్రబాబు ఈ జాగ్రత్తలు ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఈ విధానాన్ని పాటిస్తున్నారు. కానీ ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ బయటకు వెళుతుందని పార్టీ అగ్రనేతలు గుర్తించారు. ఇందుకోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదని అంటున్నారు.

సమాచారాన్ని లీక్ చేస్తూ…..

ఇటీవల జరిగిన ఒక టెలికాన్ఫరెన్స్ లో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ చర్చకు వచ్చిందట. ఒక మాజీ మంత్రి ఫోన్ లో పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల కోసం సేకరించే స్థలాలను ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని, వైసీపీ నేతల జోక్యం ఉందని ఉదాహరణలతో సహా చెప్పారట. అయితే టెలికాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ఆ సమాచారం ఇచ్చిన నేతకు ఒక అధికారి ఫోన్ చేసి అలా జరగడం లేదని, అంతా సజావుగానే జరుగుతుందని చెప్పడంతో ఆయన షాక్ కు గురయ్యారట. ఈ విషయం చంద్రబాబు దృష్టికి కూడా తేవడంతో పార్టీ కార్యాలయ సిబ్బందికి క్లాస్ పీకరాట. టెలికాన్ఫరెన్స్ అంటే పదుల సంఖ్యలో సిబ్బంది పనిచేస్తుంటారు. ఇది వారి పనేనా? లేక పార్టీ నేతలే ఎవరైనా కోవర్టుగా వ్యవహరిస్తున్నారా? అన్నది తేల్చాల్సిన బాధ్యత చంద్రబాబు సీనియర్ నేతలకు అప్పగించారట. మొత్తం మీద టీడీపీలో కోవర్టులు ఎవరన్న దానిపై ఆ పార్టీలో పెద్దయెత్తున చర్చజరుగుతోంది.

Tags:    

Similar News