ఆ నేత…ఫ్యామిలీ రాజ‌కీయాల‌కు బాబు శుభం కార్డు

అవును… ఇప్పుడు ఈమాటే వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కొంద‌రిని వాడుకుని వ‌దిలేస్తార‌నే టాక్ ఎప్పటి నుంచో పొలిటిక‌ల్ స‌ర్కిళ్లలో వినిపిస్తూనే ఉంది. ఈ జాబితాలో సొంత [more]

Update: 2020-09-01 12:30 GMT

అవును… ఇప్పుడు ఈమాటే వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కొంద‌రిని వాడుకుని వ‌దిలేస్తార‌నే టాక్ ఎప్పటి నుంచో పొలిటిక‌ల్ స‌ర్కిళ్లలో వినిపిస్తూనే ఉంది. ఈ జాబితాలో సొంత త‌మ్ముడు, సొంత తోడ‌ల్లుడు కూడా ఉన్నార‌ని రాజ‌కీయ నేత‌లు విమ‌ర్శిస్తూ ఉంటారు. గ‌తాన్ని ప‌రిశీలిస్తే.. ఈ విమ‌ర్శలు నిజ‌మేన‌ని కూడా అనిపిస్తూ ఉంటుంది. మ‌రి చంద్రబాబు ఎందుకు అలా చేస్తారో.. ఎందుకు విమ‌ర్శలు కొని తెచ్చుకుంటారో తెలియ‌దు కానీ… ఇప్పుడు కూడా ఆయ‌న చుట్టూ ఇలాంటి మ‌రో విమ‌ర్శ త‌చ్చాడుతోంది. అదే.. పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడుగా చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన దివంగ‌త‌ డీకే ఆదికేశ‌వుల నాయుడు కుటుంబాన్ని కూడా చంద్రబాబు వాడుకుని తొక్కేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

బాబు హయాంలో……

డీకే ఫ్యామిలీ.. టీడీపీలో చాలా కాలంగా సేవ‌లు అందిస్తోంది. పైగా ఆర్థికంగా కూడా బ‌లంగా ఉన్న ఈ కుటుంబం పార్టీని కూడా అనేక రూపాల్లో ఆదుకుంది. ప్రతిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో పార్టీ ఎదుగుద‌ల‌కు నిధులు స‌మ‌కూర్చార‌నే పేరు కూడా ఉంది. ఆదికేశ‌వుల‌నాయుడు ఒక‌ప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో కీల‌క నేత‌గా చ‌క్రం తిప్పారు. 2004లో పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు కూడా ఆయ‌న చిత్తూరు ఎంపీగా గెలిచారు. 2007లో చంద్రబాబు చేపట్టిన మీకోసం యాత్రకు కూడా భారీగా నిధులు స‌మ‌కూర్చార‌న్న టాక్ ఉంది.

ఓడిపోతానని చెబుతున్నా…..

ఆ త‌ర్వాత వైఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు లోన‌యి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. పార్లమెంటులో నాడు కాంగ్రెస్‌పై ప్రవేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీడీపీ ఎంపీగా ఉండి ఓటేసినందుకు గాను ఆయ‌న వైఎస్ టీటీడీ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న స‌తీమ‌ణి.. స‌త్యప్రభ 2014 ఎన్నిక‌ల వేళ‌ సైకిల్ ఎక్కారు. ఆమె చంద్రబాబుకు భారీగా నిధులు స‌మ‌కూర్చార‌న్న ప్రచారం ఉంది. ఆ ఎన్నిక‌ల్లో ఆమె చిత్తూరు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే, ఆమెకు త‌గిన గుర్తింపు ఇవ్వలేద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో స‌త్యప్రభను చంద్ర‌బాబు బ‌ల‌వంతంగా రాజంపేట ఎంపీ స్థానం నుంచి పోటీచేయించారు. వాస్తవానికి ఆమె అక్కడ‌కు వెళ్లేందుకు ఇష్టప‌డ‌లేదు. కొత్తస్థానం, పైగా వైఎస్సార్‌సీపీకి బ‌లంగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తాను ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని ఆమె మొర‌పెట్టుకున్నారు.

ఐటీ దాడులతో…..

అయిన‌ప్పటికీ.. చంద్రబాబు ఆమెను అక్కడ‌కే పంపించారు. దీంతో భారీగా నిధులు వెచ్చించినా.. గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇక‌, అప్పటి నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె వ్యాపారాలు, విద్యాసంస్థల‌పై ఐటీ దాడులు జ‌రిగాయి. ఈ క్రమంలోనే ఆమె చంద్ర‌బాబు సాయం కోరినా లైట్ తీస్కొన్నార‌ట‌. ఇక పార్టీలో ఉంటే అన‌వ‌స‌రంగా చేతిచ‌మురు వ‌దిలించుకోవ‌డం త‌ప్ప ఒరిగేదేమి ఉండ‌ద‌ని ఆమె స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా డీకే ఫ్యామిలీ రాజ‌కీయాల‌కు చంద్రబాబు శుభం కార్డు వేశార‌ని జిల్లా టీడీపీలో సెటైర్లు ప‌డుతున్నాయి. నిజానికి ఇలాంటి వారిని చంద్రబాబు కాపాడుకోల్సిన అవ‌స‌రం ఉన్నప్పటికీ.. ఆయ‌న ఉదాసీన‌తే పార్టీని భ్రష్టు ప‌ట్టిస్తోంది. మ‌రి ఎప్పటికి బాబు మార‌తారు ? అనే ప్రశ్నలకు ఇప్పట్లో ఆన్సర్లు లేవు.

Tags:    

Similar News