పులివెందులతోనే పులిసిపోతుందా?

చంద్రబాబు ఎక్కడ పర్యటించినా పులివెందుల ప్రస్తావన లేకుండా ప్రసంగించడం లేదు. ఎన్నికలకు ముందు నుంచే చంద్రబాబు పులివెందులను రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ చేశారు. పులివెందుల పంచెలు కట్టుకుని [more]

Update: 2020-02-28 15:30 GMT

చంద్రబాబు ఎక్కడ పర్యటించినా పులివెందుల ప్రస్తావన లేకుండా ప్రసంగించడం లేదు. ఎన్నికలకు ముందు నుంచే చంద్రబాబు పులివెందులను రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ చేశారు. పులివెందుల పంచెలు కట్టుకుని రౌడీలు వస్తారని, ఇళ్లల్లో ఆడాళ్లు కూడా మిగలరని ఎన్నికల ప్రసంగంలో పదే పదే ప్రస్తావించారు. ఒక రకంగా పులివెందుల అంటే మిగిలిన ప్రాంతాల్లో భయం పుట్టే విధంగా చంద్రబాబు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తావించారు. కానీ ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. పులివెందుల పంచాయతీ పెద్దగా పనిచేయలేదు.

ఎన్నికల నాటి నుంచే…..

ఆ విషయం అర్థమయిన తర్వాత కూడా చంద్రబాబు పులివెందులను వదలడం లేదు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా చంద్రబాబు కుప్పంను మరో పులివెందుల చేస్తున్నారని అన్నారు. జగన్ పులివెందుల రాజకీయాలు మానుకోవాలని చెప్పారు. అదే తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పులివెందులలో పర్యటించి తాను మరో కుప్పంగా పులివెందులను మారుస్తానని చెప్పారు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకుండా తొలుత పులివెందులకే తాను ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయినా కడప జిల్లాలో జీరో రిజల్ట్ మాత్రమే వచ్చింది.

విశాఖ ఘటనలో కూడా….

ఇక తాజాగా విశాఖ ఘటనను తీసుకున్నా చంద్రబాబు పులివెందుల ప్రస్తావన మళ్లీ తీసుకువచ్చారు. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తనను అడ్డుకుంది విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు కాదని, పులివెందుల గూండాలనే చంద్రబాబు చెప్పారు. దీంతో మరోసారి పులివెందుల చర్చ నీయాంశ మైంది. దీనికి మంత్రి అవంతి శ్రీనివాస్ ధీటుగా స్పందించారు. పులివెందుల నుంచి ఒక్క వ్యక్తి వచ్చినట్లు రుజువు చేసినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబుకు సవాల్ విసిరారు.

కొంప ముంచింది అదేనని…..

నిజానికి పులివెందుల ప్రస్తావనే గత ఎన్నికల్లో చంద్రబాబు కొంప ముంచింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఓట్లు రాబట్టుకోవడానికి పులివెందుల ప్రస్తావన చంద్రబాబు ఎక్కువగా తెచ్చారు. అయితే ఎన్నికల్లో వర్క్ అవుట్ కాలేదు. రాయలసీమలో పులివెందుల దెబ్బకే పులుసు కారిపోయిందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాయలసీమలో పార్టీని బతికించుకోవాలంటే పులివెందుల ప్రస్తావన తేవద్దని సీనియర్ నేతలు సయితం చంద్రబాబుకు సూచిస్తున్నారు. మొత్తం మీద పులివెందుల పంచాయతీని చంద్రబాబు వదిలిపెట్టనంత వరకూ ఆయనకు పులుసు కారిపోతుందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

Tags:    

Similar News