రెడ్డి వ‌ర్గానికి బాబు గేలం.. న‌మ్మకం పెంచుకుంటారా..?

టీడీపీ అధినేత‌ చంద్రబాబు.. ఇప్పుడు రెడ్ల జ‌పం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తీవ్రస్థాయిలో దెబ్బతిన్న నేప‌థ్యంలో కాయ‌క‌ల్ప చికిత్స ‌చేయాల‌ని భావిస్తున్న చంద్రబాబు.. ఈ క్రమంలోనే [more]

Update: 2020-08-24 13:30 GMT

టీడీపీ అధినేత‌ చంద్రబాబు.. ఇప్పుడు రెడ్ల జ‌పం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తీవ్రస్థాయిలో దెబ్బతిన్న నేప‌థ్యంలో కాయ‌క‌ల్ప చికిత్స ‌చేయాల‌ని భావిస్తున్న చంద్రబాబు.. ఈ క్రమంలోనే సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్‌ల‌ను తెర‌మీదకి తెస్తున్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా సీఎంగా ఉన్న జ‌గ‌న్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చెక్ పెట్టాలంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని త‌న ద‌రికి చేర్చుకునేందుకు చంద్రబాబు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ద‌క్షిణ కోస్తా స‌హా సీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌. ఇక్క‌డ రాజకీయ ఆధిప‌త్యం రెడ్ల చేతుల్లోనే ఉంది.

అసంతృప్తిని తమ వైపునకు తిప్పుకునేందుకు….

ఈ క్రమంలో పార్టీలో రెడ్ల ప్రాధాన్యం పెంచి.. వారికి ఇంచార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా పార్టీని బ‌ల‌పేతం చేసుకునేందుకు ఉన్న మార్గాల‌పై బాబు దృష్టి పెట్టారు. ప్రస్తుతం సీఎంగా జ‌గ‌న్ ఉన్నప్పటికీ.. మంత్రులుగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఆశించిన ప‌ద‌వులు ద‌క్కలేదు. కేవ‌లం పెద్ది రెడ్డి రామ‌చంద్రరెడ్డి, మేక‌పాటి గౌతం రెడ్డి, బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వంటి ముగ్గురు న‌లుగురు నేత‌లు మాత్రమే రెడ్డి వ‌ర్గానికి చెందిన‌వారు ఉన్నారు. దీంతో మ‌నోడే సీఎం అయినా.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ద‌క్కలేద‌నే అసంతృప్తి ఉంది. ఇప్పటి వ‌ర‌కు బాహాటంగా ఇది క‌నిపించ‌క‌పోయినా.. దీనిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు చంద్రబాబు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు, అనంత‌పురం, క‌డ‌ప వంటి జిల్లాల్లో రెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం పెంచాల‌ని భావిస్తున్నారు.

ఒక్కరూ గెలవలేక….

నెల్లూరు, అనంత‌పురం, క‌డ‌ప జిల్లాల్లో రెడ్డి సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌ల కోసం ఇప్పటికే అన్వేష‌ణ జ‌రుగుతున్నా వైసీపీని ఢీకొట్టి నియోజ‌క‌వ‌ర్గాన్ని లీడ్ చేసే స్థాయి నేత‌లు ఎవ్వరూ క‌న‌ప‌డ‌డం లేదు. ఫ‌లితంగా వైఎస్సార్ సీపీలో అసంతృప్తిగా ఉన్న నాయ‌కులు త‌న పార్టీని బ‌ల‌ప‌రుస్తార‌ని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, బాబు ఆలోచ‌న ఏమేర‌కు వ‌ర్కవుట్ అవుతుంది ? చంద్రబాబును రెడ్డి వ‌ర్గం న‌మ్ముతుందా ? అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. గ‌త ఐదేళ్ల బాబు పాల‌న‌లో రెడ్డి వ‌ర్గానికి కొన్ని మంచి ప‌ద‌వులే ఇచ్చినా రెడ్డి వ‌ర్గం ఓట‌ర్లు మాత్రం టీడీపీలో ఉన్న త‌మ వ‌ర్గ నేత‌ల‌ను చిత్తుగా ఓడించారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఒక్క రెడ్డి ఎమ్మెల్యే గాని, ఎంపీగాని గెల‌వ‌క‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శనం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో….

ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీలో ప్రాధాన్యం లేని రెడ్లు… రేపో మాపో ప్రయార్టీ ఉండ‌ద‌ని బ‌లంగా డిసైడ్ అయిన వారికి టీడీపీ ఆప్షన్‌గా ఉన్నా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌మ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లే టీడీపీలోకి వెళితే త‌మ‌ను ఆద‌రించ‌ర‌న్న ఆందోళ‌న వారిని వెంటాడుతోంది. ఇప్పుడు చంద్రబాబును న‌మ్ముకుంటే.. ఏమేర‌కు త‌మ‌కు అండ‌గా ఉంటార‌నేది వారి సందేహం. పైగా ఏపీలో టీడీపీ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతోంది. టీడీపీ నుంచే ప‌లువ‌రు కీల‌క నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీగా ఉన్నారు.

కానీ అవసరానికి వాడుకుని…..

ఈ నేప‌థ్యంలో చంద్రబాబు రెడ్డి వ‌ర్గానికి చేరువ‌వ్వాల‌ని అనుకున్నా.. ఆ వ‌ర్గంలో న‌మ్మకం క‌లిగించ‌డంలో మాత్రం స‌క్సెస్ కాలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి దీనిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. పైగా అనంత‌లో జేసీ కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే.. చంద్రబాబు చూసీ చూడ‌న‌ట్టున్నార‌నే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలో ఉన్న రెడ్లకే వెన్నుద‌న్నుగా ఉండ‌ని బాబు ఇప్పుడు కొత్తగా చేరిన వారిని సైతం అవ‌స‌రానికి వాడుకుని వ‌దిలేస్తార‌న్న సందేహాలు కూడా కొంద‌రు రెడ్లకు ఉన్నాయి.

Tags:    

Similar News