ఔట్ డేటెడ్ నేత‌ల‌తో బాబు ప‌య‌నం ఎందాక…‌?

రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు ఉండాల్సిందే. అయితే, ఎప్పటిక‌ప్పుడు మారుతున్న ప్రజ‌ల మైండ్ సెట్‌ను అందుకోగ‌లిగే నాయ‌కుల అవ‌స‌రం కూడా రాజ‌కీయాల్లో చాలా ముఖ్యం. ముందుత‌రం నేత‌ల‌ను స‌మీక‌రించ‌కోక‌పోతే.. ఏ [more]

Update: 2020-08-24 11:00 GMT

రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు ఉండాల్సిందే. అయితే, ఎప్పటిక‌ప్పుడు మారుతున్న ప్రజ‌ల మైండ్ సెట్‌ను అందుకోగ‌లిగే నాయ‌కుల అవ‌స‌రం కూడా రాజ‌కీయాల్లో చాలా ముఖ్యం. ముందుత‌రం నేత‌ల‌ను స‌మీక‌రించ‌కోక‌పోతే.. ఏ పార్టీ అయినా మ‌నుగ‌డ సాధించ‌డమూ క‌ష్టమే. ఇలాంటి ప‌రిస్థితి ఇప్పుడు టీడీపీ ఎదుర్కొంటోంది. చంద్రబాబు ఇప్పటి వ‌ర‌కు ముందు త‌రం నేత‌ల‌ను స‌న్నద్ధం చేయ‌లేదు. పార్టీని లీడ్ చేసే అధినేత పోస్టు అలా ఉంచితే.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల స్థాయిలోను.. కీల‌క నేత‌ల‌ను ఆయ‌న ఏర్పాటు చేసుకోలేక పోతున్నార‌నే వాదన వినిపిస్తోంది. ఎక్కడిక‌క్కడ నాయ‌కులు ఉన్నప్పటికీ వారంతా ఔట్ డేటెడ్ నాయ‌కులుగా మిగిలిపోవ‌డం గ‌మ‌నార్హం.

చాలా మంది సీనియర్లుగా…..

జిల్లాల వారీగా చెప్పుకొంటే.. ఈ లెక్క చాలానే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో క‌ళా వెంక‌ట్రావు, విజ‌య‌న‌గ‌రంలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు.. విశాఖ‌లో అయ్యన్న పాత్రుడు, తూర్పులో బుచ్చయ్య చౌద‌రి, నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్ప వంటివారే ఇప్ప‌టికీ చ‌క్రాలు తిప్పుతున్నారు. ఇక య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నిర్ణ‌యాలు పార్టీ భ్రష్టు ప‌ట్టిపోయేందుకు స‌గం కార‌ణం అన్న విమ‌ర్శ‌లు ఉన్నా కూడా బాబు ఇంకా ఆయ‌న్నే న‌మ్ముతార‌ని టీడీపీ నేత‌లు చెవులు కొరుక్కుంటారు. పార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ టైప్‌లో ఈ నేత‌లు చెప్పే కాలం చెల్లిన నిర్ణ‌యాలు అమ‌లు చేస్తుండ‌డంతోనే పార్టీ ఈ స్థితికి వ‌చ్చిందన్న‌ది నిజం.

వారసత్వ నేతలే తప్ప….

ఈ సినియ‌ర్ నేత‌ల‌ను ప‌క్కన పెట్టేస్తే వీరి త‌ర్వాత ఎవ‌రు? అనే ప్రశ్నకు టీడీపీలో స‌మాధానం ల‌భించ‌డం లేదు. పైగా ఇప్పుడున్న ప‌రిస్థితిలో చాలా మంది ప్రభుత్వంపై నేరుగా ఫైట్ చేసే ప‌రిస్థితి లేదు. ఎక్కడో ఒక‌చోట రాజీ ప‌డుతున్న నాయ‌కులు క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ ప‌రిస్థితి ఏంట‌నేది పార్టీ అభిమానుల మాట‌. ఇలాంటి ప‌రిస్థితి సీమ‌లోనూ క‌నిపిస్తున్నా.. అక్కడ కొంత యువత క‌నిపిస్తోంది. కానీ, ఎటొచ్చీ.. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో పార్టీ యువ నాయ‌కుల కొర‌త చాలా ఉంది. రాజ‌ధాని జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు జిల్లాలో క‌నీసం యువ‌త‌ను ముందుకు నడిపించే ఒక్కరంటే ఒక్క యువ‌నేత కూడా లేని ప‌రిస్థితి. కొన్ని చోట్ల యువ‌నేత‌లు ఉన్నా వారంద‌రూ కూడా వార‌స‌త్వ రాజ‌కీయాల‌తో వ‌చ్చిన వారే త‌ప్పా జ‌నాల నుంచి ఎదిగిన నేత‌లు అయితే కాదు.

వచ్చే ఎన్నికల నాటికి…..

ఇప్పుడున్నవారిలో చాలా మంది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రిటైర‌య్యే అవ‌కాశం కూడా ఉంది. వీరు అప్పటికి కేవ‌లం ప్రచార‌కులుగా మాత్రమే మిగిలిపోనున్నారు. ఈ నేప‌థ్యంలో ఔట్‌డేటెడ్ నేత‌ల‌తో చంద్రబాబు.. ఎంత దూరం, ఎన్నాళ్లు ప‌య‌నిస్తార‌నే వ్యాఖ్యలు స‌ర్వత్రా వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఆయ‌న ప్రతి జిల్లాపై అధ్యయ‌నం చేసి యువ‌త‌రాన్ని చాలా వ‌ర‌కు ప్రోత్సహించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది సూచ‌న‌లు. అయితే. ఎవ‌రు దీనిపై ప్రశ్నించినా.. 33 శాతం పార్టీ ప‌దవుల‌ను త్వర‌లోనే యువ‌త‌రానికి ఇస్తామ‌ని అంటున్నారే త‌ప్ప.. కార్యరూపంలోకి తేవ‌డం లేదు. చంద్రబాబు ఈ విష‌యంలో త‌న తీరు మార్చుకోక‌పోతే పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పోటీలో ఉంటుందా ? అన్నది సందేహ‌మే..?

Tags:    

Similar News