ఢిల్లీ లింకు తెగిపోయినట్లేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ లింకు దాదాపుగా తెగిపోయినట్లే. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించారు. గతంలో అధికారంలో లేనప్పుడు కూడా ఢిల్లీని [more]

Update: 2020-08-22 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ లింకు దాదాపుగా తెగిపోయినట్లే. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించారు. గతంలో అధికారంలో లేనప్పుడు కూడా ఢిల్లీని వేదికగా చేసుకుని తన నాయకత్వ పటిమను చూపేవారు. గతంలో పదేళ్లు అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు తరచూ ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి నేతలతో సమావేశమై పలు సమస్యలపై చర్చించేవారు. ఎప్పుడూ లేనిది చంద్రబాబు ఈసారి ఢిల్లీకి లింక్ కోల్పోయారంటున్నారు.

ఎన్నికల ముందు వరకూ….

2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీతో సయోధ్య కుదుర్చుకున్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ ను కలిశారు. రాహుల్ గాంధీని కలసి చర్చించారు. ఇక మాయావతి, అఖిలేష్ యాదవ్, మమత బెనర్జీ వంటి నేతలను కూడా కలుసుకున్నారు. మోదీకి వ్యతిరేకంగా మమత కోల్ కత్తా లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు.

అధికారంలో లేకపోయినా…..

కానీ కేంద్రంలో కాంగ్రెస్, ఇక్కడ తాను అధికారంలోకి రాలేదు. మరోవైపు బీజేపీకి దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపినా ఫలితం లేకుండా పోయింది. బీజేపీ హైకమాండ్ చంద్రబాబు ఊసెత్తితేనే మండిపడుతుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి మరోసారి దగ్గరవ్వడం సాధ్యం కాదని తేలిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగా లేదు. దాంతో కలసినా ఒక్కటే..లేకున్నా ఒక్కటే.

ఏడాదిన్నర కావస్తున్నా….

అందుకే చంద్రబాబు ఢిల్లీ గడప తొక్కి దాదాపు ఏడాదన్నర కావస్తుంది. ఇక్కడ అధికారంలో లేనప్పుడు ఢిల్లీ వెళ్లి కొంత హల్ చల్ చేసేవారు. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు. ఇప్పుడు చంద్రబాబు తరుపున ఢిల్లీ లో లాబీయింగ్ చేసే వాళ్లు కూడా కరవయ్యారు. దీంతో చంద్రబాబు కు ఢిల్లీ లింక్ తెగిపోయినట్లేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కరోనా కారణంగా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నా ఇప్పట్లో చంద్రబాబు హస్తిన ప్రయాణం లేనట్లేనన్నది పార్టీ వర్గాల టాక్. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలుస్తారన్న ప్రచారం పార్టీలో విన్పించేది. ఇప్పుడు దానికి కూడా ఫుల్ స్టాప్ పడింది.

Tags:    

Similar News