డైరెక్ట్ గా దిగితే తప్ప లాభం లేదనుకుంటున్నారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. విజయవాడ వచ్చే అవకాశమే లేదు. కరోనా వైరస్ వ్యాప్తి [more]

Update: 2020-08-18 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. విజయవాడ వచ్చే అవకాశమే లేదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేంత వరకూ హైదరాబాద్ ను వీడివెళ్లవద్దని వైద్యులు, కుటుంబ సభ్యుల హెచ్చరికతో ఆయన ఇప్పట్లో అమరావతికి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి.

హైదరాబాద్ లోనే ఉంటూ….

చంద్రబాబు వయసు దృష్ట్యా బయట ఉండటం శ్రేయస్కరం కాదని కుటుంబ సభ్యులు కూడా సూచిస్తుండటంతో పార్టీ కార్యక్రమాలను అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ జూమ్ యాప్ ద్వారా కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చెబుతున్నారు. కానీ టీడీపీ నేతలు సయితం ఎక్కడికీ బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అనేకమంది కోవిడ్ బారిన పడటం, మాణిక్యాలరావు లాంటి నేత కరోనాతో మరణించడంతో నేతలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.

బాబు ఆదేశాలను…..

దీంతో చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ఆదేశాలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అయితే మూడు రాజధానుల విష‍యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు కొంత మౌనంగా ఉండటంతో ఆ ప్రాంతానికి తానే వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. విశాఖ నేరుగా హైదరాబాద్ నుంచి వెళ్లి అక్కడ నేతలతో మాట్లాడటం, ఉత్తరాంధ్రలో తాను చేసిన అభివృద్ధిని వివరించాలని నిర్ణయించుకున్నారు. బహుశా ఈ నెలాఖరులో విశాఖకు చంద్రబాబు వెళ్లే అవకాశముంది.

త్వరలో విశాఖకు…?

చంద్రబాబు విశాఖ వెళ్లక ఎనిమిది నెలలు పైగానే అవుతుంది. లోకేష్ మొన్న శ్రీకాకుళం అచ్చెన్న కుటుంబానికి పరామర్శకు వెళ్లినా విశాఖలో ఆగకుండానే వచ్చేశారు. దీంతో స్వయంగా విశాఖకు వెళ్లి నేతలకు, ప్రజలకు వివరించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కర్నూలు కు వెళ్లాలన్న ప్లాన్ లో కూడా చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ పర్యటనలు ఖరారు కాకపోయినప్పటికీ ఈ నెలాఖరులోనే రెండు పర్యటనలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News