రివర్స్ గేర్ కు సౌండ్ లేకుండా పోయిందే?

చంద్రబాబు మీద వైసీపీ తొలి విజయం సాధించింది. అదేంటి చంద్రబాబుని ఏనాడో జగన్ గెలిచేశాడు కదా, తొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రిగా అయన కుర్చీలో కూర్చున్నారుగా అని డౌట్లు [more]

Update: 2020-02-27 15:30 GMT

చంద్రబాబు మీద వైసీపీ తొలి విజయం సాధించింది. అదేంటి చంద్రబాబుని ఏనాడో జగన్ గెలిచేశాడు కదా, తొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రిగా అయన కుర్చీలో కూర్చున్నారుగా అని డౌట్లు ఎవరికైనా రావచ్చు. కానీ చంద్రబాబు రాజకీయ గండర గండడు, మంచి వ్యూహకర్త. అటువంటి బాబుకు చుక్కలు చూపించి మరీ విశాఖలో వెనక్కి తిప్పి పంపించివేయడంలో మాత్రం జగన్ సూపర్ సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఇది జగన్ పదేళ్ళ కెరీర్లో వ్యూహాత్మకంగా సాధించిన తొలి విజయం అంటున్నారు. జగన్ ని ప్రతీసారి తనదైన వ్యూహాలతో బోల్తా కొట్టించే చంద్రబాబుని జగన్ తొలిసారిగా అదే వ్యూహంతో రివర్స్ గేర్ లో ఆటాడించారని చెబుతున్నారు.

ఊహకు అందకుండా…?

చంద్రబాబు పదే పదే చెబుతున్నట్లుగా విశాఖ ప్రజలు మంచివారు, వైసీపీకి తనను అడ్డుకునే దమ్మేది అన్న ధైర్యంతోనే విశాఖ టూర్ చేపట్టారు. నిజానికి చంద్రబాబు జనవరి 3నే విశాఖ రావాలి. కానీ నాడు మూడు రాజధానుల గొడవ పచ్చిగా ఉంది. దీంతో మానుకున్నారు. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. పైగా జగన్ అనుకున్నట్లుగా రాజధాని విశాఖ రాలేదు. అడుగడుగునా ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో చంద్రబాబు ఇపుడు ఏం జరుగుతుందిలే అని డేరింగ్ స్టెప్ వేసారు. అక్కడే కధ అడ్డం తిరిగిందని అంటున్నారు.

వెల్లువలా……

చంద్రబాబుని కట్టడి చేద్దామని వైసీపీ పక్కా ప్లాన్ తో సిధ్ధమైంది. దానికి వైసీపీ మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ ఇచ్చిన పిలుపులే ఉదాహరణ. చంద్రబాబుని అడ్డుకోండి, తరిమికొట్టడని అంటూ వైసీపీ ఇచ్చిన పిలుపు ఊరికే కాదు, అన్నీ చూసుకునే ఇచ్చారని చంద్రబాబుకు అర్ధమయ్యేసరికి ఆయన ఎయిర్ పోర్టు లాంజిలో గడపాల్సివచ్చింది. వైసీపీ శ్రేణులు సైతం గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబుని అడ్డుకున్నాయి. అదే సమయంలో ఇంత రచ్చ జరుగుతుందని ఊహించని టీడీపీ కార్యకర్తలు సీన్ చూసి షాక్ తిన్నారు. ఇక చంద్రబాబు వెనకాల వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా జరుగుతున్నది అర్ధం కాని పరిస్థితి. మొత్తానికి వెల్లువలా జనం కూడా అక్కడికి రావడంతో వైసీపీ ప్లాన్ బంపర్ సక్సెస్ అయింది.

టిట్ ఫర్ టాట్….

చంద్రబాబుకు సరైన పాఠం జగన్ చెప్పారని తాజా సీన్ చూసిన వారికి అర్ధమైపోయింది. ఒకనాడు తాను విశాఖ రావాలనుకుంటే ఎయిర్ పోర్టులో బంధించి మరీ అరెస్ట్ చేయించిన చంద్రబాబును అదే రీతిన సన్మానించి జగన్ బాకీ తీర్చుకున్నారు. ఇక విశాఖ జనం మంచివాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకున్న చంద్రబాబుకు కూడా అసలు విషయం బోధపడింది. విశాఖ వాసులు రాజధాని కోరుకుంటున్నారని కూడా గట్టిగానే అర్ధమైంది. పైకి కిరాయి రౌడీలు, పులివెందుల జనం అని బయటకు చెబుతున్నా కూడా విశాఖ వాసుల‌ బలమైన ఆకాంక్షను చంద్రబాబు దగ్గరుండి చూశారు. అలాగే వ్యూహచతురుడిగా పేరున్న చంద్రబాబు కూడా చేష్టలుడిగేలా జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ తో సౌండ్ లేకుండా పోయినట్లైంది.

Tags:    

Similar News