బాబు కొత్త ఎత్తుగడ … వైసీపీని కట్టడి చేస్తామన్న ధీమా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత చెప్పినా చెప్పిందే చెప్పినట్లవుతుంది. ప్రజలు కూడా లైట్ గా తీసుకుంటున్నారు. ఇది గమనించిన పార్టీ అధినేత కొత్త వ్యూహానికి తెరలేపుతున్నారు. [more]

Update: 2020-08-18 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత చెప్పినా చెప్పిందే చెప్పినట్లవుతుంది. ప్రజలు కూడా లైట్ గా తీసుకుంటున్నారు. ఇది గమనించిన పార్టీ అధినేత కొత్త వ్యూహానికి తెరలేపుతున్నారు. చంద్రబాబు గత ఏడాది కాలం నుంచి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కరోనా రాకముందు దీక్షలు కూడా చేశారు. ఇసుక, అక్రమ మద్యం, అమరావతి రాజధాని వంటి విషయాల్లో చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రజల చెవికి కూడా ఎక్కడం లేదు.

మీడియా సమావేశాలు…

దీంతో పాటు మీడియా సమావేశాల వల్ల ఉపయోగం కూడా కనపడటం లేదు. ఆ రెండు ఛానళ్లు, పత్రికలు తప్ప పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా మీడియా సమావేశాలతో కలలు సాకారం కావని సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని సయితం ట్వీట్ చేశారు. ఇలా మీడియా సమావేశాలు, టీడీపీ ఆరోపణలతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాదని గుర్తించిన చంద్రబాబు అందుకు విరుగుడు మంత్రి ప్రయోగించాలని సిద్దమయ్యారు.

గత ప్రభుత్వ హయాంలో…..

నిజానికి తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో సయితం వైసీపీ చేస్తున్న విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. మేధావులు, జన చైతన్య వేదిక పేరుతో లక్ష్మణ్ రెడ్డి ఊరూరా తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనేక ప్రాంతాల్లో రౌంట్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాజధాని అమరావతి విషయాన్ని కూడా ఊరూరా తీసుకెళ్లగలిగారు. భూసమీకరణ ద్వారా రైతుల పొట్టకొట్టారని నమ్మించగలిగారు. ఇది ప్రజల్లోకి బాగా వెళ్లిందని చంద్రబాబు గుర్తించారు. మేధావులు చెబితేనే ప్రజల్లోకి త్వరగా ఎక్కుతుందన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. అందుకోసం టీడీపీ కూడా అదే గేమ్ ఆడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మేధావుల ఫోరం ఏర్పాటు….

ఇప్పుడు టీడీపీ కూడా మేధావుల ఫోరంను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వారి ద్వారానే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు పలువురు మేధావులతో ఫోన్ లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వల్ల ఏపీకి భవిష్యత్ లో ఎంత నష్టం వాటిల్లనుంది ప్రజలకు తెలియజేయాలని మూడు ప్రాంతాలకు చెందిన మేధావులను చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, జడ్జిలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణలను కూడా ఈ మేధావుల ఫోరంలో చేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు పెద్ద కసరత్తే చేస్తున్నారు. మరి చంద్రబాబు ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలం అవుతుందో చూడాలి.

Tags:    

Similar News