ఆ సవాల్ లో సింహ గర్జన ఏదీ?

తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఆత్మగౌరవ నినాదం పునాదిగా ఉంది. కాంగ్రెస్ మూడు దశాబ్దాల పాలనలో డిల్లీ ప్రభువుల ఏలుబడిలో నాటి ముఖ్యమంత్రులు కట్టు బానిసలుగా మారిన సన్నివేశాలను [more]

Update: 2020-08-08 08:00 GMT

తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఆత్మగౌరవ నినాదం పునాదిగా ఉంది. కాంగ్రెస్ మూడు దశాబ్దాల పాలనలో డిల్లీ ప్రభువుల ఏలుబడిలో నాటి ముఖ్యమంత్రులు కట్టు బానిసలుగా మారిన సన్నివేశాలను యావత్తు ఆంద్ర రాష్ట్రం చూసింది. దానికి తోడు ప్రతీ దానికీ హస్తిన పరిగెత్తే వెన్నెముక లేని నాయకత్వాన్ని కూడా చూసింది. ఆ పరిస్థితులను ఆకళింపు చేసుకుని, ఆగ్రహం చెందిన అన్న గారు పూరించిన చైతన్య శంఖమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. అప్పట్లో తన చైతన్య రధం పైన ఆయన ఊరూరా తిరుగుతూ ఇచ్చిన ఆత్మగౌరవ నినాదం ప్రతి తెలుగు వాడికీ ఇప్పటికీ గుర్తుంది. ఒక ఆవేశం, ఆవేదన నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీలో ఇపుడు అవేవీ కనిపించడంలేదన్న బాధ ఉంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత పిరికితనం ఆవహించినదా అన్న భావన కూడా కలుగుతోంది.

ఏదీ నాటి వెలుగులు….

ఓ వైపు ఎన్నికలు అంటే భయం, మరో వైపు సొంతంగా పోటీ చేయాలంటే జంకు, మరో వైపు హస్తిన పాలకులు అంటే భయం, బీజేపీ నేతలు తిట్టినా కూడా చలనం లేని వ్యవహారం ఇది కదా ప్రస్తుత తెలుగుదేశం తీరు, సైకిల్ తొక్కలేని చంద్రన్న అని బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు దెప్పి పొడిచినా కిమ్మనని వైనం. తెలుగుదేశం ఇక బీజేపీలో విలీనం అవుతుందని ఆ పార్టీ నాయకుడు విష్ణువర్ధనరెడ్డి ఎకసెక్కమాడినా ఏమీ అనలేని నిస్సహాయత, అవినీతి పార్టీ అని సోము వీర్రాజు ఘాటుగా విమర్శిస్తున్నా ఖండించే నాధుడే తెలుగుదేశంలో లేని పరిస్థితి. మరీ ఇంతలా బీజేపీకి దాసోహం కావడాన్ని పార్టీ శ్రేణులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. నిజంగా పులిలా బతికినా పార్టీ ఇలా అయిదేంటి అని మధనపడుతున్నాయి.

కేంద్రం మిధ్య …..

ఎన్టీఆర్ కేంద్రం మిధ్య అని నమ్మేవారు. ఆయన దృష్టిలో రాష్ట్రాలే నిజం. రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం. పైగా అనవసరంగా కేంద్రం పెత్తనం చేస్తోంది అన్నది ఎన్టీఆర్ భావన. ఓ విధంగా ఎన్టీఆర్ అన్నది నిజమే. రాష్ట్రాల సమాఖ్య కేంద్రం. అన్ని విధాలుగా రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం ఉంటుంది, ఇక్కడ కేంద్రం అన్న దానికంటే రాష్ట్రాలు అన్నవే అసలైన బలం, నిజం అని ఎన్టీఆర్ అంటే ఆ పార్టీ వారసులు మాత్రం ఇపుడు ప్రతీ దానికీ కేంద్రం జోక్యం అంటున్నారు. కేంద్రం రాష్ట్రాన్ని శాసించాలని కోరుతున్నారు. ఫెడరల్ స్పూర్తి అన్న గారి నినాదం అయితే ధిల్లీ పెత్తనం అన్నది కాంగ్రెస్ ఆలోచన. మరి అన్న గారి అల్లుడు మామ గారి ఆశయాలు అనుసరించకుండా కాంగ్రెస్ రక్తం తనదని నిరూపించుకుంటున్నారు. ఎంతలా అంటే ధిల్లీ పాలకులకు సలాం అనేలా తెలుగుదేశంని బాబు మార్చేసారు అన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి.

పేలవమైన సవాళ్ళు…..

సవాల్ చేస్తే అందులో సింహగర్జన వినిపించాలి. అంతేకానీ పిల్లి గొంతుకలు కాదు, అమరావతి తన కలల రాజధాని అన్న చంద్రబాబు దాన్ని కూలుస్తున్న జగన్ సర్కార్ మీద రణ నినాదమే చేయాలి. చావో రేవో అన్నట్లుగా ముందుకు సాగాలి. తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికల సమరానికి తెరతీయాలి. ఇది కదా కావాల్సింది. ఇది కదా తమ్ముళ్ళు ఆశించింది. కానీ బాబు చేసినదేంటి, ఆయన జగన్ కి అసెంబ్లీ రద్దు చేయమంటున్నారు. అలా చేయడానికి జగన్ ఎందుకు సిద్ధపడతారు, దీని మీదనే సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని గట్టిగానే అధినేతను తగులుకున్నారు. మన కలలు ఎవరో తీర్చరు, మనమే తీర్చుకోవాలి, దానికి మీడియా సమావేశాలు కావు జవాబు అంటూ నాని ఇచ్చిన కౌంటర్ తెలుగుదేశం అధినాయకునికి అర్ధమైతే ఈ దుస్థితి నుంచి టీడీపీ కొంత అయినా బయటపడడం జరుగుతుంది. మరి బాబు అలా చేస్తారా. చూడాలి.

Tags:    

Similar News