ఆ నాయ‌కుల‌పై చంద్రబాబు ఆశ‌లు వ‌దులుకున్నట్లేనా?

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో `అమ‌రావ‌తి` అంశం ప్రమాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఈ విష‌యంలో కోస్తా, సీమ ప్రాంతాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర‌లోని కీల‌క‌మైన విశాఖ‌లో [more]

Update: 2020-08-12 15:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో 'అమ‌రావ‌తి' అంశం ప్రమాద ఘంటిక‌లు మోగిస్తోంది. ఈ విష‌యంలో కోస్తా, సీమ ప్రాంతాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర‌లోని కీల‌క‌మైన విశాఖ‌లో మాత్రం టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ప్రమాద‌క‌ర ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అమ‌రావ‌తికే అనుకూలంగా స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. ఈ విష‌యంపై కొన్నాళ్లుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో మూడు రాజ‌ధానుల‌కు వ్యతిరేక‌మంటూ పార్టీ కూడా గ‌ట్టిగానే నిల‌బ‌డింది. అంతేకాదు, విశాఖ‌ను రాజ‌ధానిగా ఎవ‌రూ అక్కడి ప్రజ‌లు కోరుకోవ‌డం లేద‌ని కూడా చెబుతూ వ‌స్తోంది.

ఒకే ఒక్కడు తప్పించి…..

కేవ‌లం రాష్ట్ర ప్రజ‌లు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కోరుకుంటున్నార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవ‌ల మూడు రాజ‌ధానుల బిల్లు ఆమోదం పొందిన ద‌రిమిలా.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ త‌ర‌ఫున ఆందోళ‌న‌లు చేయాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి కోస్తా, సీమ ప్రాంతాల నేత‌లు ముందుకు వ‌చ్చారు. కానీ, ఉత్తరాంధ్రలో ఒకే ఒక్క నాయ‌కుడు, మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు త‌న ఇంటి ముందు న‌ల్లజెండా ప‌ట్టుకుని నిల‌బ‌డ్డారు. ఆయ‌న మిన‌హా అస‌లు చంద్రబాబు పిలుపు ఉత్తరాంధ్రలో ప‌ట్టించుకున్న నాథుడే లేడు. ఇక కీల‌క‌మైన శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి ఎంద‌రో బ‌ల‌మైన నాయ‌కుల‌తో పాటు, మాజీ మంత్రలు ఉన్నారు. చివ‌ర‌కు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌టరావు సైతం ఈ విష‌యాన్ని చాలా లైట్ తీస్కొన్నారు.

కీలక నేతలు అందరూ…..

వాస్తవానికి ఉత్తరాంధ్రలో పార్టీ బ‌లంగా ఉంది. కొన్ని సీట్లలో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్పటికీ.. పార్టీ పునాదులు మాత్రం బ‌లంగానే ఉన్నాయి. అయిన‌ప్పటికీ.. ఒక్క అశోక్ మాత్రమే బ‌య‌ట‌కు వ‌చ్చారు. కీల‌క‌మైన విశాఖ జిల్లాలోని న‌లుగురు ఎమ్మెల్యేలు మాత్రం అస‌లు బ‌య‌ట‌కు రాలేదు. ఇక‌, రాష్ట్రానికి చీమ కుడితే.. నేనున్నానంటూ ముందుకు వ‌చ్చే టీడీపీ యువ కిశోరం, శ్రీకాకుళం ఎంపీ.. కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు కూడా బ‌య‌ట‌కు రాలేదు. హోదా స‌హా అమ‌రావ‌తిపై ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో త‌న గ‌ళాన్ని బ‌లంగానే వినిపించిన రామ్మోహ‌న్ నాయుడు ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఇచ్చిన పిలుపును ప‌ట్టించుకోలేదు.

ఏదైతే అది అవుతుందని….

ఇప్పటికే కింజార‌పు ఫ్యామిలీ రాజ‌కీయంగా ఇబ్బందుల్లో ఉంది. రామ్మోహ‌న్ నాయుడు బ‌య‌ట‌కు వ‌చ్చి అమ‌రావ‌తి స్టాండ్ తీసుకుంటే అక్కడ తీవ్ర వ్యతిరేక‌త వ్యక్తమ‌య్యే ఛాన్సులు ఉన్నాయి. దీంతో ఆయ‌న సైలెంట్ అయిపోయారు. ఇక విశాఖ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడినా ప్రజ‌లు చీత్కరించే ప‌రిస్థితి ఉంది. అదేవిధంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా బ‌య‌ట‌కు రాలేదు. విశాఖ‌లో తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు మిన‌హా మిగిలిన వారెవ్వరు చంద్రబాబును ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. త‌న మాట‌ను ఎమ్మెల్యేలు లైట్ తీస్కొంటోన్న ప‌రిణామాల‌ను చంద్రబాబు ప‌ట్టించుకోవ‌డం కూడా మానేశారు. ఇక‌, ఏదైతే అదే అవుతుంద‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News