ఇక మన రోజులు కావు బాబూ…!

అన్ని రోజులూ మనవి కావు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇంకా అర్ధం కాకపోవడమే విచిత్రం. తనను తాను మభ్యపెట్టుకుంటూ తన కళ్ళతోనే లోకమంతా చూడాలన్నదే [more]

Update: 2020-08-05 11:00 GMT

అన్ని రోజులూ మనవి కావు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇంకా అర్ధం కాకపోవడమే విచిత్రం. తనను తాను మభ్యపెట్టుకుంటూ తన కళ్ళతోనే లోకమంతా చూడాలన్నదే చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ. స్వయంగా మామ ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు దాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణగా జనాలను నమ్మించాలని చూశారు. అయితే వెన్నుపోటుకు గురి అయిన తరువాత ఎన్టీయార్ మరో అయిదు నెలలు జీవించే ఉన్నారు. ఆయన తమ ఆవేదనను, బాధను ఆనాటి మీడియాకు చెప్పుకున్నది ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా కనిపిస్తూనే ఉంది. అయినా చంద్రబాబు తాను వెన్నుపోటు వీరుడ్ని కాదని ఎన్నాళ్ళైనా బొంకుతూనే ఉంటారు.

డ్రామా అంటూ ….

ఇక బీజేపీతో తమ పార్టీ మళ్ళీ జట్టుకట్టబోతోందని కూడా చంద్రబాబు నమ్మించాలని చూస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల పార్టీలోని ఉన్నవారు అయినా మిగులుతారు అని అతి తెలివితోనే ఆయన ఈ విన్యాసాన్ని చేస్తున్నారు. అయితే ఇపుడు అంతా బట్టబయలవుతున్న రాజకీయం. ఎవరు ఎందుకు దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు అని కూడా జనాలు క్షణాల్లో గమనించేస్తున్నారు. తలపండిన సోము వీర్రాజు లాంటి వారు దీని గుట్టు కనిపెట్టలేరా. అందుకే ఢిల్లీలోని మీడియా ముందే సోము వీర్రాజు బాబు పరువుని నిలువునా తీశారు. ఇపుడే అమిత్ షా నుంచి ఫోన్ వచ్చిందని మీడియా ముందు చంద్రబాబు డ్రామాలు చేస్తారని ఎకసెక్కం ఆడిన తీరు తెలుగుదేశం పెద్దాయన గాలి తీసేసేదే. అది ఉత్త డ్రామా అని కూడా సోము కొట్టిపారేయడాన్ని బట్టి బీజేపీకి మీకు ఎప్పటికీ చిక్కదు అని స్పష్టంగా చెప్పేస్తున్నారు.

ములాయంలా మూలనేనా…?

ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ అని ఒక రాజకీయ ఆసామి ఉన్నారు. ఆయన యూపీలో శ్రేష్టమైన నేతగా ఒకపుడు చక్రం తిప్పారు, ఆయన బాబు కంటే కొంత నయమే. కొడుకు అఖిలేష్ యాదవ్ కి సీఎంగా అయినా కొన్నాళ్ళపాటు కూర్చోబెట్టగలిగారు, ఇపుడు ఆ తండ్రీ కొడుకల పార్టీకే దిక్కులేని స్థితి. అదే సైకిల్ గుర్తు ఏపీలో టీడీపీకి ఉందని, ఇక్కడ కూడా చంద్రబాబు, లోకేష్ లకు అదే గతి పట్టబోతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు భలే సెటైర్లు వేస్తున్నారు. బాబు తన కొడుకుని వారసుణ్ణి చేద్దామనుకుంటే పార్టీలో ఉన్న జనాలు కూడా వేరే పార్టీలోకి పారిపోతున్నారని కూడా జీవీఎల్ వెటకారమే ఆడారు. సైకిల్ ఎక్కలేని తొక్కలేని బాబుకు ఇక పార్టీ సారధ్యం ఎందుకు అంటూ విసుర్లు విసురుతున్నారు.

రిటైర్మెంటేనా…?

చంద్రబాబు మెయిన్ స్ట్రీం పాలిటిక్స్ నుంచి ఇప్పటికే తప్పుకున్నారని కూడా బీజేపీ నేతలు అంటున్నారు. చూడబోతే అది నిజంగా కూడా ఉంది. ఆరు నెలలుగా కరోనా వల్ల బాబు బయటకు రావడం లేదు, ఇదే కరోనా మరి కొన్నాళ్ళు ఉంటే బాబు ఇలాగే ఇంటికే పరిమితం అవుతారు. ఆ మాటకు వస్తే టీడీపీ ఓడాక క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్తే నాయకులు గోడ మీద ఉన్నారు. దాంతో చంద్రబాబు ఎంత లేపినా లేవలేని స్థితిలోకి టీడీపీ వచ్చిందని విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు రాజకీయాలకు తోడు కరోనా కూడా బాబుకు కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చేశాయని కూడా సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి పడక్కుర్చీ రాజకీయాలే బాబుకు గతి అని బీజేపీ నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా బాబు రాజకీయ జీవిత చరమాంకమేనా.,.. ఏమో దీనికి కాలమే జవాబు చెప్పాలి.

Tags:    

Similar News