శ్రావణం…బాబు పదవికి గ్రహణంగా మారనుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గడ్డు రోజులనే చెప్పక తప్పదు. పార్టీ ఓటమి చెంది ఏడాది గడచినా ఇంకా యాక్టివ్ కాలేదు. మరోవైపు కరోనా వైరస్ తో [more]

Update: 2020-07-24 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గడ్డు రోజులనే చెప్పక తప్పదు. పార్టీ ఓటమి చెంది ఏడాది గడచినా ఇంకా యాక్టివ్ కాలేదు. మరోవైపు కరోనా వైరస్ తో చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఉన్న నేతలు కూడా పార్టీని విడిచేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు మళ్లీ తెరలేపింది. చంద్రబాబు కు ఉన్న ప్రతిపక్ష హోదాను తీసివేసేందుకు ముమ్మరంగా వైసీపీ ప్రయత్నం చేస్తుంది. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది.

ఆషాఢంలో ఆపేసి…..

మొన్నటి వరకూ ఆపరేషన్ ఆకర్ష్ చేసిన వైసీపీ ఆషాఢం మాసంలో విరామమిచ్చింది. మళ్లీ శ్రావణం రావడంతో చేరికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు టీం నుంచి మరికొందరు జారి పోయే అవకాశముంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 15వ తేదీన ఆయన వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గంటా శ్రీనివాసరావును పార్టీలో రప్పించడానికి వెనక మంత్రి ఒకరు కీలక పాత్ర పోషించనట్లు చెబుతున్నారు.

మరో ఇద్దరు వీడితే….

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. సాంకేతికంగా టీడీపీీలో ఉన్నప్పటికీ వారు వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరాంలు పార్టీని వీడటంతో చంద్రబాబు బలం 20 కి పడిపోయింది. తాజాగా గంటా కూడా పార్టీని వీడతారన్న ప్రచారంతో 19కి చేరుకుంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడితే చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ముప్పు ఏర్పడినట్లే. మరో ఇద్దరు ఎమ్మెల్యేల కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

భరోసా ఇచ్చే ప్రయత్నంలో బాబు….

ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తర్వాత వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడుతున్నారు. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శ్రావణ మాసం కావడంతో ఎమ్మెల్యేలు కూడా మంచి ముహూర్తం చూసుకుని సైకిల్ దిగపోవడానికి రెడీ అయిపోతున్నారన్న వార్తలు చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

Tags:    

Similar News