బాబులో బేలతనమేల?

చంద్రబాబును రాజకీయ అదృష్టవంతుడు అనాలి. ఎందుకంటే ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంతటి స్థాయికి ఎదిగారు. మొదటిసారి ఇందిరాకాంగ్రెస్ చలువతో ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం అందుకున్న [more]

Update: 2020-02-21 05:00 GMT

చంద్రబాబును రాజకీయ అదృష్టవంతుడు అనాలి. ఎందుకంటే ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇంతటి స్థాయికి ఎదిగారు. మొదటిసారి ఇందిరాకాంగ్రెస్ చలువతో ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం అందుకున్న చంద్రబాబు ఆ వెలుగు ఆరకుండానే వెండితెర వేలుపు ఎన్టీఆర్ అల్లుడుగా మారి తెలివిగా భావిని బంగారు నిచ్చెనలు వేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ టీడీపీని చంద్రబాబు కోసమే పెట్టారనుకోవాలి. ముదిమి వయసులో పార్టీ పెట్టి అఖండ మెజారిటీతో ముమ్మారు ముఖమంత్రి అయిన ఎన్టీయార్ మొత్తం పద్నాలుగు ఏళ్ళ పాటు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చేతుల్లో నుంచి అధికారం గుంజుకున్న చంద్రబాబు మూడు మార్లు సీఎంగా పనిచేశారు. పార్టీ పీట్టిన మామ కంటే దాదాపు రెట్టింపు కాలం అధికారంలో ఉన్నారు.

న్యాయమే చేశారు…..

చంద్రబాబును ఉమ్మడి ఏపీలోనూ, విభజన ఏపీలోనూ జనం నెత్తిన పెట్టుకున్నారు. ఆయన్ని ఇన్నిసార్లు ఆదరించారంటేనే జనం మంచితనం అర్ధమవుతుంది. ఇక మారుతున్న కాలంతో పాటే రాజకీయాలు మారుతున్నాయి. దేశంలో కూడా అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఇపుడు కుప్పకూలింది. ఈ నేపధ్యంలో ఏపీలో నూతన సమీకరణతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ విషయంలో జనం సరైన తీర్పే చెప్పామని అనుకుంటున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ మీద జనాలకు ఇప్పటికైతే విరక్తి లేదు, ఏదో చేస్తుందన్నచాలానే ఆశ ఉంది. అలా ప్రజలు వేచి చూస్తున్నారు. ఈ దశలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలు అంటూ బస్సులో బయల్దేరారు.

రక్షించాలట….

చంద్రబాబు తనను ప్రజలు రక్షించాలని కోరుకుంటున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిప్పునని కూడా అంటున్నారు. ప్రజా చైతన్య యాత్రల ఉద్దేశ్యం ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూపించి అవగాహన పెంచడం. కానీ చంద్రబాబు మాత్రం ఎనిమిది నెలలకే జగన్ ని తిట్టిపోస్తున్నారు. ఈ ప్రభుత్వం విఫలం అయిందని దండకం లంకించుకుంటున్నారు. జగన్ కుర్చీ దిగిపోవాలనుకుంటున్నారు. వీటితో పాటే తనను కాపాడుకోవాలని జనం నెత్తిన పెద్ద బాధ్యత పెడుతున్నారు. తన మీద రాజకీయ కక్ష కట్టారని, తనకు ఏమైనా జరిగితే జనం ముందుండి కాపాడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు, ఇది నిజంగా వింతైన విన్నపం.

అవసరమా?

ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒకరిని మెచ్చి అధికారం కట్టబెడతారు, వారు నచ్చనపుడు మరొకరు తమ సేవకులుగా ఎన్నుకుంటారు. మరి వారి పాలనా కాలంలో ఏవైనా తప్పులు జరిగితే అందుకు వారే బాధ్యత వహించాల్సిఉంటుంది. ఈ విషయంలో ప్రజలకు సంబంధం ఏముంటుంది. ప్రజలే ప్రభువులుగా ఉన్న ప్రజాస్వామ్యంలో తప్పు ఎవరు చేసినా శిక్షలు ఉంటాయి. ఫలానా వారి తరఫున వకల్తా పుచ్చుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎపుడూ లేదు, నాడు దివంగత నేత ఇందిరాగాంధీ మీద కేసులు వచ్చినపుడు, ఆమె మీద షా కమిషన్ వేసినపుడు కూడా బేలగా ఆమె జనం తన చుట్టూ చేరి కాపాడమనలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నారు.

ప్రత్యేకత లేదుగా…?

దేశంలో చాలా మంది నాయకుల మీద కేసులు ఉన్నాయి. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. మరి వారెపుడూ కూడా ఇలా జనాన్ని కాపాడమని అడగలేదు. చంద్రబాబు కూడా వారి మాదిరిగానే రాజకీయ నేత, ప్రత్యేకమైన నాయకుడు కాదు, ఆయనకు మద్దతుగా జనం నిలబడాల్సిన పరిస్థితులూ లేవు. చంద్రబాబు ఒక వేళ తప్పు చేసి ఉంటే దానికి శిక్షలు ఉంటాయి. మేలి ముత్యమైతే జనం మళ్ళీ కోరుకుంటే ఆయనకు అందలాలు తిరిగి అందించవచ్చు. అంతే తప్ప చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారాలకు, ప్రజలకు మధ్య ఏమిటి సంబంధం. ఇది కొత్త రకం రాజకీయంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ దాడులు తరువాత చంద్రబాబు ఇలా మాట్లాడడం మాత్రం అనుమానస్పదంగా, హాస్యాస్పదంగా ఉంది.

Tags:    

Similar News