బాబు పట్టించుకోవడం లేదట.. అసలు బాధ అదేనట

పార్టీ ఓడిపోయినా.. ఇంకా ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోయినా.. ఇంకా ఆయ‌న‌ను గౌర‌విస్తూనే ఉన్నారు. మ‌రి ఇలా ఎన్నాళ్లు? ఇదే ఇప్పుడు టీడీపీలో [more]

Update: 2020-07-11 11:00 GMT

పార్టీ ఓడిపోయినా.. ఇంకా ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోయినా.. ఇంకా ఆయ‌న‌ను గౌర‌విస్తూనే ఉన్నారు. మ‌రి ఇలా ఎన్నాళ్లు? ఇదే ఇప్పుడు టీడీపీలో చ‌ర్చనీయాంశంగా మారింది. లెక్కకు మిక్కిలిగా ఉన్న టీడీపీ మ‌హిళలు.. త‌మ అభ్యర్థన‌ల‌ను చంద్రబాబుకు విన్నవించుకుని చాలా నెల‌లే అయింది. కానీ, ఇప్పటి వ‌ర‌కు కూడా వారికి బాబు నుంచి ఎలాంటి స‌మాధానం లేదు. దీంతోవారి ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. పోనీ.. వేరే పార్టీలోకి మార‌తారా ? అంటే.. వీరికి అస‌లు ఆ ఆలోచ‌నే లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో స‌ద‌రు మ‌హిళా నేత‌ల విష‌యం మ‌ళ్లీ చ‌ర్చకు వ‌చ్చింది.

పీతలకు ఇంకా….

మాజీ మంత్రులు పీత‌ల సుజాత‌, ప‌రిటాల సునీత‌, మాజీ స్పీక‌ర్ ప్రతిభా భార‌తి, మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌, ప‌లాస నుంచి పోటీ చేసి ఓడిపోయిన శిరీష వంటి కీల‌క మ‌హిళ‌లు చంద్రబాబుకు ప‌లు విన్నపాలు చేశారు. వీరిలో సుజాత‌.. త‌నకు తిరిగి చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను అప్పగించాల‌ని చాన్నాళ్ల కింద‌టే కోరారు. అయినా ఇప్పటి వ‌ర‌కు బాబు నిర్ణయం తీసుకోలేదు. పోనీ.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ దూకుడు మీద ఉందా? అంటే.. అది కూడా లేదు. అయినా చంద్రబాబు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, ప‌రిటాల సునీత.. ఇప్పటికే త‌మ అధీనంలో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌లు ఉన్నాయి.

పెనుకొండపై పట్టుకోసం…

అయితే, త‌మ‌కు పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌లు కూడా అప్పగించాల‌ని కోరుతున్నారు. ఈ విష‌యాన్ని కూడా చంద్రబాబు ఎటూ తేల్చలేదు. దీంతో ఈ ఫ్యామిలీ యాక్టివ్ పాలిటిక్స్‌కు దాదాపు దూరంగా జ‌రిగింది. లాక్ ‌డౌన్‌కు ముందు హైద‌రాబాద్‌లో మాజీ మంత్రి,చంద్రబాబు త‌న‌యుడు లోకేష్ నిర్వహించిన టీడీపీ యువ‌స‌మ్మేళ‌నంలో పాల్గొన్న ప‌రిటాల శ్రీరాం కూడా ఇదే అభ్యర్థన వెలిబుచ్చారు. కానీ, ఇప్పటి వ‌ర‌కు నిర్ణయం రాలేదు. అయితే చంద్రబాబు మాత్రం ధ‌ర్మవ‌రం ఎలాగూ ఖాళీగా ఉంది క‌దా అక్కడ‌కు వెళ్లమ‌ని ప‌రిటాల ఫ్యామిలీని కోరుతున్నా వాళ్లకు ధ‌ర్మవ‌రం కంటే పెనుగొండ పైనే మ‌న‌సు లాగుతోంది. గ‌తంలో ఇక్కడ నుంచే ప‌రిటాల ర‌వి, సునీత ఇద్దరూ ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు.

రాజాం విషయంలోనూ….

ఇక‌, మాజీ స్పీక‌ర్ ప్రతిభా భార‌తి కూడా త‌న కుమార్తె గ్రీష్మ‌కు శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను అప్పగించాల‌ని అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కోరుతున్నా చంద్రబాబు ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్రస్తుతం తెలుగు మ‌హిళ అధ్యక్షురాలిగా ఉన్న వంగ‌ల‌పూడి అనిత త‌న‌కు పాయ‌క‌రావుపేట ఇంచార్జ్ బాధ్యత‌లు అప్పగించాల‌ని కోర‌గా ఎట్టకేల‌కు ఇటీవ‌లే ఆమె క‌ల సాకారం అయ్యింది. అయితే అక్కడ ఆమెను బ‌లంగా వ్యతిరేకించే వ‌ర్గం ఆమెకు ఏ మాత్రం స‌హ‌క‌రించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో వీళ్లు అనిత‌ను ఓడిస్తామ‌ని చెప్పడంతోనే ఆమెను తీసుకు వ‌చ్చి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరులో పోటీ చేయించారు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ పాయ‌క‌రావుపేట సీటు ఇవ్వడంతో అనిత‌కు కక్కలేక మింగ‌లేక ప‌రిస్థితి వ‌చ్చేసింది. ప‌లాస నుంచి పోటీ చేసి ఓడిన శిరీష స్థానికంగా త‌న‌కు ప్రాధాన్యం లేద‌ని, త‌మ్ముళ్లు ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని, వారిని అదుపు చేయాల‌ని కోరి చాన్నాళ్లే అయింది .. అయినా చంద్రబాబు ప‌క్కన పెట్టారు. దీంతో వారంతా కూడా పార్టీకి దాదాపు దూరంగా ఉన్నారు. మ‌రి ఈ స‌మ‌స్య ఎప్పటికి తీరుతుందో చూడాలి.

Tags:    

Similar News