క్యాడర్ లో భయం పోగొట్టాలంటే ఇదే మార్గమా?

క్యాడర్ ను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నం మొదలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 మంది తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు [more]

Update: 2020-07-09 14:30 GMT

క్యాడర్ ను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నం మొదలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 800 మంది తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు బనాయించిందన్నది టీడీపీ ఆరోపణ. మండల స్థాయి నుంచి మాజీ మంత్రుల వరకూ కేసుల్లో చిక్కుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరిగలేక ద్వితీయ శ్రేణి నేతలు నలిగిపోతున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వారు ఇబ్బంది పడుతున్నారు.

నేతలు అందుబాటులో లేక….

ద్వితీయ శ్రేణినేతలకు పార్టీ నేతలు కూడా అందుబాటులో ఉండటం లేదు. మాజీ ఎమ్మెల్యేలు కేసుల విషయంలో జోక్యం చేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పినా నేతలు మాత్రం క్యాడర్ ను పట్టించుకోవడం లేదు. దీంతో క్యాడర్ పార్టీ జెండా పట్టుకోవడానికే భయపడే పరిస్థితి వచ్చింది. ఇటీవల జరిగిన మహానాడు, పార్టీ పిలుపు ఇచ్చిన పలు కార్యక్రమాల్లో చంద్రబాబుకు ఇది తెలిసి వచ్చింది.

ప్రతి మండలానికి ఒక న్యాయవాది…..

దీంతో చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. అక్రమ కేసుల్లో ఇరుకున్న పార్టీ నేతలకు న్యాయ సాయం అందించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ ఒక స్థాయి ఉన్న నేతలకే న్యాయ సహాయం పార్టీ అందిస్తూ వచ్చింది. ఇప్పుడు మండల స్థాయి నేతలకు కూడా న్యాయసహాయం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని పార్టీ తరుపున నియమించాలని చంద్రబాబు ఆదేశించారు.

కేంద్ర కార్యాలయం నుంచే….

పార్టీ తరుపున న్యాయవాదులకు కేంద్ర కార్యాలయమే జీతభత్యాలను చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నారు. న్యాయసహాయం అందిస్తే క్యాడర్ లో భరోసా నింపినట్లవుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. కనీసం జైలు పాలు కాకుండా బెయిల్ లభించేలా చూడగలిగితే కొంతలో కొంత నయం అని టీడీపీ నేతలు సయితం భావిస్తున్నారు. లేకుంటే అసలకే ఎసరు వస్తుందని భావించిన చంద్రబాబు న్యాయ ఏర్పాట్లు క్యాడర్ కోసం ప్రత్యేకంగా చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాలుగేళ్లలో ఎటూ కేసులు రాకతప్పదని భావిస్తున్న చంద్రబాబు మండల స్థాయిలో ఈ ఏర్పాట్లు చేశారంటున్నారు.

Tags:    

Similar News