ఈ పులిహోర రాజకీయం ఎందుకు బాబూ?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ లో బిజెపి నేతలుగా చెప్పుకోబడే టిడిపి కోవర్ట్ లు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లో కమలం కలవరపడాలిసింది పోయి టిడిపి [more]

Update: 2020-06-24 03:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ లో బిజెపి నేతలుగా చెప్పుకోబడే టిడిపి కోవర్ట్ లు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లో కమలం కలవరపడాలిసింది పోయి టిడిపి ఖంగారు పడటం తో విషయం తేలిపోయింది. సామాన్యులకు సైతం పులిహోర రాజకీయం అర్ధం అయ్యేలా వీరి నాటకాలు పార్క్ హయత్ హోటల్ వీడియో లు బయటపెట్టేశాయి. ఇలా ఒక హోటల్ లో సుజనా, కామినేని కలవడం తప్పు కానప్పటికీ నిమ్మగడ్డ వీరితో భేటీ కావడమే అసలు సమస్య అయ్యింది. ఈ వ్యవహారంలో సుజనా, కామినేని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల వైపు నుంచి టిడిపి నానా ప్రయాస పడటం ప్రహసనంగా మారింది. వాస్తవానికి టిడిపి కి ఈ ముగ్గురి భేటీ తో ఎలాంటి సంబంధం ఉన్నా లేకపోయినా సైలెంట్ గా ఉంటే సరిపోయేది. అది వదిలేసి కలిస్తే తప్పేంటి అంటూ ఈ కేసు తమ పార్టీకి సంబంధించిందే అని తెలుగుదేశం చెప్పకనే చెప్పినట్లు అయ్యింది.

బాబు నాటిన కమలాలు …

కామినేని శ్రీనివాస్ కు తెలుగుదేశం పార్టీ నుంచే 2014 ఎన్నికల్లో పోటీ చేయాలి. అయితే టిడిపి బెర్త్ లు అన్ని పూర్తి అయిపోయాయి. దాంతో కామినేని వంటి వారిని బిజెపి లోకి వ్యూహాత్మకంగా చంద్రబాబే పంపారన్నది తెలుగు పాలిటిక్స్ అర్ధం చేసుకునే వారు చెప్పే మాట. ఇలా పేరుకు బిజెపి తో పొత్తు పెట్టుకుని వారికి కొన్ని ఎమ్యెల్యే స్థానాలు కట్టబెట్టిన అందులో సగానికి పైగా చంద్రన్న దళమే అన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం తెలిసినా కమలనాథులకు ఎపి లో పెద్ద దిక్కుగా బిజెపి కి ఉన్న వెంకయ్య నాయుడు అడ్డు గా నిలవడంతో కమలం ఎస్ అనేసిందనే చర్చ అప్పుడు ఇప్పుడు ఉంది. ఇలాంటి వ్యవహారాలు ఎన్నికల తరువాత కూడా కేంద్రమంత్రి హోదాలో వెంకయ్య వెనుక ఉండి బాబు కి అండగా నిలిచి చేస్తూ ఉండటం నాయుడు లు ఇద్దరు ఎపి పాలిటిక్స్ లో పరస్పర అభినందన కమిటీగా సన్మానాలు చేసుకోవడం గుర్తించి మోడీ, షా లు వ్యూహాత్మకంగా వెంకయ్యకు ఇష్టం లేకపోయినా ఉపరాష్ట్రపతిని చేసి పార్టీని బతికించే ప్రయత్నానికి పునాది వేశారని కాషాయదళం లో ఎప్పటినుంచో ఉన్న టాక్.

వెంకయ్య తప్పుకున్నాక …

కేంద్రంలో ఉన్న బిజెపి లో చక్రం తిప్పే వెంకయ్య నాయుడు వంటివారు టిడిపి కి ఆకస్మికంగా దూరం అయ్యారు. ఆ లోటు ను భర్తీ చేయాలంటే ఎవరో ఒకరు హస్తిన రాజకీయాల్లో బిజెపి లో నడుపుతూ తెలుగుదేశానికి మేలు చేయాలి. ఆ వ్యూహంతోనే చంద్రబాబు తన రాజ్యసభ సభ్యులు నలుగురిని గంపగుత్తగా పంపించారని టిడిపి నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ, తోట త్రిమూర్తులు వంటివారు అంతా ఓపెన్ గానే చెప్పినా దీన్ని తీవ్రంగా ఆ పార్టీ వర్గాలు ఖండించకపోవడం గమనార్హం.

తాజా పరిణామాలతో…..

తాజాగా పార్క్ హయత్ లో నిమ్మగడ్డ, కామినేని సుజనా నేతృత్వంలో భేటీ తెలుగుదేశం ప్రత్యర్థులకు చుక్కలు చూపించేందుకు పక్క పార్టీలతో చేతులు కలిపి ఎలాంటి రాజకీయాలు అయినా చేయగలదని తేటతెల్లం చేసేసింది. ఇప్పటివరకు నీతి కబుర్లు చెప్పిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీన్ని సమర్ధించుకోలేక, ఖండించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సుజనా, కామినేని ఈ భేటీపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఇప్పుడు పట్టించుకునే వారు లేరు. వారి పాతివ్రత్యం పై ప్రజల్లో ఇప్పటికే ఎలాంటి నమ్మకాలు లేకపోవడంతో సుజనా, కామినేని తాము బిజెపి నేతలమని చెప్పినా కాదు టిడిపి అనే పరిస్థితి మాత్రం మరోసారి కొనితెచ్చుకున్నట్లు అయ్యింది.

Tags:    

Similar News