అందుకే చంద్రబాబును వాళ్లు నమ్ముతారు

టీడీపీలో చాలా సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఎవరు మనవారు, ఎవరు పగవారు, ఎవరు గోడ దూకేవారు, ఎవరు కొమ్ము కాసేవారు ఇలా ఏదీ తేల్చుకోలేక ఎవరినీ నమ్మలేక అధినాయకత్వం [more]

Update: 2020-06-20 14:30 GMT

టీడీపీలో చాలా సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఎవరు మనవారు, ఎవరు పగవారు, ఎవరు గోడ దూకేవారు, ఎవరు కొమ్ము కాసేవారు ఇలా ఏదీ తేల్చుకోలేక ఎవరినీ నమ్మలేక అధినాయకత్వం కిందా మీదా అవుతోంది. బహుశా దాన్ని తెలుసుకోవడం కోసమే రాజ్యసభ ఎన్నికలలో పోటీ అంటూ బరిలోకి దిగినట్లుంది. అయితే నిఖార్సుగా17 మంది టీడీపీ వైపు ఉన్నారని లెక్క తేల్సింది. మిగిలిన వారులో ఆదిరెడ్డి భవాని చెల్లని ఓటు వేసినా బాబు వైపే అంటోంది. ఇక అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ కూడా టీడీపీలోనే ఉంటారు. కాబట్టి 20 దగ్గర బాబు లెక్క ఫిక్స్ చేసుకోవచ్చా అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది.

గంటా సార్ అలా…..

విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మౌనం వెనక అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి బద్దలైతే పసుపు కోటలు మండిపోతాయని ఇప్పటిదాకా ప్రచారం అయితే సాగింది. కానీ గంటా శ్రీనివాస్ కీలకమైన సమయాల్లో పార్టీ వైపే ఉంటున్నారు. నిన్న గాక మొన్న జరిన జామ్ యాప్ మహానాడుకు హాజరయ్యారు, ఇపుడు ఏకంగా టీడీపీ అభ్యర్ధికే ఓటేసి తన నిజాయతీ చాటుకున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాస్ వైపు ఇన్నాళ్ళూ అనుమానంగా చూస్తూ వస్తున్న హై కమాండ్ ఇకనైనా ఆయన్ని నమ్ముతుందా అన్నది చూడాలి. ఆయన బాటలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కూడా వైసీపీలోకి బంగీ జంప్ చేస్తారని కూడా ప్రచారం సాగింది. కానీ ఆయన కూడా బుధ్ధిమంతుడేనని ఇపుడు తేలింది. మొత్తానికి ఉత్తరాంధ్రాలో పసుపు పార్టీకి తమ్ముళ్ళు ఝలక్ ఇచ్చే ఆలోచనలో లేరని కూడా తెలిసింది.

ఫరవాలేదా ….?

ఇంతటి వైసీపీ దూకుడులో కూడా చంద్రబాబు వైపు ఇంతమంది ఎమ్మెల్యేలు నిలబడడం అంటే అది టీడీపీకి బలమేనని అంటున్నారు. నిజానికి చంద్రబాబు పార్టీకి పది మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరని, ఆయనతో పాటు, బావమరిది మాత్రమే మిగులుతారని ఓ వైపు ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు అయితే రాజ్యసభ ఎన్నికల తరువాత చూసుకోండి టీడీపీ కోటకు బీటలేనని జోస్యాలు పలికారు, కానీ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సైతం చంద్రబాబు వైపు రెండు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఆయన నాయకత్వ పటిమగానే చూడాలి అంటున్నారు.

అదే డౌటు మరి…..

సరే ఇప్పటికి ఈ సంఖ్య మిగిలింది. అంటే తొలి ఏడాదికి ముగ్గురు ఎమ్మెల్యేలు పోగా 20 మంది వరకూ ఎమ్మెల్యేలు టీడీపీకి మిగిలారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. మరో వైపు చంద్రబాబు విపక్ష హోదాకు భంగం వాటిల్లలేదు. కానీ ముందు ముందు ఇలాగే పరిస్థితి ఉంటుందా అంటే చెప్పలేమనే అంటున్నారు. ఎందుకంటే ఇది రాజకీయం. ఎప్పటికపుడు అంతా మారుతుంది. ఇపుడు పార్టీని ముగ్గురు వీడారు, వైసీపీకి కూడా అంత హఠాత్తుగా వారిని లాగేసుకోవాలన్న దురద లేదు, కానీ రేపటి రోజున వైసీపీ కనుక గట్టిగా గురిపెడితే మిగిలేది ఎందరు, గోడ దూకేది ఎందరు అన్నదే ఇపుడు చర్చ. ఏది ఏమైనా ఇప్పటికి మాత్రం 20 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు కొంత ఫరవాలేదన్న పొజిషన్లోనే ఉన్నారు. అదే తమ్ముళ్లకు మిగిలిన సంతోషం.

Tags:    

Similar News