బాబు భయపడినట్లే….. నిజమవుతుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భయమే నిజమవుతోంది. తొలి నుంచి అనుకుంటున్నట్లుగానే జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్ చేస్తుందని చంద్రబాబు ఊహించారు. తమ పాలనపై విచారణలకు [more]

Update: 2020-06-21 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భయమే నిజమవుతోంది. తొలి నుంచి అనుకుంటున్నట్లుగానే జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్ చేస్తుందని చంద్రబాబు ఊహించారు. తమ పాలనపై విచారణలకు కూడా జగన్ ఆదేశిస్తారని చంద్రబాబుకు తెలుసు. అయితే టీడీపీ నేతలపై కేసులు బనాయిస్తారని మాత్రం ఊహించలేకపోయారు. పకడ్బందీగా కేసులు పెట్టి బెయిల్ రాకుండా జైల్లో పెట్టాలన్నది వైసీపీ వ్యూహంగా అనిపించడంతో ఇప్పుడు చంద్రబాబు అదే భయపడుతున్నారు.

ఇద్దరు అరెస్ట్ కావడంతో…..

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలు కూడా అరెస్ట్ అయ్యారు. తర్వాత ఎవరన్న చర్చ పార్టీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు తమ కెందుకొచ్చిందన్న తీరులో వ్యవహరిస్తున్నారు. నారా లోకేష్ అనంతపురం పర్యటనకు వెళ్లినా అనేక మంది నేతలు ముఖం చాటేయడాానికి కారణమదే.

జగన్ తో పెట్టుకుంటే…..

జగన్ తో ఎఫెన్స్ లో వెళితే ఇబ్బందుల్లో పడతామని చాలామంది నేతలు ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరైతే నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం లేదు. తమ వద్దకు వచ్చిన కార్యకర్తలకు మాత్రం సాయం చేసి పంపించి వేస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో నేతలు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు.

ఊహించని పరిణామంతో…

ఇది చంద్రబాబు ఊహించనది. కేసులు ఎక్కువగా పెడితే పార్టీకి ఊపు వస్తుందని ఆయన భావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వస్తారని అనుకున్నారు. ఓటమి బాధతో ఏడాది కాలంగా దూరంగా ఉంటున్న నేతలు ఈ పరిణామాలతోనైనా వీధుల్లోకి వస్తారని చంద్రబాబు ఊహించినా దానికి రివర్స్ లో జరుగుతుంది. అరెస్ట్ లతో టీడీపీ నేతలు మరింత భయపడుతున్నారు. చంద్రబాబు పిలుపులకు కూడా పెద్దగా స్పందన లేదు. అందుకే చంద్రబాబు ఇప్పుడు భయపడుతున్నారు. మరో నాలుగేళ్లు ఇలాగే భయపడి ఇంట్లో ఉంటే ఎలా? అని సీనియర్ నేతలతో ఆయన చర్చిస్తున్నారు. టీడీపీ నేతలతో త్వరలోనే చంద్రబాబు భేటీ అయ్యేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News