వీరుడా…? కుట్రదారుడా?

చంద్రబాబు రాజకీయ నాయకుడు. టిడిపి రాజకీయ పార్టీ. నాయకుడి లక్ష్యం, పార్టీ లక్ష్యం అధికారం చేజిక్కించుకోవడమే. ఈ లక్ష్య సాధనకోసం నాయకుడు, పార్టీ నిరంతరం కృషి చేయాల్సి [more]

Update: 2020-06-18 05:00 GMT

చంద్రబాబు రాజకీయ నాయకుడు. టిడిపి రాజకీయ పార్టీ. నాయకుడి లక్ష్యం, పార్టీ లక్ష్యం అధికారం చేజిక్కించుకోవడమే. ఈ లక్ష్య సాధనకోసం నాయకుడు, పార్టీ నిరంతరం కృషి చేయాల్సి ఉంది. ఈ విషయంలో చంద్రబాబు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఏడు పదుల వయసులో కూడా తన పార్టీని అధికారంలో ఉంచేందుకు, పోయిన అధికారం సంపాదించేందుకు ఆయన చేస్తున్న కృషిని ఆయన వైపు ఉన్న వారు అభిమానిస్తారు. ఆరాధిస్తారు.

టీడీపీ ట్రస్ట్ ఏమీ కాదు..

రాజకీయాలకు విరామం ఇచ్చి ప్రజాసేవ చేసేందుకు టిడిపి టాటా ట్రస్టు కాదు, చంద్రబాబు రతన్ టాటా కాదు. అలాగే ప్రభుత్వానికి మంచి సూచనలు, సలహాలు ఇచ్చినందుకు చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ కాదు, టీడీపీ ఐ-పాక్ (I-PAC) కాదు. రాజకీయం అంటే రాజకీయమే. తనను గెలిపించుకోడానికి, తన అనుచరులు గెలవడానికి, తన పార్టీ అధికారంలోకి రావడానికి ఎంత కృషి చేయాలో చంద్రబాబు అంతకంటే ఎక్కువ కృషి చేస్తారు.

శృతి మించకూడదు….

అధికారమే లక్ష్యం అయినప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ అలాగే చేస్తాయి. అయితే ఈ చర్యలు శృతి మించకూడదు. పులి వేటాడుతుంది. వేటకోసం మాటు వేస్తుంది. పరుగెత్తుతుంది. ప్రత్యర్థి గుంపును బెదరకొడుతుంది. చెదరగొడుతుంది. వేట ముగించి ఆహరం దక్కించుకుంటుంది. అయితే వేటకు ప్రకృతి నిబంధనలు (నాచురల్ రూల్స్) ఉంటాయి. వేటాడిన పులి తిన్నంత తిని మిగిలిన ఆహారాన్ని రేపటికి ఏ పొదలోనో దాచుకుంటుంది. చిరుత అయితే ఏ చెట్టుమీదో దాచుకుంటుంది. ఆ ఆహారం అయ్యేవరకూ మళ్ళీ వేటాడదు.

బాబు యుద్ధానికి మాత్రం….

రాజ్యాలకోసం, అధికారం కోసం యుద్ధం చేసే వారు కూడా కొన్ని నిబంధనలు పాటిస్తారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత యుద్ధభూమిలోని శిబిరాల్లో విశ్రాంతి తీసుకుంటారు. రేపటి యుద్ధ వ్యూహాలు రచించుకుంటారు. అది ఒక ఆమోదిత నిబంధన. వేటకు విరామం ఉంటుంది. యుద్దానికి విరామం ఉంటుంది. చంద్రబాబు యుద్దానికి మాత్రం విరామం ఉండదు. ఆయన నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటారు. వ్యూహాలు రచిస్తూనే ఉంటారు. ప్రత్యర్థులపై దెబ్బ కొడుతూనే ఉంటారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అవకాశాలు లేకపోతే సృష్టించుకుంటారు. అభిమానించేవారు ఆయనను వీరుడు అంటారు. ప్రత్యర్ధులు ఆయనను కుట్రదారుడు అంటారు.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News