మా చెడ్డ రోజులు వచ్చేశాయా ?

అదేంటో తెలుగుదేశానికి రోజులు అసలు బాగులేవు. ఈ విషయం చెప్పడానికి ఏ జ్యోతిష్యం అవసరం లేదు. రెండేళ్ళు తిరగకుండానే మళ్ళీ నల్లచొక్కాను చంద్రబాబు ధరించడమే దాన్ని చక్కగా [more]

Update: 2020-06-19 14:30 GMT

అదేంటో తెలుగుదేశానికి రోజులు అసలు బాగులేవు. ఈ విషయం చెప్పడానికి ఏ జ్యోతిష్యం అవసరం లేదు. రెండేళ్ళు తిరగకుండానే మళ్ళీ నల్లచొక్కాను చంద్రబాబు ధరించడమే దాన్ని చక్కగా తెలియచేస్తోంది. నలుపు అంటే అరిష్టానికి చిహ్నం. పైగా శని నెత్తిన పడితే నలుపు వంటికి చుట్టుకుంటుంది. ఇపుడు పసుపు పార్టీ కాస్తా కాంతులు తగ్గి నలుపులోకి వెళ్ళిపోవడం, ఇంట్లో దీపాలు ఆర్పేసి చీకట్లో కాగడాలతో గుడ్డి వెలుగుల కోసం వెతకడం అంటే నిజంగానే అంధకారంలోకి వెళ్ళిపోతున్నట్లుగానే లెక్క వేయాలి. దానికి తగినట్లుగా వర్తమాన రాజకీయ కధ కూడా సాగుతోంది. ఉన్నట్లుండి ఇద్దరు పెద్ద నాయకులకు జైలు దారి చూపించిన వైసీపీ సర్కార్ మరిన్ని అరెస్టులకు చకచకా రంగం సిధ్ధం చేస్తోంది.

రాజధాని రచ్చ….

ఇది చాలదు అన్నట్లుగా ఇపుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగడం పులిమీద పుట్రలాగానే చూడాలి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇపుడు రాజధాని భూముల్లో అవకతవకలు చూసేందుకు నేరుగా ఏపీలోకి వచ్చేశారు. దాదాపు ఆరేడు వందల మంది తెల్లకార్డుదారులు రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ లో భాగంగా భూములను పెద్దల గద్దలకు బినామీలుగా మారి పెద్ద ఎత్తున కొనేశారు. ఆ బినామీలకే బాబు సర్కార్ నుంచి భారీ ఎత్తున లబ్ది కలిగింది. ఇప్పటికే దీని మీద విచారిస్తున్న సీఐడీ అధికారులు తమ దగ్గర ఉన్న సమాచారం అంతా ఈడీకి అప్పగించారు. వచ్చిన పనితో పాటు అగ్రీ గోల్డ్ స్కాం పైనా, అచ్చెనన్నాయుడు అరెస్ట్ కి దారి తీసిన ఈ ఎస్ ఐ కుంభకోణం పైనా కూడా ఈడీ దర్యాప్తు చేస్తుందన్న సమాచారం ఇపుడు పసుపు పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేస్తోంది.

మసిపూసినా …?

తమ పార్టీ నేతలు అవినీతి చేయలేదు, ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదు అని ఇప్పటికీ చెప్పని చంద్రబాబు, ఇతర తమ్ముళ్ళు అరెస్ట్ అన్యాయమని మాత్రమే గొంతెత్తి అరుస్తున్నారు. కక్ష సాధింపు, అక్రమం అంటున్నారు. సరే జగన్ మీద ఇలా నిందలు వేస్తున్న వారు ఇపుడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగాకా ఏమంటారు, ఈడీ మోడీ సర్కార్ ఆద్వర్యంలో పనిచేస్తుంది. దానికి కూడా కక్ష కట్టి నిందించగలరా. మోడీని ఒక్క మాట అయినా అనగలరా. ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా కూడా ఇద్దరు టీడీపీ తమ్ముళ్ళ అరెస్ట్ పై జనం నుంచి పెద్దగా సానుభూతి రాలేదు, అదే విధంగా టీడీపీలోనే నిరసనలకు నేతలు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది.

సీబీఐ కూడా…?

ఇక సీబీఐ కూడా రేపో మాపో రంగంలోకి దిగడం ఖాయం. ఎందుకంటే చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపైన మంత్రివర్గం సీబీఐ విచారణను ఇప్పటికే కోరుతోంది. దాంతో కేంద్రం నుంచి సీబీఐ వస్తే మొత్తం కధ మారిపోతుంది. అపుడు టీడీపీ పెత్తందారులకే అసలైన సెగలు తగులుతాయి. ఇప్పటికే తనను అరేస్ట్ చేస్తారేమోనని చినబాబు లోకేష్ తెగ డౌట్ పడుతున్నాడు. ఇక పెదబాబు చంద్రబాబు మానసిక బాధ, ఆవేదన ఈ సమయంలో వర్ణించడం కూడా కష్టమే. మొత్తం మీద ఇవన్నీ చూసుకున్నపుడు పసుపు పార్టీకి చెడ్డ రోజులు దాపురించాయని అనక తప్పదంటున్నారు.

Tags:    

Similar News