చంద్రుడినే మింగేసింది

కాల‌మ‌నే స‌మీరం.. గిర్రున తిరిగిపోయింది. 365 రోజులు, 52 వారాలు, 12 నెల‌లు మ‌రో రెండు రోజుల్లో చ‌రిత్రలో క‌లిసిపోతున్నాయి. అయితే, కాలం ఇక్కడితో ఆగిపోదు.. అనేక [more]

Update: 2019-12-31 06:30 GMT

కాల‌మ‌నే స‌మీరం.. గిర్రున తిరిగిపోయింది. 365 రోజులు, 52 వారాలు, 12 నెల‌లు మ‌రో రెండు రోజుల్లో చ‌రిత్రలో క‌లిసిపోతున్నాయి. అయితే, కాలం ఇక్కడితో ఆగిపోదు.. అనేక భావావేశాలు.. అనేక జ్ఞాప‌కాల‌ను మూట‌గ‌ట్టి మ‌న‌కు వ‌దిలేసి.. మౌనంగా జారుకున్నా .. తొలిపొద్దు మ‌రో ఉషోద‌యంతో మ‌న‌ముంగిట వాలుతుంది. క‌దిలే కాల‌మా.. కాసేపు ఆగ‌వ‌మ్మా.. అని ప్రార్థించినా.. అర్ధించినా.. కాల‌గ‌మ‌న చ‌క్రం తారాజువ్వలా దూసుకుపోవ‌డ‌మే త‌ప్ప.. వెనుక‌క‌డుగు వేయ‌డం అనేది ఉండ‌దు. కాలం మార‌దు.. మ‌న‌మే మారుతున్నాం.. అనే సినీ క‌వి వ్యాఖ్యల‌ను నిజంచేస్తూ.. మారుతున్న మ‌నుషులతోపాటు రాష్ట్రంలోనూ అధికారం మారిపోయిన సంవ‌త్సరం..కొంద‌రికి మోదం మిగ‌ల్చగా ఇంకొంద‌రికి ఖేదం మూట‌గ‌ట్టి భుజాన‌వేసింది.

ఎంత ప్రయత్నించినా….

మొత్తంగా 2019లో ప్రధాన రాజకీయ పార్టీ టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీకి చిరునామాగా మారిన చంద్రబాబు నాయుడుకు ఏమేర‌కు క‌లిసి వ‌చ్చింది? ఎలాంటి అనుభ‌వాల‌ను మిగిల్చింది? కాల‌మ‌నే సుడిగుండంలో చిక్కుకుని కొట్టుకుపోయిన వారే త‌ప్ప.. బ‌య‌ట‌ప‌డ్డవారు ఎవ‌రు ? అని ప్రశ్నిస్తారు ప్రముఖ క‌వి సింగిరెడ్డి నారాయ‌ణ రెడ్డి. అలాంటి బ‌ల‌మైన కాలాన్ని త‌న‌కు అనుకూ లంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నించిన రాజ‌కీయ నాయ కుల్లో చంద్రబాబు ఒక‌రు. ఈ ఏడాది రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న గెలుపుపై ఆయ‌న అనేక ఆశ‌లు పెట్టుకున్నారు. గెలుపు అనివార్యం అన్నారు. నేను లేక‌పోతే.. రాష్ట్రం ముందుకు వెళ్లద‌ని చెప్పారు. త‌న గెలుపును మ‌హిళ‌లు కూడా కోరుతున్నార‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రక‌టించారు.

రివర్స్ అవడంతో…..

కానీ, కాలం ఆయ‌నకు క‌లిసి రాలేదు. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న మ‌హిళల‌కు పంచిన ప‌సుపు-కుంకుమ రివ‌ర్స్ అయింది. పార్టీ భ‌విత‌కు ఐదేళ్ల పెను విషాదాన్ని నింపుతూ.. ఘోర పరాజ‌యాన్ని 2019 భుజాన మోపింది. కేవలం 23 స్థానాల్లో మాత్రమే పార్టీ విజ‌యం సాధించింది. చేయాల్సిందంతా నేనే చేసేశాను. ఇప్పుడు రాష్ట్రంలో ఎవ‌రు వ‌చ్చినా నేను చేసిన వాటిని అనుస‌రించ‌డ‌మే త‌ప్ప కొత్తగా చేయా ల్సింది ఏమీ లేవ‌ని చెప్పిన చంద్రబాబుకు ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం చేసిన అనేక సంచ‌నాలు కంటిపై కునుకులేకుండా చేయ‌డం నిజంగా విచారించాల్సిన విష‌యం.

చేదు మాత్రగానే…..

బీజేపీతో చేసుకున్న తెగుతెంపులు మ‌రోసారి బంధం దిశ‌గా అడుగులు వేసే ప‌రిస్థితి క‌ల్పించింది కూడా ఈ ఏడాదే. పార్టీలో అనైక్యత త‌మ్ముళ్ల మ‌ధ్య విభేదాలు, త‌ను ఎన్నో క‌ల‌లతో క‌ట్టుకోవాల‌నుకున్న అమ‌రావ‌తి క‌ళ్లముందే కుప్పకూలుతున్న ప‌రిస్థితిని కూడా ఏడాదే జ‌ర‌గ‌డం విచిత్రం. ఇక‌, త‌న కుమారుడు లోకేష్ ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకోవ‌డం కూడా చంద్రబాబుకు మ‌రో చేదు విషాద‌మ‌నే చెప్పాలి. గ‌త ఏడాది కేంద్రంతో పోరు చేసిన చంద్రబాబు ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి కేంద్ర సానుకూల వీక్షణ కోసం త‌పించి పోవ‌డం విధి విచిత్రం అన‌కుండా ఉండ‌గ‌ల‌మా? గ‌త ఏడాది ఎవ‌రితో అంట‌కాగి.. కేంద్రంపై నిర‌స‌న వ్యక్తం చేశారో.. ఇప్పుడు వారితోనే విభేదించే ప‌రిస్థితి రావ‌డం కూడా ఈ ఏడాది చంద్రబాబుకు చివ‌రకు మిగిలిన చేదు మాత్రగానే ఉండ‌డం గ‌మ‌నార్హం.

చేదు సంత్సరమే….

మొత్తంగా 2019లో టీడీపీ ప్రతిష్టాత్మక‌మైన‌ మ‌హానాడును కూడా నిర్వహించుకోలేక పోవ‌డం మ‌రో విస్మరించ‌లేని విష‌యం. పోయిన‌(పోగొట్టుకున్న) ప్ర‌తిష్ట కోసం అర్రులు చాస్తూ.. అందివ‌చ్చిన ప్రతి విష‌యాన్నీ ఆందోళ‌న‌గా మారుస్తున్నా.. త‌మ్ముళ్లు అందిరాక‌పోవ‌డం, పార్టీలో సీట్లు ఖాళీ అవుతుండ‌డం ఈ ఏడాది మ‌రో చిత్రం. మ‌రి ఈ విషాద సంవ‌త్సరం ఎలాగూ వెళ్లిపోతోంది కాబ‌ట్టి వ‌చ్చే 2020 అయినా బాబుకు మంచి జరుగుతుందేమో చూడాలి!!

Tags:    

Similar News