ప్రకంపనలు ఏవీ? ఎవరూ కలసి రావడం లేదే?

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు గట్టి మద్దతుదారు, కుడిభుజం లాంటి అచ్చెన్నాయుడు అరెస్ట్ వార్త మీడియాలో సంచలనం తప్ప బయట మాత్రం ఆ ప్రభావం ఏమీ పెద్దగా కనిపించకపోవడం [more]

Update: 2020-06-19 05:00 GMT

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు గట్టి మద్దతుదారు, కుడిభుజం లాంటి అచ్చెన్నాయుడు అరెస్ట్ వార్త మీడియాలో సంచలనం తప్ప బయట మాత్రం ఆ ప్రభావం ఏమీ పెద్దగా కనిపించకపోవడం విచిత్రమే. నిజానికి టీడీపీ లాంటి పార్టీలో బలమైన బీసీ వర్గానికి చెందిన నేత అరెస్ట్ అయితే ఏపీ అట్టుడకాలి. జాతీయ స్థాయిలో ప్రకంపనలు పుట్టాలి. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. అచ్చెన్న అరెస్ట్ ఒక్క తెలుగుదేశం బాధగానే ఉంది. లోకానికి పట్టలేనట్లుగా కనిపిస్తోంది. కనీసం రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ అరెస్ట్ ఏంటి ఇలా అన్న మాట అనలేదు.

మండిపడ్డ ఎర్రన్న ….

నిజానికి ఈఎస్ఐ స్కాం విషయంలో మొదట నోరెత్తింది. పోరాటాలు చేసింది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. ఆయన ఆనాటి చంద్రబాబు ప్రభుత్వానికే దీని మీద లేఖలు రాసారు. విచారణ జరిపించమని డిమాండ్ కూడా చేశారు. కానీ అప్పటి తెలుగు వల్లభుడు చంద్రబాబు పట్టించుకోలేదు. ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత జగన్ సరైన టైం చూసి ఏసీబీ ద్వారా అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయించారు. విషయం ఇలా ఉండడంతో ఇపుడు మధు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. అవినీతి చేస్తే ఎవరైనా ఒక్కటేనని అంటున్నారు. దానికి కులాలు మరోటి అంటగట్టి దిగజారుడు రాజకీయం చేయవద్దు అంటూ చంద్రబాబు మీద ఘాటైన కామెంట్స్ చేశారు. ఈఎస్ఐ స్కాం వల్ల చిరుద్యోగులు ఎందరో ఇబ్బందుల పాలు అయ్యారని ఆయన మళ్ళీ గుర్తు చేశారు. వారికి న్యాయం జరగాల్సిందేనని అంటున్నారు.

కమలనాధులూ అటే….

ఇక చాలా విషయాల్లో టీడీపీకి మద్దతుగా మాట్లాడే కమలనాధులు అచ్చెన్న అరెస్ట్ విషయంలో మాత్రం తప్పుంటే శిక్ష పడాల్సిందేనని అంటున్నారు. అవినీతి ఎవరు చేసినా తమ పార్టీ సహించదని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. అయిదేళ్ళ టీడీపీ అవినీతి మీద విచారణ జరిపిస్తామని ఎన్నికల్లో చెప్పి మరీ జగన్ అధికారంలోకి వచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరుతున్నారు. ఇక అదే పార్టీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనంటూ జగన్ సర్కార్ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడారు.

వట్టిపోయిన కార్డు…..

బీసీల పేరు చెప్పి అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో ఆ వర్గాన్ని రెచ్చగొడదామని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు కూడా వమ్ము అయిపోయాయి. జాతీయ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. ఇపుడు చంద్రబాబు బీసీల పేరు చెప్పి మోసం చేయడం దేనికి అంటూ కస్సుమంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తీరని అన్యాయం చేసిన చంద్రబాబుకు ఇపుడు బీసీలు గుర్తుకురావడం ఏంటి అని కూడా గట్టిగానే తగులుకున్నారు. జనసేన, సీపీఐ వంటి పార్టీలు కూడా అచ్చెన్న అరెస్ట్ మీద ఇప్పటిదాకా స్పందించకపోవడంతో మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు ది ఒంటరి పోరాటమే అయింది.

Tags:    

Similar News