ట్రాక్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని ట్రాక్ లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది గడిచిపోవడంతో ఇక పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలన్న ఉద్దేశ్యంతో [more]

Update: 2020-06-18 12:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని ట్రాక్ లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది గడిచిపోవడంతో ఇక పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. ఇందుకు ముఖ్యంగా పార్టీలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లారు. మరికొందరు పార్టీని వదిలి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలో ఎవరు వెళ్లినా పార్టీకి ఏం కాదన్న సంకేతాలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా….

చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా అధ్యక్షులను, రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా చంద్రబాబు మారుస్తున్నారు. ఈసారి పూర్తిగా యువతకు, బలహీనవర్గాలకు పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై చంద్రాబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని, త్వరలోనే కమిటీల నియామకం పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఓటమి నుంచి తేరుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగేవారినే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

వివరాలను తెప్పించుకుని…..

ఓటమి తర్వాత అనేక జిల్లాల్లో నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారందరినీ ఇప్పటికే గుర్తించారు. ఏడాది నుంచి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, వాటిని ఎవరెవరు అమలు చేశారు వంటి వివరాలను ఇప్పటికే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు తెప్పించుకున్నారు. దీనిని బట్టి వారికి పార్టీ కార్యవర్గంలో చోటు దక్కనుంది. ఒకేసారి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

రేసులో ఉన్న నేతలు…..

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే కొందరిని చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలిసింది. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… 1) శ్రీకాకుళం : గౌతు శిరీష 2) విజయనగరం: మాజీ ఎమ్మెల్యే కె.ఎ. నాయుడు .3) విశాఖ: వాసుపల్లి గణేష్.4) అనకాపల్లి: మాజీ ఎమ్మెల్యే రామానాయుడు.5) కాకినాడ: జ్యోతుల నెహ్రూ.6) బందరు: బచ్చుల అర్జునుడు.7) గుంటూరు: ఆలపాటి రాజా. 8) బాపట్ల: నక్కా ఆనంద్ బాబు.9) నరసరావుపేట: యరపతినేని శ్రీనివాసరావు 10) ఒంగోలు: దామచర్ల జనార్ధన్.11) నెల్లూరు: బీదరవిచంద్ర. 12) తిరుపతి: మాజీ ఎమ్మెల్యే సునీల్. 13) కడప: శ్రీనివాసులు రెడ్డి.14) కర్నూలు: మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి15) హిందూపురం: పార్థసారథి.16) నంద్యాల: ఎన్ ఎండి. ఫరూక్ పేర్లు ఖరారయినట్లు తెలుస్తోంది.
మరికొద్దిరోజుల్లోనే చంద్రబాబు పార్టీ నియామకాలను ప్రకటిస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News