అసలు వారే కానివారయ్యారే

జాతకం అంటే అదే మరి. ఎవరో నాటిన మొక్క ఫలాలు మరొకరు అనుభవిస్తారు. తెలుగుదేశం పార్టీని అన్న గారు ఎందుకు స్థాపించారు అంటే నారా వారి కోసమే [more]

Update: 2019-11-24 06:30 GMT

జాతకం అంటే అదే మరి. ఎవరో నాటిన మొక్క ఫలాలు మరొకరు అనుభవిస్తారు. తెలుగుదేశం పార్టీని అన్న గారు ఎందుకు స్థాపించారు అంటే నారా వారి కోసమే అని సమాధానం చెప్పుకోవాల్సివస్తుందేమో. అప్పటికే రాజకీయ ప్రవేశం చేసిన చంద్రబాబుకు కాంగ్రెస్ లో మంత్రి పదవి దక్కింది. అయితే కాంగ్రెస్ లో అంజయ్య క్యాబినెట్లోనూ, ఆ తరువాత కూడా ఎంతో మంది మంత్రులు అయ్యారు. వారెవరూ ఆ తరువాత ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగిన చరిత్ర కూడా లేదు. మరి చంద్రబాబుకు మాత్రం రెడీ మేడ్ గా మామగారి పార్టీ ఉంది. దాంతో కాంగ్రెస్ లో అలా ఓడిపోగానే ఇలా ఫిరాయించి టీడీపీలో మూల పురుషుడు అయిపోయారు. ఆ తరువాత అదే అన్న గారి పార్టీకి అధినాయకుడు కూడా అయిపోయారు. మూడు సార్లు ముఖ్యమంత్రిత్వంతో పాటు సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా టీడీపీతోనే చంద్రబాబుకు సాధ్యమైందన్నది అందరికీ తెలిసిందే.

నందమూరికి అందలమేదీ..?

ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్నే ఆ పార్టీ నుంచి బయటకు పంపేశాక నందమూరి వారసులకు చోటెక్కడ ఉంది. అన్న గారి కుటుంబం నుంచి వచ్చిన వారికి పదవులు దక్కడమే దుర్లభం అయిపోయింది అక్కడ. ఎన్టీఆర్ కుటుంబం నుంచి మొదట హరిక్రిష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఆరు నెలల మంత్రిగా, అయిదేళ్ళ పాటు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. పొలిటి బ్యూరో సభ్యునిగా కూడా ఉంచారు కానీ ఏనాడూ ఆయనకు టీడీపీలో రాజకీయంగా పెద్ద గుర్తింపు రాలేదు. ఆయన ఒక ఫోర్స్ గా ఎవరూ గుర్తించలేదు. ఆ బాధతోనే ఆయన తనువు చాలించారు.

కాబోయే సీఎం అంటూ…

ఇక మరో కుమారుడు సినీ నటుడు బాలకృష్ణను ఒకపుడు కాబోయే సీఎం అనేవారు. ఆ తరువాత ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా టీడీపీ అధికారంలో ఉండగా కనీసం మంత్రిగా కూడా కాలేకపోయారు. ఇక పొలిట్ బ్యూరో మెంబర్ కూడా బాలయ్యని తీసుకోలేదు. ఆయన ఒక పార్టీ నాయకుడుగానే చివరికి మిగిలారు. దీనికి ముందు ఎన్టీఆర్ భార్యగా 1994లో అన్నగారితో కలసి టీడీపీని గెలిపించిన లక్ష్మీ పార్వతికి అదే పార్టీ బహిష్కరించి ఆమె స్థానం అదీ అని చూపించింది.

ఆదరించింది అక్కడే….

ఇక టీడీపీని నమ్మకుండా కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన దగ్గుబాటి పురంధరేశ్వరికి ఆ పార్టీ గౌరవించి కేంద్ర మంత్రిని చేసింది. అలాగే బీజేపీలోకి వస్తే జాతీయ మహిళా మోర్చా బాధ్యతలు అప్పగించింది. లక్ష్మీ పార్వతిని ఆదరించి జగన్ క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ తెలుగు అకాడమీ చైర్మన్ ని చేశారు. ఓ విధంగా అన్న గారి కోరిక తీర్చారు. ఇక వైఎస్సార్, జగన్ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఎమెల్యే టికెట్లు ఇచ్చారు. మరో వైపు టీడీపీ విజయం కోసం తన ప్రాణాలకు లెక్కచేయకుండా కష్టపడిన జూనియర్ ఎన్టీఆర్ ని సైతం ఏమీ కాకుండా పక్కన పెట్టేశారు. ఇపుడు నందమూరి ఫ్యామిలీ కి టీడీపీలో ఏమీ సంబంధం లేదు, వారికి ఓ విధంగా తన సొంత పార్టీ కాదన్న భావన ఉంది. ఎవరెన్ని చెప్పినా కూడా చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కే టీడీపీ పగ్గాలు అప్పగించడం ఖాయం. అంటే. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నారా వారసుడిని మంత్రిని చేసింది జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది. రేపో మాపో వర్కింగ్ ప్రెసిడెంట్ ని కూడా చేయనుంది. అంటే నారా వారి కోసమే అన్న గారు పార్టీ పెట్టారనుకోవాలేమో.

Tags:    

Similar News