బాబు మొండిగా ఉండలేరా? సాధ్యం కాదా?

చంద్రబాబు వాస్తవవాది. ఆయనకు రాజకీయం ముఖ్యం. దానికి తగినట్లుగా పట్టువిడుపులు ఉంటాయి. ఓ విధంగా చంద్రబాబు రాజకీయ డిక్షనరీలో విడుపులకే అర్ధాలు ఉంటాయి. ఆయన పెద్దగా పట్టుదలలూ, [more]

Update: 2020-06-09 08:00 GMT

చంద్రబాబు వాస్తవవాది. ఆయనకు రాజకీయం ముఖ్యం. దానికి తగినట్లుగా పట్టువిడుపులు ఉంటాయి. ఓ విధంగా చంద్రబాబు రాజకీయ డిక్షనరీలో విడుపులకే అర్ధాలు ఉంటాయి. ఆయన పెద్దగా పట్టుదలలూ, పంతాలు పోయే బాపతు కాదు. దాని వల్ల ఒనకూడేది ఏదీ లేదని చంద్రబాబుకు తెలుసు. అయితే రాజకీయం కోసమే చంద్రబాబు అన్నీ చేస్తూంటే మాత్రం ఆయన వ్యక్తిత్వం మీద అదే పెద్ద మచ్చగా మారుతోందని అంటున్నారు. చంద్రబాబు తనను ఎవరు తిట్టినా కూడా మళ్ళీ తన వద్దకు వచ్చి పార్టీలో చేరుతాను అంటే సంతోషంగా సరేనని అంటారు. అదే ఇతర పార్టీల‌ అధినాయకుల విషయంలో ఈ తీరుని చూడలేము, కొంతైనా బెట్టు, పట్టూ ఉంటుంది. అయితే బాబు తనకు తక్షణ అవసరం ముఖ్యమనుకుని తనకు తానుగా తగ్గిపోతున్నారు అని అభిమానులు సైతం అంటారు.

తీసుకోవద్దట….

ఇటీవల జరిగిన మహానాడులో చాలా మంది తమ్ముళ్ళు చంద్రబాబుని ఒక కోరిక కోరారు. ఓ విధంగా అది డిమాండ్ కింద లెక్క. చంద్రబాబు వల్ల కాని పని కూడా అదేనని అంటారు. పార్టీలో అయిదేళ్ళ పాటు అధికారాన్ని, పదవులను అనుభవించి ఇపుడు దుప్పటి ముసుగేసిన నాయకులను చంద్రబాబు చేరదీయవద్దు అని మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్పతో పాటు, అయ్యన్నపాత్రుడు వంటి వారు గట్టిగా చెప్పారు. పార్టీని కష్టకాలంలో విడిచిపోయిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి తీసుకోవద్దు అని కూడా చాలా మంది బాబుకు చెబుతున్నారు.

ఉండలేరా…?

ఇక టీడీపీకి చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకరెడ్డి లాంటి వాతు అధినేత చంద్రబాబు మీదనే తరచూ సెటైర్లు వేస్తున్నారు. మా బాబుకు మొండిగా ఉండమంటే ఉండలేరు. అదే జగన్ ని జగమొండిగా ఉండకూడదు అంటే వినిపించుకోడు అంటూ ఇద్దరి నేతల మధ్య బాగానే పోలిక చెప్పారు. నిజమే జేసీ చెప్పినట్లుగా మరీ జగమొండి కాకపోయినా నాయకులు మొండిగా కొన్ని సందర్భాల్లో ఉండాలి. బాబు అలా లేకపోవడం వల్లనే తమ్ముళ్ళకు కూడా చులకన అయిపోయారు. మా చంద్రబాబే కదా మళ్ళీ మమ్మల్ని మళ్ళీ తీసుకుంటాడు అనుకుంటూ నాయకులు పార్టీ కాడెని కష్టాల్లో వదిలేసి అధికార పక్షం వైపు జంప్ చేస్తున్నారు.

వారికే పదవులు….

ఈ విధంగా 2004, 2009లలో టీడీపీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నపుడు తమ్ముళ్ళు ఇలా పార్టీకి చెప్పరాని కీడు చేసినా కూడా చంద్రబాబు 2014 ఎన్నికల సమయానికి వారినే పిలిచి కండువాలు కప్పారు, అధికార పదవులూ వారికే ఇచ్చారు. ఇపుడు వారే మళ్ళీ గడప దాటి పార్టీ పడవ తగలేస్తున్నారు. మరి చంద్రబాబు ఇకనైనా ఇలాంటివి ఉపేక్షించకుండా కాస్తా మొండిగా ఉంటే పార్టీ నేతలకు భయం ఉంటుంది. జనంలోనూ చంద్రబాబు రాజకీయ వ్యక్తిత్వానికి మరింతగా విలువ పెరుగుతుంది. అయారాం గయరాం కల్చర్ కి కూడా తెర పడుతుంది. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు ఈ వయసులోనైనా ఇలా చేయగలరా. చూడాలి మరి.

Tags:    

Similar News