బలహీనత తెలుసుకున్నారా?

చంద్రబాబు రాజకీయ గండర గండడు అని పేరు సంపాదించుకున్నారు. ఆయన కింద పడ్డా తనదే పై చేయిగా చూపించుకునే రకం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తనదైన రాజకీయం [more]

Update: 2019-08-20 06:30 GMT

చంద్రబాబు రాజకీయ గండర గండడు అని పేరు సంపాదించుకున్నారు. ఆయన కింద పడ్డా తనదే పై చేయిగా చూపించుకునే రకం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తనదైన రాజకీయం చేస్తూ ముందుకు సాగిపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం చూసుకుంటే ఆయన ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. అన్నిటికీ మించి చంద్రబాబులో ఓ గొప్ప గుణం ఉంది. ఆయనకు తనలోని బలం, బలహీనత రెండూ తెలుసు. అంతే కాదు, తన ప్రత్యర్ధి బలం, బలహీనత ఇంకా బాగా తెలుసు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, మరో ముమ్మారు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించి సరికొత్త రికార్డ్ స్రుష్టించారు. ఇపుడు చంద్రబాబు రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారని చెప్పాలి. ఓ విధంగా జగన్ గెలవడంతో ఏపీ రాజకీయలో కొత్త తరం వచ్చేసినట్లే అయింది.

మేనల్లుడు గుర్తుకొచ్చాడు….

చంద్రబాబుకు అవసరం ఉంటేనే దేముడు కూడా గుర్తుకువస్తారని గిట్టని వారు అంటారు. ఇక రాగద్వేషాలకు అతీతంగా రాజకీయమే ముఖ్యమనుకుని పార్టీని ఇన్నాళ్ళు నడిపిన చంద్రబాబుకు ఇప్పటికి కూడా మెదడు నిండా ఎన్నో వ్యూహాలు ఉన్నాయి. కానీ వయసు మాత్రం పడమర వైపు పోతోంది. దాంతో కుమారుడు లోకేష్ తన రాజకీయ వారసుడు అని గట్టిగా బయటకు చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో నందమూరి కుటుంబం నుంచి ఎవరిని అయినా సాయం అడిగితే అది తన కుమారుడి భవిష్యత్తుకే ఎసరు పెడుతుందన్న భయం కూడా చంద్రబాబులో ఉంది. ఇలా ఎన్ని డౌట్లు ఉన్నా కాగల కార్యం చూసుకునే తత్వం బాబుది. అందుకోసం ఎన్ని అయినా హామీలు ఇస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. ఈసారి టీడీపీ ఓటమి పాలు అయింది అలా ఇలా కాదు. కేవలం 23 సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో టీడీపీ పని అయిపోయిందని అంతా అంటున్న వేళ చంద్రబాబు చూపు ఇపుడు తన మేనల్లుడి మీద ఉంది. హరికృష్ణ మూడవ కొడుకు, సినిమాల్లో టాప్ రేంజిలో ఉన్న జూనియర్ ఎన్టీయార్ మీద బాబు ఆశలు ఉన్నాయని అంటున్నారు. అయితే తగిన సమయం సందర్భం చూసుకుని మరీ చంద్రబాబు ఏ కలయికకైనా విశేషం తీసుకువస్తారు. ఇపుడు అలాగే జరిగింది.

జూనియర్ తో ఏకాంత భేటి….

నందమూరి హరిక్రిష్ణ ప్రధమ వర్ధంతి జరిగిన వేళ ఆయన ఇంటికి వెళ్ళిన చంద్రబాబు పనిలో పనిగా అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీయార్ ని కలిసారు. ఆ సమయంలో జూనియర్ తో బాబు కొంత సేపు ఏకాంతంగా మాట్లాడారని మీడియాలో తెగ ప్రచారమైంది. చంద్రబాబు ఏమి మాట్లాడిఉంటారో ఎవరికీ తెలియకపోయినా ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. అయితే రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారికి చంద్రబాబు. జూనియర్ల భేటీ ఎందుకోసమో వూహించలేనివారు కాదు. ఏపీలో పతనమైన టీడీపీని ఆదుకోవాలని జూనియర్ ను బాబు కోరినట్లుగా కూడా చెబుతున్నారు. పనిలో పనిగా తెలంగాణాలో టీడీపీకి రిపేర్లు చేయమని కోరి ఉంటారని అంటున్నారు. ఆ విధంగా చేస్తే తెలంగాణాకు జూనియర్ ఎన్టీయార్, ఏపీకి లోకేష్ సారధులుగా ఉంటారన్నది చంద్రబాబు మార్క్ ఆలోచన కావచ్చు. మరి రాజకీయాల్లో మరీ అంత అవగాహన లేని వ్యక్తి జూనియర్ కారు కదా. అందుకే చంద్రబాబు ఎటువంటి ప్రతిపాదన పెట్టినా సరే జూనియర్ సైకిల్ పార్టీ వైపుగా రాడన్న వాదన కూడా బలంగా ఉంది. జూనియర్ కి అన్ని విధాలుగా సలహాదారుడైన కొడాలి నాని వైసీపీ మంత్రిగా ఉన్నారు. మామ నార్నె శ్రీనివాసరావు అదే వైసీఎపీలో కొనసాగుతున్నారు. ఇంకో వైపు జగన్ తో కూడా జూనియర్ కి మంచి రిలేషన్లు ఉన్నాయని అంటారు. అలాగే టీఆర్ఎస్ లో కేటీయార్ తోనూ జూనియర్ కి బాగానే సంబంధాలు ఉన్నాయి. సినిమాల్లో కూడా అయనకు తిరుగులేదు, ఇవన్నీ వదిలేసి చంద్రబాబుని నమ్మి టీడీపీ రిపేరుకు జూనియర్ వస్తాడా.

Tags:    

Similar News