కుప్పంను కాపాడుకోగలుగుతారా? వైసీపీ వ్యూహాత్మక దూకుడు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మీకు ఇష్టమైన నియోజ‌క‌వ‌ర్గం ఏద‌ని అంటే .. త‌డుముకోకుండా చెప్పేది కుప్పం నియోజ‌క‌వ‌ర్గం. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో [more]

Update: 2020-03-16 15:30 GMT

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మీకు ఇష్టమైన నియోజ‌క‌వ‌ర్గం ఏద‌ని అంటే .. త‌డుముకోకుండా చెప్పేది కుప్పం నియోజ‌క‌వ‌ర్గం. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల క‌న్నా కూడా కుప్పంపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేశారు. దీనికి ప్రధాన కార‌ణం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట కావ‌డ‌మే. రాష్ట్రంలో టీడీపీని ఓడించినా కూడా జ‌గ‌న్‌కు పెద్దగా సంతృప్తిగా లేదు. చంద్రబాబును ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఓడించాల‌నేది జ‌గ‌న్ వ్యూహం.. ల‌క్ష్యం కూడా.

మెజారిటీ తగ్గించి….

ఈ నేప‌థ్యంలోనే గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్రబాబును ఓడించేందుకు శాయ‌శ‌క్తులా ప్రయ‌త్నించారు. అయితే, అప్పటికి ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో వైసీపి అంచ‌నాలు ఫ‌లించ‌లేదు. అయితే, చంద్రబాబుకు ప్రతి సారీ వ‌స్తున్న మెజారిటీని మాత్రం భారీ ఎత్తున త‌గ్గించ‌గ‌లిగారు. పెద్ద షాక్ ఏంటంటే తొలి రెండు, మూడు రౌండ్లలో సైతం చంద్రబాబు వెన‌క‌ప‌డిపోయారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు వ‌చ్చే 45-50 వేల మెజార్టీ కాస్త త‌గ్గి 30 వేల‌తో స‌రిపెట్టుకున్నారు. అదే టైంలో పులివెందుల‌లో జ‌గ‌న్ మెజార్టీ ఏకంగా 90 వేలు దాటేసింది.

ప్రతిష్టాత్మకంగా తీసుకుని….

ఇక గ‌త ఎన్నిక‌ల్లో కుప్పంలో చంద్రబాబు మెజార్టీని త‌గ్గించిన‌ప్పటి నుంచి వైసీపీ కుప్పంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. అక్కడ‌ వైసీపీ నేత‌లు నిద్ర పోవ‌డం లేదు. ఎట్టి ప‌రిస్థితిలోనూ చంద్రబాబును త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో అవ‌మాన ప‌ర‌చాల‌నే ధోర‌ణితోనే ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు మ‌రో ఛాన్స్ వ‌చ్చింది. ప్రస్తుతం వైసీపీ అధికా రంలోనే ఉండడం, ఈ నెల‌లో స్థానిక ఎన్నిక‌లు నిర్వహిస్తుండ‌డంతో ఇప్పుడైనా కుప్పంలో పాగా వేయాలనే ధోర‌ణితో వైసీపీ ముందుకు సాగుతోంది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లోనూ వైసీపీ జెండా ఎగ‌రేసేలా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది ఇక్కడ పార్టీని గెలుపు గుర్రంఎ క్కించే బాధ్యత‌ను సీఎం జ‌గ‌న్ ఏకంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు అప్ప గించారు. అదే స‌మ‌యంలో జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి కూడా ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

కొత్త వ్యూహంతో…..

కుప్పం న‌గ‌ర పంచాయ‌తీతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు జెడ్పీటీసీలు, ఎంపీపీల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవాల‌ని చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నిక‌ల‌కు ముందు ఇక్కడ స‌మావేశం నిర్వహించిన పెద్దిరెడ్డి పార్టీ కోణాన్ని, వ్యూహాన్ని కూడా ఆవిష్కరించారు. 1989 నుంచి ఇక్కడ చంద్రబాబును గెలిపిస్తున్నారు. ఈ ఒక్కసారి ఓడించండి అని వైసీపీ కార్యక‌ర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇక్కడ పార్టీ పాగావేయాల‌ని, టీడీపీ దూకుడుకు చెక్ పెట్టాల‌ని దిశానిర్దేశం చేశారు. దీంతో కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఎదురీత ధోర‌ణిలో ముందుకు సాగుతున్న ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసే నేత‌ల‌కు పోటీ చేసేందుకు కేసుల భ‌యం వెంటాడుతోంది. దీంతో ఎవ‌రూ కూడా ముందుకు రాని ప‌రిస్థితి ఏర్పడింది. మ‌రి దీనిని చంద్రబాబు ఎలా చూస్తారో.. పార్టీలో జ‌వ‌స‌త్వాలు ఎలా నింపుతారో ? చూడాలి.

Tags:    

Similar News