చాదస్తం ఎక్కువయినట్లుందే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో అధికార, విపక్షాలు రెండు బ్లేమ్ గేమ్ తోనే సమయం సరిపెడుతున్నాయి. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఇస్తానన్న రుణం వెనక్కి పోవడానికి నువ్వంటే [more]

Update: 2019-07-23 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో అధికార, విపక్షాలు రెండు బ్లేమ్ గేమ్ తోనే సమయం సరిపెడుతున్నాయి. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఇస్తానన్న రుణం వెనక్కి పోవడానికి నువ్వంటే నువ్వంటూ దుమ్మెత్తి పోసుకోవడం తప్ప మరేమి లేకుండా పోయింది. ఈ చర్చల వల్ల ప్రజలకు ఒరిగేందేమి లేదన్న సత్యం ఇరు పక్షాలకు తెలిసినా చర్చను సాగదీస్తూ తమ గొప్పలు చెప్పుకుంటూ నడుస్తున్న అసెంబ్లీ పై అంతా పెదవి విరుస్తున్నారు. అంతగా అనుభవం లేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అపార అనుభవం వున్న చంద్రబాబు కు పెద్దగా తేడా ఏమీ కానరావడం లేదు. చంద్రబాబు మరీ దారుణంగా ఇంకా పాత స్టయిల్ లోనే పోతున్నారు.

రింగ్ రోడ్డు, నేనే విమానాశ్రయం …

నలభై ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి మంత్రం తాను చేసిందే అని ఆత్మస్తుతి పదేపదే అసెంబ్లీలో వినిపిస్తున్నారు. రింగ్ రోడ్డు నా ప్లాన్, అంతర్జాతీయ విమానాశ్రయం నా స్కెచ్ అంటూ చంద్రబాబు పాత పాటే వినిపిస్తూ బోరు కొట్టిస్తున్నారు. భాగ్యనగరంపై తన మమకారాన్ని చంద్రబాబు ఇంకా విడిచిపెట్టక పోవడంతో బాటు అధికారంలో వున్నప్పుడు అటు అధికారులకు, ప్రజలకు పదేపదే చెప్పిన క్యాసెట్ చెప్పడం తో అధికార పార్టీ సభ్యుల్లో నవ్వులు వెల్లివిరుస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ పడిపడి మరీ నవ్వుతున్నా విపక్ష నేత చంద్రబాబు తన ధోరణి మాత్రం ఎక్కడా వీడటం లేదు. అమరావతి పై చర్చ వదిలేస్తూ గతం గొప్పలు గుర్తు చేస్తూ చంద్రబాబు సాగుతున్నారు.

బాబు చాదస్తానికి….

చెప్పిందే చెప్పడంలో చంద్రబాబు రికార్డ్ ఎవ్వరు అధిగమించారేమో. అందులో ముఖ్యంగా హైదరాబాద్ ఖ్యాతి తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు పడే తపన అంతా ఇంతా కాదు. ఇదే ధోరణి తో తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసి గట్టి దెబ్బలే తిన్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. దీనికి వయసు పైబడి వయోభారం తోడు కావడం వల్లే చంద్రబాబు తన ధోరణి మార్చుకోవడం లేదని వైసిపి ఎద్దేవా నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు విపక్షంలో వుంటూ సర్కార్ కి దశా దిశా నిర్దేశం చేయాలి. ఒక దార్శనికుడిగా రాష్ట్రాభివృద్ధికి విలువైన, సలహాలు ఇవ్వాలి. కానీ చంద్రబాబు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు వస్తున్నట్లు రాజకీయ కోణంలోనే అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు పై సొంత పార్టీ వర్గాలే సంతృప్తిగా లేవన్న టాక్ నడుస్తుంది. ఆయన కన్నా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్ వంటి వారి ప్రసంగాలకు అధికారపక్షం ఇబ్బంది పడుతుంది. మరో పక్క అసెంబ్లీ చర్చలను చూసే వారికి వీరి ప్రసంగాలు ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News