హండ్రెడ్ డేస్ లో ఫెయిల్యూరేనా…?

వైసీపీ అధికారంలోకి వ‌చ్చి 100 రోజులు పూర్తయిన నేప‌థ్యంలో ప్రభుత్వ తీరు తెన్నుల‌పై అనేక విశ్లేష‌ణలు, క‌థ‌నాలు వ‌చ్చాయి. అనేక మంది నాయ‌కులు కామెంట్లు కూడా చేశారు. [more]

Update: 2019-09-05 00:30 GMT

వైసీపీ అధికారంలోకి వ‌చ్చి 100 రోజులు పూర్తయిన నేప‌థ్యంలో ప్రభుత్వ తీరు తెన్నుల‌పై అనేక విశ్లేష‌ణలు, క‌థ‌నాలు వ‌చ్చాయి. అనేక మంది నాయ‌కులు కామెంట్లు కూడా చేశారు. అయితే, ఇదే స‌మ‌యంలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీకి కూడా ప్రతిప‌క్ష హోదా ద‌క్కించుకుని 100 రోజులు పూర్తవుతోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో ప్రజా స‌మ‌స్యల‌పై ఈ పార్టీ ఏమేర‌కు స‌క్సెస్ అయింది. ప్రజా గ‌ళాన్ని వినిపించ‌డంలో ఏ మేర‌కు ముందుకు వెళ్లింది? అనే ప్రధాన ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. నిజానికి వంద రోజులు అనేవి.. ఏ పార్టీకీ పెద్దగా కొల‌మానం కాదు. కానీ, ప్రస్తుతం చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయ‌ మేధావి, అనుభ‌వశాలి అయిన చంద్రబాబు ప్రతిప‌క్ష నేత‌గా ఉండ‌డంతో ఆయ‌న ఏమేర‌కు జ‌గ‌న్ ప్రభుత్వంపై దూకుడు ప్రద‌ర్శిస్తున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.

ఘోరంగా ఓడిన తర్వాత….

2004, 2009 త‌ర్వాత మ‌రోసారి 2019 ఎన్నిక‌ల్లో చంద్రబాబు హ‌యాంలోని టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. క‌నీసం 50 స్థానాల్లో అయినా ప‌ట్టు నిలుస్తుంద‌ని అని భావించిన‌ప్పటికీ.. టీడీపీ ఆ రేంజ్‌లో ముందుకు దూక లేక పోయింది. దీంతో కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీకి మిగిలారు. ఇక‌, జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రెండు సార్లు స‌భ జ‌రిగింది. తొలిసారి.. గ‌వ‌ర్నర్‌కు ధ‌న్యవాదాలు చెప్పే కార్యక్రమం, రెండో సారి బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిగాయి. ఈ రెండు సార్లు కూడా ప్రభుత్వమే పైచేయి సాధించింది. అంతేకాదు, బ‌డ్జెట్ స‌మావేశాల్లో టీడీపీ నాయ‌కుల స‌స్పెన్షన్ కూడా తెర‌మీదికి వ‌చ్చింది.

ఇంటిని ముంచారంటూ…..

ఇక‌, 19 బిల్లుల‌ను కూడా జ‌గ‌న్ ప్రభుత్వం ఆమోదించింది.ఈ క్రమంలోనే ప‌లు ప‌థ‌కాల విష‌యంలో చంద్రబాబును వైసీపీ నాయ‌కులు ఇరుకున పెట్టారు. ఈ క్రమంలో ప‌లు ప‌థ‌కాల విష‌యంలో ముఖ్యంగా దోమ‌ల‌పై దండ‌యాత్ర, ఎలుక‌ల కోసం కోట్లు ఖ‌ర్చు పెట్టడం వంటివాటిని స‌మ‌ర్ధించుకోవడంలో చంద్రబాబు విఫ‌ల‌మ‌య్యారు. ఇక‌, త‌ర్వాత కూడా ఆయ‌న పెద్దగా ప్రజ‌ల స‌మ‌స్యల‌పై పోరాటం చేయ‌లేక పోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్యటించినా.. త‌న ఇంటి గురించే ఎక్కువ‌గా చెప్పుకొచ్చారు. త‌న ఇంటిని ముంచేయ‌డం కోసం జ‌గ‌న్ ప్రజ‌ల‌ను ముంచారంటూ.. ఆయ‌న కొత్త వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు.

ఇప్పుడే ఇలా ఉంటే…?

ఇది ప్రజ‌ల్లోకి అంత‌గా వెళ్లలేదు. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి విష‌యంపై చ‌ర్చ నేటికీ సాగుతోంది. అక్క డ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి మేలు చేయ‌డం కోస‌మే చంద్రబాబు రాజ‌ధాని ఏర్పాటు చేస్తున్నార‌న్న బొత్స వ్యాఖ్యల‌ను దీటుగా ఢీ కొట్టలేక పోయారు. రాజ‌ధానిని త‌ర‌లించ‌డాన్ని అడ్డుకుంటామ‌ని చెబుతున్నా.. క‌మ్మవారికి ప్రయోజ‌నాలు చేకూర్చలేద‌ని చెప్పడంలో మాత్రం చంద్రబాబు విఫ‌ల‌మ‌య్యారు. ఇక‌, పార్టీలోనూ ఓట‌మి నుంచి నేటికీ బ‌య‌ట‌ప‌డ‌ని వారు చాలా మంది ఉన్నారు. కాపు సామాజిక వ‌ర్గం చంద్రబాబుకు దూర‌మై పోయింది. ఇప్పుడు రెడ్డి వ‌ర్గం కూడా చంద్రబాబును ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక బీజేపీలోకి న‌లుగురు ఎంపీలు జంప్ చేయ‌డం.. ఓడిన నేత‌లు వైసీపీ బాట ప‌ట్టడం.. మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు కూడా అదే దారిలో ఉండ‌డంతో ఈ వందరోజుల్లోనే బాబు ప‌రిస్థితి ఇలా ఉంటే.. మ‌రో ఐదేళ్లపాటు ఆయ‌న ఎలా ? నెట్టుకొస్తార‌న్న సందేహాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News