జస్ట్.. స్మాల్ బ్రేక్

కరకట్టపై ఆక్రమణలను తొలగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. కృష్ణానది కరకట్ట మీద ఉన్నవన్నీ అక్రమ నిర్మాణాలేనంటూ తేల్చి పారేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత [more]

Update: 2019-10-06 00:30 GMT

కరకట్టపై ఆక్రమణలను తొలగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. కృష్ణానది కరకట్ట మీద ఉన్నవన్నీ అక్రమ నిర్మాణాలేనంటూ తేల్చి పారేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నివాసవముంటున్న భవనాన్ని కూడా కూల్చివేయక తప్పదని, వారం రోజుల్లోగా చంద్రబాబు ఆ నివాసాన్ని ఖాళీ చేయాల్సిందేనని సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. వారం కాదు పదిరోజులు గడచి పోతున్నా కరకట్ట మీద ఆక్రమణలను తొలగించే ప్రక్రియకు పూనుకోక పోవడం వెనక కారణాలేంటన్న చర్చ జరుగుతోంది.

కరకట్ట ఆక్రమణలపై….

నిజానికి కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న భవనానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో గత చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను తొలుత ప్రభుత్వం కూల్చి వేసింది. దీనిపై తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానదికి వరదలు రావడంతో కరకట్టపై ఉన్న భవనాల వద్దకు వరద నీరు చేరుకోవడంతో ప్రభుత్వానికి తాము చెప్పిన కారణం నిజమని చెప్పుకోవడానికి సులువయింది.

నోటీసులిచ్చి….

అయితే వారంరోజుల్లో కూల్చి వేస్తామని చెప్పిన జగన్ సర్కార్ కొంత వెనకడుగు వేసినట్లు కన్పిస్తోంది. చంద్రబాబు నివాసానికి నోటీసులు అంటించి వెళ్లి పదిహేను రోజులు గడుస్తున్నా కూల్చివేత ప్రక్రియను మొదలు పెట్టకపోవడం వెనక చంద్రబాబుకు సానుభూతి వస్తుందన్న కారణమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒక్క చంద్రబాబు నివాసాన్ని మాత్రమే కాదు అక్కడ మిగిలిన నిర్మాణాలను కూల్చివేయాల్సి ఉంటుంది. అక్కడ బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వత్తిడి రావడంతోనే జగన్ సర్కార్ కూల్చివేతలపై వెనక్కు తగ్గినట్లు ఏపీలో చర్చ జరుగుతోంది.

దసరా తర్వాత….

దీంతో పాటుగా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హడావిడి చేశారు. ఆయన గతంలోనే దీనిపై కోర్టను ఆశ్రయించారు. ఖచ్చితంగా కూల్చివేస్తామని ఆళ్ల హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కూల్చివేతల విషయాన్ని ఈ మధ్య కాలంలో దాట వేస్తున్నారు. అయితే దసరా పండగ ఉండటంతో కూల్చివేతల విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందన్న వాదన కూడా ఉంది. దసరా పండగ తర్వాత తిరిగి కరకట్టపై కూల్చివేతల కార్యక్రమం ప్రారంభమవుతుందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మొత్తం మీద కరకట్ట కూల్చేవేతలపై ప్రస్తుతానికి బ్రేక్ పడింది.

Tags:    

Similar News