బాబు కొంప కూల్చేస్తారా …?

నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ కృష్ణా కరకట్టపై సాగిన ఆక్రమ నిర్మాణాలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కొంప కూల్చే పరిస్థితికి దారి తీసింది. అధికారం వుంది [more]

Update: 2019-07-17 14:30 GMT

నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ కృష్ణా కరకట్టపై సాగిన ఆక్రమ నిర్మాణాలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కొంప కూల్చే పరిస్థితికి దారి తీసింది. అధికారం వుంది చేతిలో అని విచ్చలవిడిగా చట్ట విరుద్ధంగా కళ్ళముందే అక్రమాలు జరుగుతున్నా వ్యక్తిగత లబ్ది కోసం చూస్తూ ఊరుకోవడం తనకే ఎసరు పెడుతుందని చంద్రబాబు ఊహించలేదు. అసలు అధికారం తన చేతినుంచి దూరం అవుతుందని భావించకపోవడంతో వైసిపి దెబ్బకొడుతుందని అస్సలు అనుకోలేదు. కానీ సీన్ సితార అయిపొయింది. పార్టీ ఘోర పరాజయం తరువాత వరుసగా చంద్రబాబు లక్ష్యంగా అధికార వైసిపి అక్రమాలను తవ్వి తీసి ప్రజల్లో ఎండగడుతుంది.

దారి కన్పించడం లేదే…

దీన్ని సమర్ధించుకోవడం మాట ఎటున్నా కనీసం కాపాడుకోవడానికి తెలుగుదేశం అధినేత పడుతున్న తిప్పలు అన్ని ఇన్ని కావు. న్యాయస్థానాల ద్వారా కొంతకాలం జాప్యం చేసే వీలు తప్ప మరే దారి ఆయనకు ప్రస్తుతం కానరావడం లేదు. లింగమనేని కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలు సక్రమమే అని చెప్పుకోలేరు. అన్ని అనుమతులు ఉన్నాయని అడ్డగోలు వాదన తప్ప టిడిపి అధినేత తప్పించుకునే మార్గాలు అన్ని మూసుకుపోతున్నాయి. దాంతో పార్టీకోసం నిర్మించిన కార్యాలయమే మాజీ సిఎం నివాసం అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రేపో మాపో ఇల్లు కూల్చేస్తాం….

శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని అతిధి గృహం కూల్చివేత తధ్యమన్నది స్పష్టం చేసేసారు. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు కూల్చేస్తామని ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేనే లేవన్నారు. చట్టాలు చేసేవారే వాటికి తూట్లు పొడిస్తే ప్రజలకు ఇచ్చే సందేశం ఏముంటుందని ఆయన టిడిపి అధినేత తప్పును ఎత్తి చూపారు. అన్ని అనుమతులు పొందామని చెబుతున్నారు కానీ చంద్రబాబు ఉంటున్న కట్టడానికి సీఆర్డీఏ అనుమతులు ఏ ఒక్కటి లేవన్నారు. ఈ అక్రమం జరుగుతున్నా చూస్తూ వూరుకున్నందుకు నాడు వున్న సంబంధిత అధికారుల నుంచి 8 కోట్లరూపాయలు వసూలు చేస్తామని హెచ్చరించారు బొత్స.

ప్రజావేదిక కూల్చి ప్రాధమిక హెచ్చరిక ….

చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గృహం నిబంధనలు లేకుండా నిర్మితమైందన్నది ప్రభుత్వం గుర్తించింది. సర్కార్ ఏర్పడిన వెంటనే ఆయన్ను మెడపట్టుకు బయటకు పంపిస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందన్న దృష్టితో వ్యూహాత్మకంగా జగన్ చర్యలు మొదలు పెట్టారు. ముందుగా ప్రజావేదికను నేలమట్టం చేసి ప్రమాద ఘంటికలు జారీ చేశారు. ఇది అర్ధం చేసుకున్న చంద్రబాబు తన వద్దకు రైతులను, వివిధ వర్గాలను రప్పించుకుని వారు తమ నివాసంలో వుండాలని కోరుతున్నట్లు స్కిట్స్ మొదలు పెట్టి వైసిపి దూకుడుకు బ్రేక్ వేశారు. అయితే బాబు ఇల్లు టార్గెట్ నుంచి వైసిపి సర్కార్ వైదొలగలేదని ఇప్పుడు మరోసారి చట్టసభ వేదికగా తేటతెల్లం అయ్యిపోయింది. సమయం చూసుకుని సర్కార్ విపక్ష నేతను ఆ ఇంటి నుంచి పంపేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని తేలిపోయింది. మరి చంద్రబాబు కొత్త ఇల్లు వెతుక్కుంటారా ? లేక సానుభూతి కోసం ఆ ఇంటి దగ్గరే ఘర్షణకు దిగుతారా లేక మరో కొత్త వ్యూహం రచించి వైసిపి సర్కార్ ను అడ్డుకుంటారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News