ఆశ్చర్యంగా ఉందా..??

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఆసక్తికరంగా ఉంది. ఎన్నికల వేళ క్యాడర్ కు ధైర్యం నింపాల్సిన నాయకుడి స్థానంలో ఉన్న చంద్రబాబు భయంగా కనిపిస్తున్నారు. [more]

Update: 2019-04-11 02:30 GMT

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఆసక్తికరంగా ఉంది. ఎన్నికల వేళ క్యాడర్ కు ధైర్యం నింపాల్సిన నాయకుడి స్థానంలో ఉన్న చంద్రబాబు భయంగా కనిపిస్తున్నారు. ప్రతీ చర్యనూ తనపై కుట్రగా భావించి ఉలిక్కిపడుతున్నట్లు కనిపిస్తోంది. అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసినా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నిస్తున్నారు. బదిలీ చేసిన ఒక అధికారి స్థానంలో ఎలాగూ కొత్త అధికారిని నియమిస్తారు. అధికారి ఎవరైతేనేమి విధులు సక్రమంగా నిర్వహిస్తే చాలు కదా. కానీ, చంద్రబాబు మాత్రం అధికారులను బదిలీ చేయవద్దనేలా మాట్లాడుతున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతున్నారు. ఏకంగా కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందనగా ఆయన ధర్నాకు దిగడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ స్థైర్యం కోల్పోయే అవకాశం ఉంది.

చివరి నిమిషంలో ధర్నా ద్వారా సాధించేందేంటి..?

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వరుసగా దీక్షలు చేస్తున్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపిస్తూ నవ నిర్మాణ దీక్షలు చేశారు. అన్ని జిల్లాల్లో దీక్షలకు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. తర్వాత బీజేపీకి గుడ్ బై చెప్పాక ధర్మ పోరాట దీక్షలు అన్ని జిల్లాల్లో నిర్వహించారు. దీనికి కూడా పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి భారీగానే ఖర్చు పెట్టారు. చివరకు మరికొన్ని గంటల్లో ఎన్నికలు అనగా కూడా ఆయన ఎన్నికల సంఘం వైఖరికి నిరసనగా అంటూ ధర్నాకు దిగారు. అయితే, ఇప్పటివరకు ఏమి చేసినా ఎన్నికల ముందు రోజు ఆయన ధర్నా చేయడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందనే భావన ఉంటే ఇంతకుముందే ఇంటెలిజెన్స్ డీజీ, సీఎస్, ఎస్పీలను బదిలీ చేసినప్పుడే ఆయన ధర్నాలు చేసి ఉండాల్సింది. అప్పుడు ఆయన ధర్నాకు ఏమైనా ఫలితం కానీ, ఎన్నికల సంఘం నుంచి వివరణ కానీ వచ్చేది. కానీ, ఎన్నికలకు ఒకరోజు ముందు ధర్నా చేయడం ద్వారా ఆయన సాధించేది ఏమీ లేదంటున్నారు. కేవలం ప్రజల్లో సానుభూతి దక్కి ఓట్లు రావాలనేదే ఆయన ప్రయత్నం అనే ఆరోపణలూ వస్తున్నాయి. గతంలో 2009లో చంద్రబాబు ఫిర్యాదు మేకు ఏకంగా డీజీపీనే బదిలీ చేసింది ఎన్నికల సంఘం. ఈ విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారని అంటున్నారు.

ఐటీ దాడులు చేస్తే భయమెందుకు..?

ఆదాయ పన్ను శాఖ దాడుల విషయంలోనూ చంద్రబాబు ఇటువంటి వైఖరితోనే ఉన్నారు. తమ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారు, వైసీపీ వాళ్లపై చేయడం లేదని అంటున్నారు. వైసీపీ వాళ్లపై ఐటీ దాడులు చేయడం లేదనే ఆయన ఆరోపణ సరైందే అయ్యి ఉండవచ్చు. కానీ, టీడీపీ వాళ్లపై ఐటీ దాడులు చేయడాన్ని ఎలా తప్పు పడతారనే ప్రశ్నలు వస్తున్నాయి. తప్పు చేయకపోతే ఐటీ దాడులకు భయపడాల్సిన పనేంటని అంటున్నారు. ఒకవేళ ఐటీ శాఖ సోదాలు జరిపినా ఎటువంటి తప్పు జరగకపోతే, వారికి ఏమీ లభించకపోతే వారే సారీ చెప్పి మరీ వెళ్లిపోతారు. అయితే, తమపై కుట్ర చేసి ఐటీ దాడులు జరుపుతున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపించడం ద్వారా ఇక్కడ కూడా ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం ఉందనే వాదన వినిపిస్తోంది. ఎన్నికల ముందు ఇటువంటి చర్యల ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. గతంలో చంద్రబాబు అనుకూల మీడియా బలంగా ఉండేది. ఏకపక్షంగా సదరు మీడియా చెప్పిన, రాసిన వార్తలే ప్రజల్లోకి వెళ్లేవి. కానీ, సోషల్ మీడియా రాకతో పరిస్థితి మారింది. నేతలు ఏ మాట మాట్లాడినా, ఏ కార్యక్రమంలో చేసినా దాని వెనుక ఉద్దేశ్యాన్ని, గుట్టును ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా చివరి నిమిషంలో ధర్నా ద్వారా చంద్రబాబు ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం పెద్దగా ఫలించకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News