లగడపాటి లెక్కలే ఆధారమా..?

రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూటే సపరేటు. ఆయన పక్కా ప్రొఫెషనల్ రాజకీయాలు చేస్తారు. అన్నింటికీ ఆయనకంటూ పక్కా లెక్కలుంటాయి. ప్రభుత్వం నిర్ణయాలు, [more]

Update: 2019-02-27 03:30 GMT

రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూటే సపరేటు. ఆయన పక్కా ప్రొఫెషనల్ రాజకీయాలు చేస్తారు. అన్నింటికీ ఆయనకంటూ పక్కా లెక్కలుంటాయి. ప్రభుత్వం నిర్ణయాలు, పార్టీ వ్యవహారాలు, ఇలా అన్నింటా ఆయనకు కచ్చితమైన వ్యూహాలు ఉంటాయి. ఇక, ఎన్నికల సమయంలో ఆయన మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. అభ్యర్థుల ఎంపికపై ఆయన అనేక కసరత్తులు చేస్తారు. ప్రతీ ఒక్క ఆశావహుడి గురించి చంద్రబాబు వద్ద జాతకం ఉంటుంది. ఎవరి పనితీరు ఏంటి, ప్రజలకు అందుబాటులో ఉంటారా, సామాజకవర్గం బలం ఉందా, నియోజకవర్గంలో ఆయన ప్లస్ లు ఏంటి, మైనస్ లు ఏంటి, పార్టీ కార్యక్రమాలు నిర్వహణలో ఆయన పనితీరు ఎలా ఉంది, ఇలా రకరకాల అంశాలపై చంద్రబాబు వద్ద పక్కా నివేదికలు ఉంటాయి. వీటి ఆధారంగానే ఆయన టిక్కెట్లు కేటాయిస్తారు. ఈ మధ్య కొంత మొహమాటానికి పోతున్నారు కానీ గతంలో మరింత కఠినంగా చంద్రబాబు వ్యవహరించేవారు. నెగటీవ్ రిపోర్టులు ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్లు కేటాయించే వారు కాదు.

గతానికి భిన్నంగా చంద్రబాబు

ఇక, చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి రానున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. ఈసారి అధికారాన్ని తప్పనిసరిగా ఆయన కాపాడుకోవాలి. అందుకు ఆయన ఎప్పుడూ లేని విధంగా వ్యవహరిస్తున్నారు. గతానికి భిన్నంగా ఎన్నికల వేళ ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసినా, గుదిబండగా మారుతాయని తెలిసినా ఆయన కొత్త పథకాలు తెస్తున్నారు. ఇక, అభ్యర్థుల ఎంపిక కూడా గతానికి భిన్నంగా ఎన్నికలకు రెండు నెలల ముందే ప్రారంభించారు. గత 15 రోజులుగా ఆయన ప్రతీ రోజూ ఇదే పని మీద కూర్చుంటున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. వివాదాలు, పోటీ తీవ్రంగా ఉన్న స్థానాలు మినహా మిగతా స్థానాల్లో టిక్కెట్లు ఫైనల్ చేసేస్తున్నారు. టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్న అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. రిపోర్టుల ఆధారంగా వారి ప్లస్ లు, మైనస్ లు చెప్పి వారిని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు.

లగడపాటి సర్వేలకు ప్రాధాన్యత…

ఇక, మరోసారి చంద్రబాబు నాయుడు సర్వేలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఆయన ఇంటిలిజెన్స్ తో పాటు పలు ప్రైవేటు సంస్థలతో ఎప్పటికప్పుడు ఆయన సర్వేలు చేయిస్తున్నారు. వీటితో పాటు ఆయన లగడపాటి రాజగోపాల్ సర్వేపైన ఎక్కువ ఆధారపడ్డారని తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబుకు సన్నిహితుడైన ఓ మీడియా సంస్థ అధిపతితో కలిసి లగడపాటి రాజగోపాల్ చంద్రబాబును కలిశారు. ప్రజల్లో పార్టీకి ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలు, ఏ ప్రాంతంలో ఎవరికి మొగ్గు ఉంది, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే గెలుస్తారు, ఏయే వర్గాలు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి, వంటి అనేక అంశాలపై లగడపాటి రాజగోపాల్ ఎప్పటికప్పుడు చంద్రబాబుకు నివేదికలు ఇస్తున్నారట. ఈ నివేదికలకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. అయితే, లగడపాటి రాజగోపాల్ సర్వేలు చాలావరకు నిజమయ్యాయి. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన సర్వే పూర్తిగా తప్పయ్యింది. మరి, సర్వేలకు ప్రసిద్ధి అయిన లగడపాటి తెలుగుదేశం పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారట. ఈసారి లగడపాటి సర్వేలు చంద్రబాబుకు హెల్ప్ అవుతాయో లేదా తెలంగాణలో లాగా రివర్స్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News