ట్యాగ్ లైన్ మార్చేస్తున్నారా…?

చంద్రబాబునాయుడు అంటే ఒక ట్యాగ్ లైన్ టీడీపీ తమ్ముళ్ళు పక్కన ఉంచుతారు. అనుభవం కలిగిన నేత అన్నదే ఆ ట్యాగ్ లైన్. ఇక అపర మేధావి, రాజకీయ [more]

Update: 2019-07-25 11:00 GMT

చంద్రబాబునాయుడు అంటే ఒక ట్యాగ్ లైన్ టీడీపీ తమ్ముళ్ళు పక్కన ఉంచుతారు. అనుభవం కలిగిన నేత అన్నదే ఆ ట్యాగ్ లైన్. ఇక అపర మేధావి, రాజకీయ దురంధరుడు ఇలాంటివి చంద్రబాబు నాయుడు పక్కన విశేషణాలుగా పెట్టి మరీ ఆయన గ్లామర్ ని పెంచేస్తారు. ఓ విధంగా చంద్రబాబు నాయుడు అనుభవం ట్యాగ్ లైన్ మీద 2014 ఎన్నికల్లో సక్సెస్ కొట్టారు. తాను ముఖ్యమంత్రిని అయితేనే తప్ప ఏపీ బాగుపడదని తలచి మరీ జనం పట్టం కట్టారని ఆయనే అయిదేళ్ళ పాటు వూదరగొట్టారు మరి చంద్రబాబు నాయుడు అనుభవం ఏ మాత్రం అక్కరకి వచ్చిందో కానీ జనాలు వద్దంటే వద్దని తాజా ఎన్నికల్లో పక్కన పెట్టేసారు. విశ్వసనీయత, మడమ తిప్పని నేత అన్న ట్యాగ్ లైన్లను తన పేరు పక్కన పెట్టుకుని రాజకీయం చేస్తూ వచ్చిన జగన్ కి జనం బ్రహ్మరధం పట్టారు. ఇపుడు జగన్ ఇలా పాలన మొదలెట్టారో లేదో చంద్రబాబు నాయుడు అలా విమర్శలతో గట్టిగా తగులుకుంటున్నారు.

అనుభవరాహిత్యమట…..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కనీసం వారం కూడా జగన్ కి చంద్రబాబు నాయుడు సమయం ఇవ్వలేదు. పాలన రంగు రుచి ఏంటో కూడా చూడలేదు. అప్పటి నుంచే విమర్శలతో దాడి చేయడం మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు పదే పదే అంటున్న మాట ఒక్కటే, జగన్ కి అనుభవం లేదు. ఆయనకు ఏదీ చేతకాదు. ఇక ఇపుడు చూస్తే గట్టిగా రెండు నెలలు కాలేదు జగన్ సీఎం అయి, అంతలోనే చంద్రబాబు నాయుడు జగన్ గురించి అర్ధం అయిపోయినట్లుగా తనదైన బురదను చల్లేస్తున్నారు. అమరావతి రాజధాని జగన్ కట్టలేడు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదు, ఏపీలో అభివ్రుధ్ధి ఆగిపోయింది. అన్ని వర్గాల జనం ఆందోళనతో ఉన్నారు. ఏపీలో అసలు పాలన లేదు, ఎందుకంటే జగన్ కి ఏమీ అనుభవం లేదు. ఇదీ చంద్రబాబు నాయుడు విమర్శల ప్రవాహం.

లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రయోగం…

ఇపుడు సార్వత్రిక ఎన్నికలూ ఎటూ లేవు, కానీ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఈ విమర్శల దాడిని ఇలా పెంచుకుంటూ పోయి జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడుకు స్థానిక సమరం ఓ లిట్మస్ టెస్ట్ లా ఉపయోగపడుతుందట. అప్పటికి జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి అవుతాయి. జనంలో ఏమైన వ్యతిరేకత వచ్చినా తన మాటలు నమ్మినా కూడా టీడీపీకి అది పెద్ద ప్లస్ అవుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ కంటే ఒక్క సీటు అయినా అదనంగా గెలుచుకున్నా, లేక అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా మంచి ఫలితాలు సాధించినా చంద్రబాబు నాయుడు ఇక అసలు వూరుకోరు. తాను కనిపెట్టిన అనుభవం లేదు అన్న ట్యాగ్ లైన్ ని జగన్ మెళ్ళో తగిలించేస్తారు. అక్కడ నుంచి దూకుడు రాజకీయం మొదలుపెట్టి అసలు ఎన్నికల నాటికి తన అనుభవం, జగన్ చేతగానితనం అంటూ పోల్చుతూ జనంలోకి పోవాలన్నది చంద్రబాబు నాయుడు ఎత్తుగడ. మొత్తానికి ఇప్పటీకైతే చంద్రబాబు నాయుడుకు కొత్త నినాదం దొరికింది. మరి లోకల్ బాడీ ఎన్నికలే చంద్రబాబు నాయుడు నినాదం పదునెంతో చెప్పాలి.

Tags:    

Similar News