ఏ మాత్రం మారలేదే

ఏపీ రాజకీయాల్లో మార్పు లేదు, ఉందీ అనుకుంటే వైసీపీ అధికారంలోకి రావడం, టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళడం. అంతే, ఇక ఏపీ రాజకీయ మైదానంలో ఇప్పటికీ ప్రత్యర్ధులు జగన్, [more]

Update: 2019-09-07 02:00 GMT

ఏపీ రాజకీయాల్లో మార్పు లేదు, ఉందీ అనుకుంటే వైసీపీ అధికారంలోకి రావడం, టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళడం. అంతే, ఇక ఏపీ రాజకీయ మైదానంలో ఇప్పటికీ ప్రత్యర్ధులు జగన్, బాబు ఇద్దరే. మిగిలిన వారు ఎక్స్ట్ ట్రా ప్లేయర్లే. ఏపీలో గత రెండు దశాబ్దాలుగా దాదాపుగా ఇదే కధ నడుస్తోంది. అయిదేళ్ళు నవ్యాంధ్రను ఏలిన చంద్రబాబు తాజా ఎన్నికల్లో ఘోర అవమానంతో కూడిన ఓటమితో విపక్షంలోకి వచ్చారు. జగన్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. మరి బాబు జగన్ తీరులో ఏమైనా కొత్త మార్పులు వచ్చాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఏపీలో జగన్ సర్కార్ కొలువై వంద రోజులు గడిచాయి. ఇంకా కధ చాలానే ఉంది కానీ ఇప్పటికైతే ముఖ్యమంత్రిగా జగన్ కుదురుకున్నారా…ప్రతిపక్ష నేతగా బాబు సర్దుకున్నారా అని విశ్లేషిస్తే లేదనే సమాధానం వస్తుంది.

ఇంకా ప్రతిపక్ష నేతగానే…..

జగన్ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. దాంతో ఆయనకు అదే తీరు అలవాటు అయిపోయింది. మాట్లాడితే చంద్రబాబుని తలచుకోవడం జగన్ కి పరిపాటి మారింది. ముఖ్యమంత్రిగా అధికార కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే జగన్ అక్కడ కూడా గత ప్రభుత్వం ప్రస్తావన తీసుకురాకుండా ప్రసంగం ముగించరు. నిజానికి జనాలు మరచిపోయిన చంద్రబాబుని ఆయన అలా ఎందుకో అతి కీలక‌మైన సమావేశాల్లో గుర్తుకుతేవడం ద్వారా బాబు ఉనికిని కాపాడుతున్నారా అనిపిస్తోంది. జగన్ కి ఇప్పటికీ తాను అధికారంలో ఉన్నాను, ముఖ్యమంత్రిని అన్నది ఇంకా అలవాటు కాలెదేమో అనిపిస్తోంది. ఒక్కోసారి ఆయన ఈ ప్రభుత్వం అంటూ ప్రసంగం చేస్తూ ఉంటారు. ఇపుడు అధికారంలో ఉన్నది తన ప్రభుత్వం అన్న విషయాన్ని ఆయన ప్రసంగ ఉధృతిలో మరచిపోతూంటారనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా గత ప్రభుత్వం ఇలా చేసింది అంటూ పోలిక తీసుకురావడం ద్వారా తాను చేసిన మంచి కంటే బాబు చెడ్డను చూపించాలనుకుంటున్నారా అనిపిస్తుంది. దాంతో మొత్తం ఫోకస్ కూడా మారిపోతోంది. జగన్ తన ప్రతిపక్ష భాషను మాత్రం గత వంద రోజుల్లో మార్చుకోలేదని అర్ధమవుతోంది.

అధికార దర్పంలో బాబు…

ఇక్కడ మరో ముచ్చట చెప్పుకోవాలంటే చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రిగానే భ్రాంతిలో ఉండడం. అధికారం పోయి అచ్చంగా వంద రోజులు పై దాటిపోతున్నా కూడా చంద్రబాబు తాను ఇంకా సీఎం గానే భావిస్తున్నారా అని ఆయన ప్రసంగాలు, తీరు చూస్తే అనిపిస్తుంది. చంద్రబాబు ఈ మధ్య వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినపుడు అక్కడ వారికి ఇళ్ళు కట్టిస్తాను, అన్ని విధాలుగా ఆదుకుంటామని అలవాటులో పొరపాటుగా హామీ ఇచ్చేశారన్నది వైరల్ అయింది. అదే విధంగా చంద్రబాబు అధికారులతో మాట్లాడుతున్నపుడు కానీ, పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లలో కానీ ఇంకా అధికార దర్పాన్ని చూపిస్తూనే ఉన్నారు. తనను ఎయిర్ పోర్టులో చెక్ చేస్తే బాబు గుస్సా అవుతున్నారు. తనని వైసీపీ సర్కార్ ఏ విషయంలోనూ పిలవడంలేదని, సంప్రదించడంలేదని కూడా బాబు గరం, గరం అవుతున్న తీరుని గమనిస్తే బాబు ఇంకా సీఎం గానే భావిస్తున్నారా అనిపిస్తోంది. మరి మరో వంద రోజులైనా ఈ ఇద్దరి వైఖరిలో మార్పు ఏమైనా వస్తుందా అంటే చూడాలి.

Tags:    

Similar News