బాబు ఫిక్సయ్యారు… జగన్ ను ఇరుకున పెట్టాలంటే?

చంద్రబాబుకు వైఎస్సార్ తో అనుబంధం నాలుగు దశాబ్దాల క్రితం నుంచే ఉంది. ఇద్దరి వయసు దాదాపుగా ఒక్కటే. ఇరుగు పొరుగు జిల్లాలకు చెందిన నాయకులు, ఇద్దరూ విద్యావంతులు, [more]

Update: 2020-05-26 15:30 GMT

చంద్రబాబుకు వైఎస్సార్ తో అనుబంధం నాలుగు దశాబ్దాల క్రితం నుంచే ఉంది. ఇద్దరి వయసు దాదాపుగా ఒక్కటే. ఇరుగు పొరుగు జిల్లాలకు చెందిన నాయకులు, ఇద్దరూ విద్యావంతులు, వెనకబడిన రాయలసీమ జిల్లాల నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరూ ఉన్నత పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసిన వారే. వైఎస్సార్ బతికి ఉన్నన్నాళ్ళూ చంద్రబాబు ఆయన్ని ఘాటుగానే విమర్శిస్తూ వచ్చారు. ఇక వైఎస్ హఠాన్మరణంతో పాటు, జగన్ రాజకీయ అరంగేట్రం తో వైఎస్సార్ ని కొంత పక్కన పెట్టి చంద్రబాబు నేరుగా జగన్ ని టార్గెట్ చేశారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్సార్ చంద్రబాబుకు దేవుడిగా కనిపిస్తున్నారు. వైఎస్సార్ చాలా మంచి వారు అంటూ నిండు అసెంబ్లీలోనే బాబు ఆ మధ్య పొగిడిన తీరు కూడా అందరినీ ఆలోచనలో పడవేసింది.

ఆ ఎత్తుగడతొనే……

జగన్ బలం అన్నది సగానికి పైగా వైఎస్సారే, తండ్రి రాజకీయ‌ పలుకుబడి, జనంలో ఉన్న ఆయన అభిమానమే పెట్టుబడిగా చేసుకుని జగన్ అధికారంలోకి వచ్చారు. అందువల్ల వైఎస్సార్ ని పెంచి జగన్ ని తగ్గించాలి. ఇదీ చంద్రబాబు ఎత్తుగడ, వైఎస్సార్ని ఇన్నాళ్ళూ ఎంతో కొంత నిందిస్తూ వచ్చిన చంద్రబాబు జగన్ సీఎం కాగానే ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. వైఎస్సార్ తన నేస్తమని, మంచి వారంటూ పొగుడుతూనే జగన్ ని చెడ్డ చేస్తూ వస్తున్నారు. ఇపుడు మధ్యలో జగన్ తాత రాజారెడ్డి ప్రస్థావనను తీసుకువస్తున్నారు. ఇది బాబు నోటి వెంట ఎన్నడూ వినని మాట. అంటే రాజారెడ్డితో జగన్ ని మిక్స్ చేసే మసాలా రాజకీయానికి చంద్రబాబు తెర తీశారన్న మాట.

రాజారెడ్డి బాటలో…..

జగన్ ది వైఎస్సార్ బాట అని జనం ఓటు వేశారు. జనానికి వైఎస్సార్ తెలుసు, ఆయన పధకాలు తెలుసు. రాజారెడ్డి పెద్దగా ఎవరికీ తెలియదు, కానీ సీమ జనాలకు ఆయన పరిచయం. ఇక రాజారెడ్డి పులివెందుల సర్పంచ్ గానే తన రాజకీయం ముగించారు. ఇపుడు రాజారెడ్డి ప్రస్తావన ఎందుకంటే ఆయన మీద బాగా ఫ్రాక్షన్ ముద్ర ఉంది. దాని వల్ల సీమ జిల్లాలతో పాటు రాజకీయం తెలిసిన వారు కొంత వ్యతిరేకత పెంచుకుంటారు. అందువల్ల వైఎస్సార్ మంచితనాన్ని జగన్ కి దూరం చేసి రాజారెడ్డి వారసత్వాన్ని అంటగట్టాలని చంద్రబాబు కొత్త ప్లాన్ వేశారనుకోవాలి. అందుకే రాజారెడ్డి బాటలో జగన్ నడుస్తున్నాడంటూ తాజాగా చంద్రబాబు సరికొత్త విమర్శలు గుప్పిస్తున్నారు.

వర్కౌట్ అయ్యేనా..?

నిజానికి జగన్ కి రాజారెడ్డి పోలికలు వచ్చాయని, ఆయన మాదిరిగానే మొండిగా ఉంటాడ‌ని మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి పలుసార్లు అంటూ వచ్చారు. అయితే చంద్రబాబు నోట మాత్రం రాజరెడ్డి పేరు వినడం ఇదే మొదటిసారి. జగన్ ని ఫ్యాక్షన్ లీడర్ గా జనాలకు చూపించాలనుకుంటున్న చంద్రబాబు రాజారెడ్డిని ముందుకు తెస్తున్నారు. తండ్రి వైఎస్సార్ చరిష్మాతో అధికారం పొందిన జగన్ తాతలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, ఏపీలో భయానక వాతావరణాన్ని స్రుష్టిస్తున్నారన్నది చంద్రబాబు అభిప్రాయం. దానికి రాజారెడ్డి మాస్క్ తగిలిస్తే జగన్ ఫేడౌట్ అవుతారని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. అందుకే ఇకపైన జగన్ ని రాజారెడ్డితో పోలిక పెట్టి సీమ జిల్లాల్లో ఆయన మర్యాదను, అభిమానాన్ని కొంతలో కొంత తగ్గించాల‌ని, మిగిలిన రాష్ట్రంలో కూడా చెడు భావన జనాల్లోకి వెళ్ళేలా చూడాలని చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి జగన్ ది తాత బాటా. తండ్రి బాటా అన్నది.

Tags:    

Similar News