వారు మారరు గాక మారరు.. ఇదే కదా అసలు నిజం

అంతే కదా మనిషి పుట్టిన దగ్గర నుంచి ఏ లక్షణాలు ఉంటాయో అవే చివరి వరకూ కొనసాగుతాయి. మధ్యలో మారమంటే ఎవరూ మారరు, మారలేరు కూడా. ఇక [more]

Update: 2020-04-28 14:30 GMT

అంతే కదా మనిషి పుట్టిన దగ్గర నుంచి ఏ లక్షణాలు ఉంటాయో అవే చివరి వరకూ కొనసాగుతాయి. మధ్యలో మారమంటే ఎవరూ మారరు, మారలేరు కూడా. ఇక ఏపీలో ఇద్దరు నాయకులు ఉన్నారు. వారిద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. ఒకరు రాజకీయ గండర గండడు చంద్రబాబునాయుడు అయితే మరొకరు వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్. ఈ ఇద్దరి గురించి ప్రత్యర్ధి పార్టీల నాయకులు మాట్లాడేటపుడు ఒక్కటే మాట అంటూంటారు మారాలి మీరు. ఇంకా అలాగేనా అని. మరో సందర్భంలో కోపంతోనో, వ్యగ్యంగానో వీరింతే మారరు అని కూడా అంటూంటారు.

బాబు అంతేనట….

ఈ మాట అన్నది ఎవరో కాదు, టీడీపీలోనే రాజకీయంగా పుట్టి అక్కడే తన అనుభవాన్ని పండించుకుని రెండున్నర దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తమ్మినేని సీతారాం. ఆయన ఇపుడు వైసీపీలో చేరి రాజ్యాంగ బధ్ధమైన స్పీకర్ పదవిలో ఉంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరు అంతే. ఇక ఆయన అసలు మారరు. ఆయన ధోరణి అలాంటిదే. ఎదుటివారిపైన బురద జల్లడం, తనను తాను పొగుడుకోవడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అంటూ చెడా మడా తిట్టేసారు. తనకు చంద్రబాబు గురించి ఎవరో వేరేగా చెప్పనక్కరలేదు. తాను స్వయంగా ఆయన్ని దగ్గరుండి చూశాను, చంద్రబాబు మారితే అది లోకానికే పెద్ద వింత‌ అంటూ వేదాంతం కూడా వల్లించారు.

జగన్ మొండి….

ఇక జగన్ దగ్గర కొన్నాళ్ళు సావాసం చేసి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ సబ్బం హరి లాంటి వారు అయితే జగన్ మొండి అంటారు. ఆయన గురించి మాకు తెలుసు కదా. వేరే చెప్పాలా? ఆయన ఎంత అంటే అంతే. ఎవరు చెప్పినా వినరు, ఆయన దారి ఆయనదే. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటారు అంటూ ఎపుడు మీడియా మైకు దొరికినా విరుచుకుపడుతూంటారు. మరో వైపు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటి వారు ఇన్నాళ్ళూ పార్టీ నాయకుడివి, ఇపుడు ముఖ్యమంత్రివి అయినా నీ తీరు మారదా జగన్. అయిదు కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా వ్యవహరించడం నేర్చుకో అంటూ గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.

భ్రమల్లో అలా….

ఇంకోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు మారరు అంతే అనేస్తున్నారు. ఆయనకు అధికారం పోయినా కూడా ముఖ్యమంత్రి దర్పం పోలేదని, ఇంకా తానే సీఎం అని భ్రమల్లోనే బతుకుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇంకోవైపు అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కూడా చంద్రబాబులో ఈర్ష్య, అసూయ ఎక్కువని, ఆయన మొదటి నుంచి ఇంతేనని అంటున్నారు. చంద్రబాబుకు కుర్చీ పోయిందన్న అక్కసుతోనే తమ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని కూడా రెడ్డి గారు అనేస్తున్నారు. మొత్త్తం మీద చూసుకుంటే చంద్రబాబు మారరు అని వైసీపీ నేతలు అంటూంటే జగన్ కూడా అంతేనని టీడీపీ తమ్ముళ్ళు లంకించుకుంటున్నారు. అవును కానీ ఎవరైనా ఎందుకు మారాలి. ఎవరికి వారే ప్రత్యేకం. అందుకే వారు చంద్రబాబు, జగన్ అయ్యారు అంటున్నారు తటస్థులు, మేధావులు. ఇదే కదా అసలు నిజం.

Tags:    

Similar News