అడ్రస్ లేదు.. అతీ గతీ లేదు.. నిలువునా ముంచేశారు

అసలే లక్షల కోట్లతో అప్పుల్లో ఉన్న రాష్ట్రం. విభజనతోనే లక్ష కోట్లు అప్పును బహుమానంగా మోసుకొచ్చిన రాష్ట్రం. సరైన ఆదాయ వనరు లేదు. రాజధాని అంతకంటే లేదు. [more]

Update: 2020-03-25 12:30 GMT

అసలే లక్షల కోట్లతో అప్పుల్లో ఉన్న రాష్ట్రం. విభజనతోనే లక్ష కోట్లు అప్పును బహుమానంగా మోసుకొచ్చిన రాష్ట్రం. సరైన ఆదాయ వనరు లేదు. రాజధాని అంతకంటే లేదు. టైర్ వన్ సిటీ ఒక్కటి కూడా లేని ఏపీ అన్ని విధాలుగా అన్యాయమైపోతోంది. దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి అతీ గతీ లేకుండా ఉంది. దానికి తోడు విభజన తరువాత మరింతగా దారుణమైన రాజకీయాలతో ఏపీ పూర్తిగా చితికిపోయింది. ఇక్కడ సీనియర్లు అని చెప్పుకుంటున్న బడా పార్టీల రాజకీయ‌ నాయకులు సైతం స్వార్ధ రాజకీయమే నడుపుతున్నారు. ఫలితంగా అయిదు కోట్ల మంది ప్రజలు దారుణంగా నష్టపోతున్నారు.

నాడూ..నేడూ ….

చంద్రబాబు ఆయన పార్టీ తీరు ఆడలేక మద్దెలోడు అన్నట్లుగా ఉందని విమర్శలు ఉన్నాయి. ఏపీ ఆర్ధిక పరిస్థితి చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అటువంటి పెద్ద మనిషి తాను ముఖ్యమంత్రిగా ఉండగా, తాను ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న ఎస్ఈసీ రమేష్ కుమార్ ఉండగా 2018 ఆగస్ట్ లో ఎందుకు పెట్టలేకపోయారో చెప్పాలి. సరే ఇప్పటికైనా ఎన్నికలు జరుగుతూంటే దానికి కూడా తెర వెనక ఎత్తులతో గండి కొట్టేశారు. మరి అలా ఎన్నికలను అపుడూ ఇపుడూ వద్దనుకున్న చంద్రబాబు స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కాకుండా, రాకుండా చేశారని వైసీపీ నేతలు అంటున్నారు.

జగన్ తప్పు….

తాను అధికారంలోకి బంపర్ మెజారిటీతో వచ్చారు. అలా ఇలా కాకుండా 87 శాతం పైగా సీట్లను గెలుచుకుని వచ్చారు. అలా వచ్చిన వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఈపాటికి నిధులు సమృద్ధిగా వచ్చి పల్లెలు కళకళలాడేవి. కానీ జగన్ పధకాల చూపిన శ్రధ్ధ పంచాయతీల మీద చూపించలేకపోయారు. నిజంగా జగన్ నాడే తలచుకుంటే ఆగస్ట్ నాటికి ఎన్నికలు పూర్తి అయ్యేవి. 1994 డిసెంబర్ లో అన్న ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. 1995 ఫిబ్రవరిలో ఉమ్మడి ఏపీలో స్థానిక ఎన్నికలు జరిపించారు. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే. మరి ఆ సోయి జగన్ కి లేకపోయే. చివరకాఖరున ఎన్నికలు పెట్టేసి పబ్బం గడుపుకుందామనుకుంటే చంద్రబాబు లాంటి వారు ఊరుకుంటారని ఎలా అనుకున్నారో.

తలా పిడికెడూ…

ఇక ఏపీలో ఉన్నామా లేమా అన్నట్లుగా రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. మరో వైపు జనసేన ఏక నాయకత్వాన‌ సాగుతోంది. వామపక్షాలు కాలం చెల్లిన సిధ్ధాంతాలతో రాధ్ధాంతం చేస్తూ ఉనికిపాట్లు పడుతున్నాయి. ఈ పార్టీలన్నిటికీ రాష్ట్ర క్షేమం, సంక్షేమం పట్టడంలేదు. రెండు ప్రధాన పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతూంటే తాము కూడా సై అంటున్నాయి. కనీసం మంచి చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోయే. ఈ రాజకీయ మారణ‌హోమంలో తామూ పాలుపంచుకుంటే ఒక సీటు అయినా దక్కకపోతుందా అన్న స్వార్ధమే తప్ప ఈ పక్షాలకు ఏపీ విస్తృత ప్రయోజనాలు గురించి ఆలోచన ఎక్కడా రావట్లేదు. మొత్తానికి ఇది ఏపీ ప్రజల దురదృష్టం అనుకోవాలి. కేంద్రం సొంతంగా నిధులు ఇవ్వడానికి మనసు ఒప్పదు, రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన అయిదు వేల కోట్ల పై చిలుకు భారీ నిధులకు మన రాజకీయ నేతలే గండి కొట్టేశారు. అలా ప్రజల సొమ్ము రాజకీయానికి బలి అయిపోయింది. వెరసి ఏపీ రాజకీయ శాపగ్రస్థ. అంతే.

Tags:    

Similar News