బాబు రాజకీయానికి జగన్ డైరెక్షన్..?

అదేంటి. రాజకీయంగా తలపండిన చంద్రబాబుకు మరొకరు డైరెక్షన్ చేయడం అవసరమా అన్న ప్రశ్న రావచ్చు. అపర చాణక్యుడు చంద్రబాబుకు మరొకరు తోవ చూపించడం ఏంటి అన్న అసహనం [more]

Update: 2020-10-15 00:30 GMT

అదేంటి. రాజకీయంగా తలపండిన చంద్రబాబుకు మరొకరు డైరెక్షన్ చేయడం అవసరమా అన్న ప్రశ్న రావచ్చు. అపర చాణక్యుడు చంద్రబాబుకు మరొకరు తోవ చూపించడం ఏంటి అన్న అసహనం కూడా అభిమానుల్లో కలగవచ్చు. కానీ కొన్ని సార్లు రాజకీయాల్లో కార్నర్ అవుతున్నపుడు రెండు పార్టీలు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ భీకరమైన సమరం చేస్తున్నపుడు కానీ ఉన్నవి రెండే ఆప్షన్స్ అయితే కచ్చితంగా బలమున్న వారికి అగ్ర తాంబూలం దక్కుతుంది. వారి వదిలేసిందే రెండవవారి పరమవుతుంది. కృష్ణుడు ఒక్కడే మాకు చాలు అని అర్జునుడు అనబట్టే రెండవ మాట లేకుండా ధుర్యోధనునికి మొత్తం యాదవ సైన్యం దక్కింది. ఇపుడు మోడీ శ్రీక్రిష్ణుడు అయితే మొదటి ఛాన్స్ జగన్ కే వచ్చింది.

జగన్ బట్టే సీన్ అలా……

ఏపీ రాజకీయాల్లో జగన్ బలమైన నేతగా ఉన్నారు. ఆయన ఎటువైపు ఉంటే మిగిలిన రెండవ వైపే చంద్రబాబు రాజకీయం ఆడాలి. అందులోనే ఆయన తన ఆకాంక్షలను పండించుకోవాలి. ఇపుడు ఏపీలో సీన్ చూస్తే చంద్రబాబు మోడీ ఆసరా, అండ గట్టిగా కోరుకుంటున్నారు. అది ఆయన బయటకు కూడా చెప్పేసుకుంటున్నారు. కానీ మోడీ చూపు జగన్ మీద ఉంది. జగన్ తో కలసి నడవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఆ విషయం జగన్ చెవిన వేయడం కూడా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కోర్టులోనే ఇపుడు బంతి ఉంది. జగన్ తీసుకునే నిర్ణయమే అటు బాబుతో సహా ఏపీలోని విపక్ష రాజకీయాన్ని నిర్దేశిస్తుంది.

ఓకే అంటే …..

జగన్ మోడీ, బీజేపీ చేస్తున్న ప్రతిపాదనకు ఓకే చెప్పి ఎన్డీయేలో చేరితే కచ్చితంగా చంద్రబాబుకు దిమ్మతిరిగే నిర్ణయమే అవుతుంది. రాజకీయంగా చంద్రబాబుకు ప్రధాన‌మైన గేటు మూతపడినట్లే అవుతుంది. కానీ బాబు ఏమీ చేయలేరు. కాబట్టి అర్జంటుగా హిందూత్వ అజెండాని వదిలించుకుంటారు. కాషాయం మీద కస్సుమంటారు. ఆ వెంటనే కమ్యూనిజం మీద నిజాలు చెబుతారు. కాంగ్రెస్ తోనే దోస్తీకి అర్రులు చాస్తారు. ఏపీలోనే కాదు, జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమిలోకి దూకేందుకు రెడీ అవుతారు. ఇదంతా చంద్రబాబు రెండవ వైపు రాజకీయ ఆటగా ఉంటుంది.

నో చెబితే ఇలా……

ఇక జగన్ ఎన్డీయేలో చేరను అంటూ సున్నితంగా తిరస్కరిస్తే చంద్రబాబు ఆశలు రెట్టింపు అవుతాయి. ఎందుకంటే ఏపీలో బీజేపీ జనసేన కలసినా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు, వైసీపీ తరువాత రాజకీయంగా బలంగా ఉన్న పార్టీ టీడీపీ కాబట్టి ఇపుడు కాకపోయినా ఎన్నికల వేళ అయినా టీడీపీతో చేతులు కలిపేందుకు బీజేపీ రెడీ కావచ్చు. అలా ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక జగన్ తన దోవ తనది అన్నట్లుగా అంశాలవారీగా కేంద్రానికి మద్దతు ఇచ్చి ఏపీలో సొంత రాజకీయం చేసుకోవచ్చు. 2024 నాటికి అప్పటి పరిస్థితులను బట్టి అన్ని ఆప్షన్లను దగ్గర పెట్టుకోవచ్చు. అయితే జగన్ మోడికి నో చెబితే చంద్రబాబును మాత్రం రాజకీయంగా బలోపేతం చేసే విధంగా నిర్ణయం ఉంటుంది. అందువల్లనే జగన్ ఊగిసలాటలో ఉన్నారని టాక్. తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు అసలు ఏ రూటూ లేకుండా పాలిటిక్స్ నుంచి ఎలిమినేట్ చేయాలన్నదే జగన్ ఎత్తుగడగా ఉందిట. చూడాలి మరి. ఆయన మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో.

Tags:    

Similar News