ఏపీలో ఏదీ కంట్రోల్ లో లేదా?

“ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వైసీపీ నేతలు గూండాల్లాగా మారారు. రోజూ దాడులు జరుగుతున్నాయి.” ఈ [more]

Update: 2020-09-16 06:30 GMT

“ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వైసీపీ నేతలు గూండాల్లాగా మారారు. రోజూ దాడులు జరుగుతున్నాయి.” ఈ మాటలు టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెప్పే మాటలు. సాధారణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో బతికేందుకు ఇబ్బంది పడుతున్నారా? ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేవా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పదే పదే అదే విమర్శలు…..

చంద్రబాబు పదే పదే జగన్ ప్రభుత్వంపై ఇదే రకమైన విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఇదే తరహా విమర్శలు చేశారు. జగన్ కు ఓటేస్తే పులివెందుల బ్యాచ్ దిగుతుందని, ఇళ్లల్లో మహిళలకు కూడా రక్షణ లేకుండాపోతుందని చంద్రబాబు తన ఎన్నికల ప్రచారం లో చెప్పారు. అయినా ఆ ఎన్నికల్లో ప్రజలు ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. వైసీపీకే మద్దతుగా నిలిచారు.

అధోగతి పాలయిందని….

ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు ఇదే రకమైన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఓంప్రతాప్ అనే యువకుడు మృతిని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. దీంతో చంద్రబాబును కట్టడి చేసేందుకు పోలీసులు ఆధారాలను సమర్పించాలని నోటీసులు జారీ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ బ్యాచ్ వల్లనే రాష్ట్రం అధోగతి పాలయిందని పదే పదే చెబుతున్నారు.

పెద్దగా ప్రయోజనం లేదంటూ….

ఇటువంటి ప్రచారం వల్ల చంద్రబాబుకు పెద్దగా ఉపయోగం ఏదీ ఉండదని చెబుతున్నారు విశ్లేషకులు. పదే పదే అదే విమర్శలు చేయడం వల్ల జనానికి ఎక్కదని, ఏదైనా కొత్త విమర్శలు చేస్తే ఉపయోగం ఉంటుదని సూచిస్తున్నారు. జగన్ కు ప్రభుత్వాన్ని నడపటం చేతకాదని కూడా పదే పదే చెప్పడం కూడా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన పాత పద్ధతిలోనే విమర్శలు చేస్తుండటం పార్టీలోనే చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News