విభజన కంటే పెద్ద అన్యాయం ?

ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయింది. సరే నాడు రాజకీయం కొసం అంతా సమైక్య నినాదం వినిపించారు. దాంతో కొత్త రాష్ట్రం ఏపీకి ఏం కావాలో నిర్దిష్టంగా ఎవరూ [more]

Update: 2020-08-21 13:30 GMT

ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయింది. సరే నాడు రాజకీయం కొసం అంతా సమైక్య నినాదం వినిపించారు. దాంతో కొత్త రాష్ట్రం ఏపీకి ఏం కావాలో నిర్దిష్టంగా ఎవరూ ఏదీ అడగలేకపోయారు. కానీ నాడు కేంద్రంలోని పెద్దలు ఏపీకి ఎంతో కొంత ప్రయోజనం కలిగించే పని చేశారు. అందులో నుంచి వచ్చిందే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. పదేళ్ల పాటు భాగ్యనగరం అండగా ఉంటుందని ఇచ్చే అభయం ఇది. అంటే కేంద్రం దృష్టిలో ఒక కొత్త రాజధాని నిర్మాణం పూర్తి అయి కొంత అక్కడ యాక్టివిటీ అక్కడ మొదలు కావడానికి పదేళ్ళు కనీసంగా పడుతుందని వేసిన అంచనా ఇది. ఇక అప్పటికీ ఏమీ కాకపోతే మరో అయిదేళ్ళు కూడా అడిగి ఉమ్మడి రాజధాని హక్కులను పెంచుకునే వెసులుబాటు ఎటూ ఉంటుంది.

నోటి దాకా వచ్చినా….

ఇక ఏపీలోని పదమూడు జిల్లాల యువతకు ఇప్పటికీ హైదరాబాదే ఉపాధికి ఆధారం. అటువంటి హైదరాబాద్ ని ఏపీకి కాకుండా చేసిన ఘనతను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం చేసుకున్నారని చెప్పాలి. 2014లో ముఖ్యమంత్రి అయిన ఆయన కేవలం ఏడాది పాటు మాత్రమే హైదరాబాద్ లో ఉన్నారు. ఓటుకు నోటు కేసు కారణంగా ఆయన ఏపీకి పరుగులు తీశారని చెబుతారు. దాంతో అమరావతి పేరిట మిగిలిన నాలుగేళ్ళూ చేసిన విన్యాసం దేశం మొత్తం చూసింది. ఇక ఆయన్ని అందుకే జనం కూడా ఓడించారు. జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అంటున్నారు. సరే ఇదిపుడు ప్రక్రియ దశలోనే ఉంది. మొత్తానికి ఏపీలోని యువతకు ఒక రాజధాని లేకుండా పోయింది. అంటే వారికి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అర్ధం

లోకల్ నినాదంతో …..

ఇపుడు తెలంగాణా ప్రభుత్వం లోకల్ నినాదాన్ని వినిపిస్తోంది. హైదరాబాద్ లో కొత్తగా పెట్టే పరిశ్రమల్లో స్థానికులకు మాత్రమే అవకాశాలు వస్తాయి. అంటే తెలంగాణా యువతకు మాత్రమే అన్నమాట. అదే ఏపీలోని పదమూడు జిల్లాల వారికిపుడు ఈ పరిణామమే ఇబ్బంది పెడుతోంది. ఏపీ ఉమ్మడి రాజధానిగా ఉండకుండా బాబు అమరావతిని రాజధానిగా మార్చేసి గెజిట్ నోటిఫికేషన్ తెప్పించారు. ఇక అమరావతి ఎప్పటికి అవుతుందో ఎవరికీ తెలియదు. మరో వైపు మూడు రాజధానులు కూడా ఒక కొలిక్కి వచ్చేసరికి టైం పడుతుంది. కానీ తెలంగాణాలో స్థానికులకే ఉద్యోగాలు అంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దాని వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆంధ్రా, రాయలసీమ యువతే.

హక్కులు లేవా ..?

చంద్రబాబు అయిదేళ్ల పాలనతో తాను పెట్టే బేడా సర్దుకుని బెజవాడ వచ్చేశారు కానీ ఇక్కడ కొత్త రాజధాని పూర్తి అవడానికి ఎన్నాళ్ళు పడుతుంది. అంతవరకూ యువత భవిష్యత్తు ఏంటి అన్నది ఒక దార్శనీకుడుగా ఆలోచన చేయలేదు. అలా చేసి ఉంటే ఇపుడు యువత నష్టపోకుండా ఉండేవారు. కానీ చంద్రబాబు ఎంతసేపూ రాజకీయమే చూసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బంగారం లాంటి ఉమ్మడి రాజధానిని తెలంగాణాకు వదిలివేయడమే కాదు, యువత ఉపాధి హక్కులను కూడా చంద్రబాబు వదిలేశారు. దాంతో ఇపుడు భారీగా నష్టపోయేది యువతరమే.

సఖ్యతతోనే …..

ఇపుడు జగన్ సర్కార్ మరో నాలుగైదేళ్ల తరువాత అయినా విశాఖను ఏదో విధంగా అభివృధ్ధి చేస్తే యువతకు అవకాశాలు వస్తాయి. ఈలోగా సఖ్యతతో కేసీయార్ సర్కార్ ని ఒప్పించాలి. స్థానిక‌త విషయంలో ఉదారంగా ఉండేలా ఒప్పించాలి. అది కనుక చేసినట్లైతేనే యువతకు ఉపాధికి కొంత భరోసా వస్తుంది. అదే సమయంలో ఏపీలో కూడా పారిశ్రామికంగా అభివృధ్ధికి జగన్ సర్కార్ గట్టి కృషి చేయాలి. కేంద్రం కూడా కనీసం ప్రత్యేక హోదా ఇచ్చినట్లైతే వెల్లువలా పరిశ్రమలు వచ్చి ఏపీలో ఉపాధి అవకాశాలు మెరుగు అయ్యేవి. కానీ రాజకీయ వైకుంఠపాళిలో టీడీపీ సహా పార్టీలు అన్నీ చిక్కుకున్నాయి. యువత భవిత ప్రశ్నార్ధకం అవుతోంది. దీని నుంచి బయట వేయాల్సిన బాధ్యత పాలకులదే.

Tags:    

Similar News