ఆ అద్భుతం జరుగుతుందా ?

చాలా విషయాల్లో తమిళులు దేశానికి ఆదర్శప్రాయులు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రులకు ఇంకా ఎక్కువగా ఆదర్శంగా ఉంటారు. తమిళనాడు పౌరులు కట్టు బొట్టు, భాష, వ్యవహారాల విషయంలో అసలు [more]

Update: 2020-11-13 00:30 GMT

చాలా విషయాల్లో తమిళులు దేశానికి ఆదర్శప్రాయులు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రులకు ఇంకా ఎక్కువగా ఆదర్శంగా ఉంటారు. తమిళనాడు పౌరులు కట్టు బొట్టు, భాష, వ్యవహారాల విషయంలో అసలు ఎక్కడా రాజీపడరు. చలి రాష్ట్రమైన ఢిల్లీలో శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు జరిగినా తమ అడ్డ పంచె కట్టు అలవాటును అసలు మార్చుకోరు. తాము ఎంత విద్యాధికులు అయినా, ఆంగ్ల భాషా పాండిత్యం అపరిమితంగా ఉన్నా కూడా పార్లమెంట్ లో తమిళంలోనే మాట్లాడడం వారికే చెల్లు. అంతలా రాష్ట్రంతో మమేకం అవుతారు కాబట్టే రాష్ట్ర ప్రయోజనాలా విషయంలో వారు ఎంతదాకా అయినా వెళ్తారు, అక్కడ రాజకీయాలు పక్కకు పోతాయి. తమ రాష్ట్రానికి ఒక్క పైసా కేంద్రం తేడా చేసినా అగ్గి రాజేస్తారంతే.

జల్లికట్టు స్పూర్తి….

జల్లి కట్టు క్రీడ విషయంలో కేంద్రం ఆంక్షలు ఎక్కడా చెల్లలేదు. ఇది మా సంప్రదాయం, మేము పాటిస్తాం అంతే అని తమిళులు గర్జించారు. ఇక కేంద్రం కూడా దిగిరాక తప్పలేదు. అంతే కాదు, కేంద్ర ప్రాజెక్టుల విషయంలోనూ వారు అలాగే ఉంటారు. నిజానికి తమిళనాట రాజకీయాలు చాలా భయంకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా కూడా వెళ్తారు, కానీ చిత్రంగా తమిళనాడు అనగానే అన్నీ మరచిపోయి ముందుకు వస్తారు. ఒక్కటిగా కలసిపోతారు. మరి ఆ స్పూర్తిని ఏపీ రాజకీయ జనాలు తీసుకున్నారా అన్నదే ఇక్కడ డౌట్.

ఇప్పటికే చితికిపోయింది…..

విభజన విషయంలోనూ ఏపీలోని రాజకీయ పార్టీలు ఒక్క మాట చెప్పలేదు. తమ సొంత రాజకీయాన్నే చూసుకున్నారు. ఫలితంగా కేంద్రం తాము ఏం చేయాలో అదే చేసుకుంది. మరి ఆ ఇచ్చిన హామీలైనా నెరవేరాయా, అసలు లేదుగా. ఏపీలోని అయిదు కోట్ల ప్రజలు ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం రాష్ట్రం విడిచి పోతున్నారు. రేపటి తరం కధ కూడా అచ్చం ఇలాగే ఉండబోతోంది అనిపించేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఏపీకి ఇంతటి అన్యాయం జరిగింది. కేంద్రంలోని పెద్దలు సునాయాసంగా చేస్తున్నారు. అదే తమిళనాడు కానీ, కర్నాటక కానీ, పొరుగున ఉన్న తెలంగాణా కానీ అయితే ఇలా చేయగలరా అన్నదే మేధావుల ప్రశ్న.

కలవాల్సిందే …..

ఏపీలో జగన్, చంద్రబాబుల మధ్యన దారుణమైన స్థాయిలో రాజకీయం సాగుతోంది. ఇద్దరూ కనీసం ముఖాముఖాలు చూసుకోరు. కానీ ఇక్కడ వారు కచ్చితంగా మాట్లాడుకోవాలి. కలవాలి. ఎందుకంటే ఇది వారి ఇంటి సమస్య కాదు, వారి వ్యక్తిగత ఆస్తుల సమస్య అంతకంటే కాదు, అయిదు కోట్ల ప్రజలు ఉన్న రాష్ట్రం. ఒక్కో హామీనీ కేంద్ర పెద్దలు తుంగలో తొక్కుతూంటే ఏపీలోని పార్టీలు ఒకరిని ఒకరు ఆరోపించుకుంటూ మధ్యలో కేంద్రాన్ని వదిలేసే దిగజారుడు రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అంతా కోరుతున్నారు. కనీసం రాష్ట్రం కోసమైనా జగన్ బాబు ఒకే గొంతు వినిపిస్తే కేంద్రం గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది. అపుడు ఒక్కోటీ ఏపీకి హక్కులుగా అలా వస్తాయి. మరి అది జరిగే పనేనా. ఆ అద్భుతం జరుగుతుందా.

Tags:    

Similar News