వారు వీరయ్యారుగా… జెండాలు మార్చేశారుగా

తొమ్మిది నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఏదైనా ఉందంటే అది ప్రతిపక్షం నుంచి వైసీపీ అధికార పక్షానికి మారడమే. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. కానీ ఎందుకో [more]

Update: 2020-03-13 00:30 GMT

తొమ్మిది నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఏదైనా ఉందంటే అది ప్రతిపక్షం నుంచి వైసీపీ అధికార పక్షానికి మారడమే. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. కానీ ఎందుకో విపక్షాల్లోనే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న జనసేనాని ఈసారికి కాషాయధారిగా మారాడు. ఆయన బీజేపీతో చేతులు కలిపాడు. ఇది ఊహించని వింతే. కామ్రేడ్స్ ఎక్కడ. కాషాయం ఎక్కడ. చెగువేరా ఎక్కడ, ఆర్ఎస్ఎస్ ఎక్కడ. ఎన్నో ఎర్ర సిధ్ధాంతాలను వల్లించిన పవన్ ఇప్పుడు ఇలా ప్లేట్ మార్చాడు. ఆయనకు అండ కావాలి. అదే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఆ అండ కావాలి. బయటకు అది చెప్పకుండా దేశం, జాతి అంటూ ఏవేవో చెప్పుకున్నారు.

బాబు మంచోడు…

బాబు అధికారం పోయి ఇంకా ఏడాది కూడా కాలేదు. ఏపీని బాబు సర్వనాశనం చేశాడని ఊరూరా తిరిగి డప్పు వాయించిన కామ్రేడ్స్ ఇపుడు పోయి పోయి బాబు పంచన చేరాలని చూస్తున్నాయి. చంద్రబాబు పార్టీతో పొత్తు పెట్టుకుంటామని సీపీఐ నారాయణ చెబుతున్నారు. ఇప్పటికే ఎర్రన్నలు ఇద్దరూ కలిశారు. బాబుతో దోస్తీ చేసి కూటమి కట్టాలనుకుంటున్నారుట. అయితే సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తానంటోంది. మరి చంద్రబాబుని ఇన్నేసి అన్న మాటలు జనం చెవిలో ఉండగా అదే చెవిలో పువ్వులు పెట్టి మరీ పొత్తులు పూయించుకోవడం దివాళాకోరు రాజకీయమేనని అంటున్నారు.

భయమేనా..?

ఇలా విపక్షాలు విచిత్ర పొత్తులతో విన్యాసం చేయడానికి కారణం జగన్ భయమేనని చెబుతున్నారు. 151 మంది ఎమ్మెల్యేలో జగన్ బలంగా కనిపిస్తున్నారు. ఆయన్ని ఓడించడం అంటే కష్టమన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే ఈ పొత్తుల ఎత్తులు వేశారని అంటున్నారు. మరో చిత్రమేంటంటే పవన్ ఇప్పటికీ చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని మంత్రి పేర్ని నాని అంటున్నారు. అటు బీజేపీకి, ఇటు బాబుకు సంధానకర్తగా పవన్ ఉన్నారని, బలమున్న చోట ఒకరికి ఒకరు సహకరించుకోవాలన్న లోపాయికారి పొత్తులు కూడా కుదిరాయని ఆయన అంటున్నారు. మరో వైపు నిన్నటి దాకా తిట్టుకుని ఇపుడు కొత్తగా కలసి జనాలను మోసం చేస్తున్నారని మరో వైసీపీ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి అంటున్నారు. బాబులో ఏం చూసి కలుస్తున్నారో కామ్రెడ్స్ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఎంత మంది కలసినా…?

ఇక టీడీపీలో ఉన్న మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి ఈ పొత్తులు, ఎత్తుల మీద తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా మా జగన‌బ్బాయే గెలుస్తాడని అంటున్నారు. అదే విధంగా విపక్షాలు అందరూ ఒక్కటై కలసి వచ్చినా కూడా జగన్ ని ఓడించడం అసాధ్యమని కూడా ముందే ఫలితాలు చెప్పేస్తున్నాడు. ఏపీలో ఇపుడున్న పరిస్థితుల్లో ఎంతటి బలవంతుడు పోటీ చేసినా జగనే గెలుస్తాడని, అదే లోకల్ బాడీ ఎన్నికల స్పెషాలిటీ అని ఆయన సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి తొమ్మిది నెలలు తిరగకుండానే వారు వీరవుతున్నారు. మరి జనాలు ఎవరి వైపు ఉన్నారో చూడాలి.

Tags:    

Similar News